టి20 ప్రపంచ కప్ ఫైనల్ : భారత పవర్ ప్లే వ్యూహం, ఆసీస్ భయమదే!

By Sree sFirst Published Mar 7, 2020, 1:23 PM IST
Highlights

ఫిబ్రవరి 21న టీ20 వరల్డ్‌కప్‌ ఎలా మొదలైందో, మార్చి 8న అదే విధంగా ముగిసేందుకు రంగం సిద్ధమైంది. ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో పోటీపడిన భారత్‌, ఆస్ట్రేలియాలు తిరిగి వరల్డ్‌కప్‌ ఫైనల్లోనూ పోటీపడుతుండడం విశేషం. 

రెండు వారాల పాటు అభిమానులకు అత్యంత వినోదాన్ని పంచిన ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్‌ తుది అంకానికి చేరుకుంది. రిజర్వ్‌ డే లేని సెమీఫైనల్స్‌ పై అభిమానులు, క్రికెట్ పండితులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ... రెండు అత్యుత్తమ జట్లే టైటిల్‌ పోరుకు రెఢ అయ్యాయి. 

ఫిబ్రవరి 21న టీ20 వరల్డ్‌కప్‌ ఎలా మొదలైందో, మార్చి 8న అదే విధంగా ముగిసేందుకు రంగం సిద్ధమైంది. ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో పోటీపడిన భారత్‌, ఆస్ట్రేలియాలు తిరిగి వరల్డ్‌కప్‌ ఫైనల్లోనూ పోటీపడుతుండడం విశేషం. 

రికార్డు స్థాయిలో ఆరోసారి ఫైనల్లోకి ప్రవేశించిన ఆస్ట్రేలియా ఇప్పటికే నాలుగు టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీలు సొంతం చేసుకుంది. అంతిమ సమరంలో ఎలా ఆడాలో ఆసీస్‌కు పెద్ద సమస్య కాదు. 

సొంతగడ్డపై ఆడుతున్న అనుకూలత ఆస్ట్రేలియాను అదనపు బలం. విశేషంగా పెరిగిన ప్రేక్షకాదరణ, టైటిల్‌ విజయంపై బిలియన్‌ ప్రజల ఆకాంక్షలు తీసుకొచ్చిన ఎనలేని ఒత్తిడి టీమ్‌ ఇండియాపై మానసికంగా బలీయమైన ప్రభావాన్ని చూపే ఆస్కారం ఉంది. 

గ్రూప్‌ దశ మ్యాచులను ప్రణాళిక బద్దంగా ముగించిన టీమ్‌ ఇండియా, మానసికంగా ఎంతో ఉన్నతంగా కనిపిస్తోంది. డ్రెస్సింగ్‌రూమ్‌ సభ్యులు గతంలో కంటే ఎంతో మెరుగైన సంబంధాలు కొనసాగిస్తున్నారు. టీం మధ్య రాపో బాగుంది. 

మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియాది తిరుగులేని ఆధిపత్యం. 2016లో ఆసీస్‌ను కంగారూ గడ్డపైనే టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌ చేసిన అప్పటి జట్టు.... భారత మహిళా క్రికెట్లోనే కొత్త ఊపిరులూదింది. 

ఇప్పుడు ఆస్ట్రేలియాను చూసి భారత్‌ భయపడే పరిస్థితి ఎంతమాత్రం కనిపించటం లేదు. ఆస్ట్రేలియాతో చివరి ఐదు టీ20 మ్యాచుల్లో భారత్‌ 3-2తో మెరుగైన ముఖాముఖి రికార్డు కలిగి ఉంది. తొలి ప్రపంచకప్‌ వేటలో టీమ్‌ ఇండియా అంతిమ పోరులో అనుసరించాల్సిన వ్యూహంపై ఓ లుక్కేద్దాం. 

పవర్‌ ప్లే వ్యూహం : 

టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్‌ ఇండియా ఓ ట్రెండ్‌ సృష్టించింది. తొలుత బ్యాటింగ్‌ చేసి, ఓ మోస్తరు స్కోరు చేయటం. స్వల్ప ఛేదనల్లో ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేసి బౌలర్లు విజయాల్ని అందించటం. పవర్‌ ప్లేలో భారత్‌ అనుసరించిన వ్యూహం ఆసక్తికరంగా ఉంది. 

బంతితో పవర్‌ప్లేలో అవతలి టీంలను కట్టడి చేసే భారత్‌, బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తోంది. ఫైనల్లోనూ ఇదే వ్యూహం పక్కాగా అమలు చేయాల్సి ఉంది. గ్రూప్‌ దశలో నాలుగు మ్యాచుల్లోనూ భారత బౌలర్లు పవర్‌ ప్లేలో రన్‌రేట్‌ 6 దాటనీయలేదు. 

మూడు మ్యాచుల్లో పవర్‌ ప్లేలో కేవలం ఒకే ఒక్క వికెట్‌ తీసింది. ఆస్ట్రేలియాపై 33/1, బంగ్లాదేశ్‌పై 33/1, న్యూజిలాండ్‌పై 30/2, శ్రీలంకపై 35/1తో మెరిసింది. ఆస్ట్రేలియా టాప్‌ ఆర్డర్‌లో అలిసా హేలీ, బెత్‌ మూనీ పవర్‌ ప్లేలో ప్రమాదకర బ్యాటర్లు. 

అలిసా హేలీ 161, బెత్‌ మూనీ 181 పరుగులతో టోర్నీలో టాప్‌ గేర్‌లో కొనసాగుతున్నారు. సిడ్నీ మ్యాచ్‌లో హేలీ, మూనీలను భారత్‌ సమర్థవంతంగా కట్టడి చేసింది. భారత పేసర్ల రక్షణాత్మక వ్యూహం, ఆసీస్‌ బ్యాటర్ల ఎదురుదాడి వ్యూహంలో ఎవరి పైచేయో చూడాలి.

భారత జట్టు ఇదే వ్యూహంతో ముందుకెళ్లడానికి సిద్ధపడుతోంది. ఇదే వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి రేపటి మ్యాచులో ఎలాగైనా గెలిచి ప్రపంచ కప్ ను ఎగరేసుకొని ఇండియాకి తిరిగిరావాలని భారత్ పట్టుదలతో ఉంది. 

click me!