మాజీ క్రికెటర్లకు మసాలా కావాలి.. అందుకే కెఎల్‌పై ఇలా.. లక్నో సారథిని వెనకేసుకొస్తున్న మెంటార్..

By Srinivas MFirst Published Mar 20, 2023, 3:42 PM IST
Highlights

KL Rahul: ఆస్ట్రేలియాతో జరిగిన నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టులలో విఫలమైన తర్వాత కెఎల్ రాహుల్ పై  వెంకటేశ్ ప్రసాద్  తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. తాజాగా అతడికి  లక్నో టీమ్ మెంటార్ గంభీర్ మద్దతుగా నిలిచాడు. 

టీమిండియా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ వన్డేలలో కాస్తో కూస్తో రాణిస్తున్నా రెడ్ బాల్ క్రికెట్ (టెస్టులు)లో  మాత్రం దారుణ వైఫల్యాలతో  జట్టుకు భారంగా మారాడు. ఇటీవలే ముగిసిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  తొలి రెండు టెస్టులు ఆడిన  రాహుల్.. ఆ రెండింటిలోనూ విఫలమయ్యాడు. దీంతో టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ తో  పాటు మరికొందరు  కెఎల్ పై దుమ్మెత్తిపోశారు.  ‘రాహుల్  టెస్టులకు పనికిరావు..’  అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  అయితే ఇప్పుడు  ఆ విమర్శకులకు   టీమిండియా మాజీ క్రికెటర్,  లక్నో సూపర్  జెయింట్స్ మెంటార్ గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్  కౌంటర్ ఇచ్చాడు.  

స్పోర్ట్స్ తక్ తో  జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో  గంభీర్ మాట్లాడుతూ..  మాజీ క్రికెటర్లకు కొంచెం మసాలా కావాలని,  వాళ్ల ఉనికిని చాటుకోవడానికి కొంతమందిని టార్గెట్ గా చేసుకుని వారిపై పదే పదే విమర్శలు చేస్తారని చెప్పాడు.  ఐపీఎల్,  అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ వేర్వేరు అని గంభీర్ చెప్పుకొచ్చాడు. 

గంభీర్ మాట్లాడుతూ.. ‘కెఎల్ రాహుల్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని నేను అనుకోవడం లేదు.  ఐపీఎల్, ఇంటర్నేషనల్ క్రికెట్  లు ఒకదానికి ఒకటి  భిన్నంగా ఉంటాయి.   ఐపీఎల్ లో ఒక సీజన్ లో  వెయ్యి పరుగులు చేసి  ఇంటర్నేషనల్ క్రికెట్ లో విఫలమైతే మీపై విమర్శలు తప్పవు. అంతర్జాతీయ క్రికెట్ అంతే మరి.   అయితే ఐపీఎల్ లో అయినా ఇంటర్నేషనల్  క్రికెట్ లో అయినా జట్టులో ఎంపికయ్యేది 15 మందే.   అందుకే ఈ రెండింటినీ ఎప్పుడూ పోల్చొద్దు... ఇక రాహుల్ విషయానికొస్తే  అతడు ఐపీఎల్ లో బాగా ఆడతాడు. ఈ లీగ్ లో అతడు నాలుగు  సెంచరీలు చేశాడు. గత సీజన్ లో కూడా  ముంబై ఇండియన్స్ పై శతకం బాదాడు.. 

కానీ  మనకు ఇక్కడ  కొంతమంది మాజీ క్రికెటర్లు పనిగట్టుకుని   ఆటగాళ్ల మీద విమర్శలకు దిగుతారు. వాళ్లకు మసాలా కావాలి.  నా అభిప్రాయం ప్రకారం కెఎల్ ను టార్గెట్ చేసేవాళ్లు ఆ కోవకు చెందినవాళ్లే. నా దృష్టిలో రాహుల్ పై ఎలాంటి ఒత్తిడి లేదు.  అయినా ఒక్క ప్లేయర్ తో  మీరు టోర్నీలు విజయం సాధించలేరు. టీమ్ లో ఉన్నవాళ్లందరూ ఆడితేనే అప్పుడు  విజయాలు సొంతమవుతాయి..’అని చెప్పుకొచ్చాడు. 

కాగా నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టులలో విఫలమైన తర్వాత  రాహుల్ పై  వెంకటేశ్ ప్రసాద్  తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.  రాహుల్ కు టీమ్ మేనేజ్మెంట్ ఎందుకు మద్దతుగా ఉంటుందో తనకు అర్థం కావడం లేదని  ట్విటర్ వేదికగా మండిపడ్డాడు.   వెంకటేశ్ ప్రసాద్ విమర్శలో లేక టీమిండియా  అభిమానులు కూడా రాహుల్ ను తొలగించాల్సిందేనని  సోషల్ మీడియాలో భారీ ఎత్తున క్యాంపెయిన్ నడపడం వల్లో గానీ  ఇండోర్ లో రాహుల్ ను  భారత జట్టు  తుది జట్టు నుంచి తప్పించింది.  అతడి  స్థానంలో శుభ్‌మన్ గిల్ ను తీసుకొచ్చింది.  టెస్టులలో విఫలమైన రాహుల్.. వాంఖడే వేదికగా జరిగిన తొలి  వన్డేలో మాత్రం భారత్ ను గెలిపించాడు. 

click me!