INDW vs PAKW: గ్రౌండ్ లో పోరాటం.. డ్రెస్సింగ్ రూమ్ లో ఆత్మీయత.. భారత్-పాక్ మ్యాచులో అరుదైన దృశ్యం

Published : Mar 07, 2022, 01:46 PM IST
INDW vs PAKW: గ్రౌండ్ లో పోరాటం.. డ్రెస్సింగ్ రూమ్ లో ఆత్మీయత.. భారత్-పాక్  మ్యాచులో అరుదైన దృశ్యం

సారాంశం

ICC Women's World Cup 2022 :  దాయాది దేశాల మధ్య  వైరం ఈనాటిది  కాదు. సరిహద్దుల్లోనే కాదు క్రీడా మైదానాల్లో కూడా  రెండు దేశాల  ప్రజలు ఒకరిమీద ఒకరు కత్తులు దూస్తూనే ఉంటారు. కానీ మహిళల  ప్రపంచకప్ లో మాత్రం..  

ఇండియా-పాకిస్థాన్..  ఈ రెండు దేశాల మధ్య  సరిహద్దుల్లోనే  కాదు,  ఏ అంశంలో జరిగే ఏ విషయమైనా ఇరు దేశాల ప్రజలను ఎంతో ప్రభావితం చేస్తుంది. ఇక  క్రీడల్లో.. మరీ ముఖ్యంగా రెండు దేశాల ప్రజలు  ఎంతో ఇష్టపడే క్రికెట్ లో అయితే చెప్పక్కర్లేదు.  భారత్-పాక్ మ్యాచ్ అంటే ఎంత పని ఉన్నా పక్కనబెట్టి టీవీలకు అతుక్కుపోయే అభిమానులు కోట్లాది మంది ఉన్నారు. మ్యాచులు జరుగుతున్నప్పుడు అభిమానుల సంగతేమో గానీ.. వాళ్ల అంచనాలు మోసే  క్రికెటర్ల భావోద్వేగాలు పీక్స్ లో ఉంటాయి.  ఒక్కోసారి  వాళ్లు కంట్రోల్ తప్పిపోయి గొడవ పడ్డ సందర్భాలు చూశాం.  ఐసీసీ మహిళల ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం  భారత్-పాకిస్తాన్ ల మధ్య జరిగిన  మ్యాచ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు.  మ్యాచ్ ఫలితం గురించి కాసేపు పక్కనపెడితే  మ్యాచ్ ముగిశాక  ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. 

పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టు సారథి బిస్మా మరూఫ్  కు ఆరునెలల చిన్నారి ఉంది. పేరు ఫాతిమా. ఒకవైపు కూతురు ఆలనా పాలనా చూస్తూనే మరోవైపు  జాతీయ జట్టును కూడా నడిపిస్తున్నది. అయితే నిన్నటి మ్యాచ్ ముగిశాక పలువురు  టీమిండియా క్రికెటర్లు.. పాక్ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి కాసేపు ఆటగాళ్లతో సరదాగా గడిపారు. ఆ క్రమంలో అక్కడే ఉన్న  మరూఫ్ కూతురు  ఫాతిమాతో కొద్దిసేపు ఆడుకున్నారు. 

బిస్మా మరూఫ్ తన కూతురును  ప్రేమగా భుజాల మీద ఎత్తుకున్నప్పుడు స్మృతి మంధాన, షషాలీ వర్మ, హర్మన్ ప్రీత్ కౌర్ లు పాపతో ఆడుకున్నారు. ఆ చిన్నారికి స్వీట్ తినిపించి  ముద్దు చేశారు. ఆ పాపతో పాటు సెల్ఫీలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా  వైరల్ అవుతున్నాయి. 

 

ఈ ఫోటోలను ఐసీసీ తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంటూ.. ‘భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్  నుంచి లిటిల్ ఫాతిమాకు  తొలి క్రీడా స్ఫూర్తి పాఠం..’ అని రాసుకొచ్చింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం తన ట్విట్టర్ ఖాతాలో ఈ చిత్రాన్ని పంచుకుంటూ... ‘ఎంతో మధురమైన క్షణం..  క్రికెట్ కు మైదానంలో సరిహద్దులు ఉంటాయి. కానీ మైదానం వెలుపల ఉండవు..’ అని రాసుకొచ్చాడు. 

 

ఇక నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే..  టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.  పూజా వస్త్రాకార్ (67), స్నేహ్ రాణా (53 నాటౌట్), స్మృతి మంధాన (52), దీప్తి శర్మ  (40) రాణించారు.  అనంతరం 245 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాక్.. 43 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయింది. సిద్రా అమిన్ (30) టాప్ స్కోరర్. టీమిండియా బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్ 4 వికెట్లు తీయగా.. వెటరన్ పేసర్ జులన్ గోస్వామి, స్నేహ్ రాణాలు తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?