నేను తండ్రిని కాబోతున్నా.. పీటర్సన్‌తో లైవ్ ఛాటింగ్‌లో చెప్పిన యువరాజ్

By Siva KodatiFirst Published May 18, 2020, 6:00 PM IST
Highlights

టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు తండ్రిగా ప్రమోషన్ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ విత్ కెవిన్ పీటర్‌సన్‌లో యువరాజ్ తన మదిలో మాటలను పంచుకున్నాడు.

టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు తండ్రిగా ప్రమోషన్ వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ విత్ కెవిన్ పీటర్‌సన్‌లో యువరాజ్ తన మదిలో మాటలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా తాను త్వరలో తండ్రిని కాబోతున్నట్లు యువీ తెలిపాడు.

లాక్‌డౌన్ కారణంగా తాను ప్రస్తుతం తాను కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నానని చెప్పాడు. భార్య ప్రసవం తర్వాత కోచింగ్ రంగంలోకి అడుగుపెడతానని యువరాజ్ వెల్లడించాడు.

కాగా యువరాజ్‌ 2016లో బాలీవుడ్ నటి హాజెల్ కీస్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అందరు క్రికెటర్ల లాగా కామెంట్రీ కాకుండా కోచింగ్‌పైనే ఎక్కువ ఆసక్తి ఉందని యువరాజ్ తన మనసులో మాటను చెప్పాడు.

అలాగే తండ్రి అయిన తర్వాత క్రికెట్‌కు కొంత కాలం విరామం ప్రకటించి.. భార్యాపిల్లలతో గడుపుతానని ఈ మాజీ ఆల్‌రౌండర్ చెప్పాడు. మరోవైపు ఈ లైవ్ షోలో టీ 20 ప్రపంచకప్‌ను యువరాజ్ సింగ్ ఈ రోజు గుర్తు చేసుకున్నారు.

పాకిస్తాన్‌ను ఓడించి భారత్ విశ్వవిజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. కానీ ఆ టోర్నీలో ఇంగ్లాండ్‌పై యువరాజ్ సింగ్ ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదడం హైలైట్‌గా నిలిచింది.

ఆ మ్యాచ్‌లో టీమిండియా గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ.. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను ఉతికి ఆరేశాడు. వాస్తవానికి ఆండ్రూ ఫ్లింటాఫ్ వల్లనే తాను ఆ విధంగా చేసినట్లు యువరాజ్ సింగ్ చెప్పాడు. ఫ్లింటాఫ్ తనను రెచ్చగొట్టేలా సైగలు చేశాడని, అందుకే బ్యాట్‌తో బదులిచ్చినట్లు చెప్పాడు. బ్రాడ్ బౌలింగ్ వేసే సమయంలో తాను చాలా కోపంగా ఉన్నానని యువరాజ్ తెలిపాడు.

ఓవర్ అయిన వెంటనే ఫ్లింటాఫ్ వైపు చూసినట్లు గుర్తుచేశాడు. కాగా టీమిండియా 2007 టీ 20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ టైటిళ్లు గెలవడం వెనుక యువీ కీలకపాత్ర పోషించాడు. 

click me!