వుమెన్స్ వరల్డ్ కప్ 2022: వెస్టిండీస్‌ని చిత్తు చేసిన టీమిండియా... మిథాలీ సేనకు రెండో విజయం...

Published : Mar 12, 2022, 01:29 PM IST
వుమెన్స్ వరల్డ్ కప్ 2022: వెస్టిండీస్‌ని చిత్తు చేసిన టీమిండియా... మిథాలీ సేనకు రెండో విజయం...

సారాంశం

318 పరుగుల లక్ష్యఛేదనలో 162 పరుగులకి ఆలౌట్ అయిన వెస్టిండీస్ మహిళా జట్టు... భారత జట్టుకి 155 పరుగుల తేడాతో భారీ విజయం... 

వుమెన్స్ వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత మహిళా జట్టు రెండో విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవం తర్వాత భారత మహిళా జట్టు, భారీ విజయంతో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. తొలుత సీనియర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత సెంచరీలతో చెలరేగడంతో వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని పెట్టగలిగిన భారత జట్టు, బౌలర్లు అదరగొట్టడంతో 155 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకోగలిగింది...

318 పరుగుల భారీ లక్ష్యఛేదనలో విండీస్‌కి శుభారంభం దక్కింది. డియాండ్రా డాటిన్, హేలీ మాథ్యూస్ కలిసి తొలి వికెట్‌కి 12.1 ఓవర్లలోనే 100 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 46 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 62 పరుగులు చేసిన డియాండ్రా డాటిన్‌ను స్నేహ్ రాణా అవుట్ చేయగా, 36 బంతుల్లో 6 ఫోర్లతో 43 పరుగులు చేసిన హేలీ మాథ్యూస్ కూడా రాణా బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరింది...

కేసియా నైట్ 5, స్టఫెనీ టేలర్ 1, షమీనా చంబెల్లీ 11, చెడెన్ నేషన్ 19, చినెల్లీ హెండ్రీ 7, అలియా ఆలీ 4, అనిసా మహ్మమద్ 2, షకీరా సెల్మన్ 7 పరుగులు చేసి అవుట్ కావడంతో 40.3 ఓవర్లలో 162 పరుగులకి ఆలౌట్ అయ్యింది విండీస్. ఒకానొక దశలో 100/0 స్కోరుతో ఈజీగా విజయాన్ని అందుకునేలా కనిపించిన విండీస్, 62 పరుగుల తేడాతో 10 వికెట్లు కోల్పోయి ఆలౌట్ కావడం విశేషం. 

భారత బౌలర్లలో స్నేహ్ రాణా 9.3 ఓవర్లలో 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా మేఘనా సింగ్‌కి రెండు, జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్‌కి తలా ఓ వికెట్ దక్కాయి. 


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. ఓపెనర్లు యషికా భాటియా, స్మృతి మంధాన కలిసి భారత జట్టుకి శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత 21 బంతుల్లో 6 ఫోర్లతో 31 పరుగులు చేసిన యషికా భాటియా అవుట్ అయ్యింది...

కెప్టెన్ మిథాలీ రాజ్ 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి అవుటై, తన పేలవ ఫామ్‌ను కొనసాగించింది. దీప్తి శర్మ 21 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన దీప్తి శర్మ కూడా త్వరగా అవుట్ కావడంతో 78 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

ఈ స్థితిలో సీనియర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ కలిసి నాలుగో వికెట్‌కి 184 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. వుమెన్స్ వరల్డ్ కప్‌లో భారత జట్టుకి ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 2013 వన్డే వరల్డ్‌ కప్‌లో పూనమ్ రౌత్, తిరుష్ కమిని కలిసి జోడించిన 175 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించింది స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ జోడి...

119 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 123 పరుగులు చేసిన స్మృతి మంధాన, వన్డే వరల్డ్ కప్‌లో రెండో సెంచరీ నమోదు చేయగా హర్మన్‌ప్రీత్ కౌర్ 107 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లో 109 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్‌కి ఇది వన్డే వరల్డ్ కప్‌ టోర్నీలో మూడో సెంచరీ. 

టీమిండియా తరుపున వన్డే వరల్డ్ కప్‌ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన వుమెన్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసింది హర్మన్‌ప్రీత్ కౌర్. రిచా ఘోష్ 10 బంతుల్లో 5 పరుగులు చేసి రనౌట్ కాగా పూజా వస్త్రాకర్ 5 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి అవుట్ అయ్యింది...

జులన్ గోస్వామి 2, స్నేహ్ రాణా 2, మేఘనా సింగ్ 1 పరుగు చేయడంతో భారత జట్టు 317 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో భారత మహిళా జట్టు 300+ చేయడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం. 

భారత జట్టు తన తర్వాతి మ్యాచ్‌ మార్చి 16న ఇంగ్లాండ్‌తో ఆడనుంది. 

PREV
click me!

Recommended Stories

Abhigyan Kundu : వామ్మో ఏంటి కొట్టుడు.. IPL వేలానికి ముందు ఆసియా కప్‌లో డబుల్ సెంచరీ బాదిన తొలి భారత క్రికెటర్ !
IPL Mini Auction 2026: మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టే ప్లేయ‌ర్స్ వీళ్లే... ఏకంగా రూ. 30 కోట్ల పైమాటే..