చివరి బంతి ఓటమి... భావోద్వేగానికి గురైన సంజూ సామ్సన్

By telugu news teamFirst Published Apr 13, 2021, 10:48 AM IST
Highlights

అప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. సంజూ సామ్సన్ అవుట్ తో గేమ్ రివర్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ సంజూ సామ్సన్ చాలా బావోద్వేగానికి గురయ్యాడు.
 

ఐపీఎల్ 2021 చాలా రసవత్తరంగా సాగుతోంది. సోమవారం పంజాబ్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడిన సంగతి తెలిసిందే. చివరి బంతి వరకు ఆట చాలా ఆసక్తికరంగా సాగింది. రాజస్థాన్ కెప్టెన్ సంజూ సామ్సన్ సెంచరీ చేసినప్పటికీ.. చివరి బాల్ కి అవుట్ అవ్వడంతో అది కాస్త వృథాగా మారింది. ఫలితంగా కింగ్స్ పంజాబ్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది.

అప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. సంజూ సామ్సన్ అవుట్ తో గేమ్ రివర్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ సంజూ సామ్సన్ చాలా బావోద్వేగానికి గురయ్యాడు.

‘అసలేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. లక్ష్యానికి అత్యంత చేరువగా వెళ్లాం.కానీ దురదృష్టవశాత్తూ ఓటమి తప్పలేదు. ఇంతకంటే నేను ఏం చేయగలను. ఆటలో ఇవన్నీ సహజమే. వికెట్‌ మెరుగు పడుతుంది.. టార్గెట్‌ను సులభంగా ఛేదించగలమని అనుకున్నాం. ఓటమి పాలైనా, జట్టు బాగానే ఆడిందన్న తృప్తి మిగిలింది’’అని చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్‌లో చిరస్మరణీయ సెంచరీ సాధించినందుకు గానూ సంజూ సామ్సన్‌ను ‘‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’’ వరించింది. ఈ విషయం గురించి అతడు మాట్లాడుతూ.. ‘‘ఇన్నింగ్స్‌ ద్వితీయార్థం అత్యద్భుతంగా సాగింది. ఆచితూచి ఆడుతూనే సింగిల్స్‌ తీస్తూనే వీలు చిక్కినప్పుడల్లా షాట్లు కొట్టాను. బ్యాటింగ్‌ను పూర్తిగా ఆస్వాదించాను.

నా నైపుణ్యాలను చక్కగా వినియోగించుకున్నపుడు కచ్చితంగా ఇలాంటి ప్రదర్శన ఇవ్వగలనని తెలుసు. ఈ క్రమంలో ఒక్కోసారి వికెట్‌ కోల్పోతాను కూడా. ఈ నాటి మ్యాచ్‌లో నా ఇన్నింగ్స్‌ సంతృప్తికరంగా సాగింది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా 63 బంతుల్లో 119(12 ఫోర్లు, 7 సిక్సర్లు) పరుగులు చేసిన సంజూ.. అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో దీపక్‌ హుడా చేతికి క్యాచ్‌ ఇవ్వడంతో అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడటమే గాకుండా గెలుపు ఖాయం అనుకున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌కు ఓటమి తప్పలేదు.

click me!