భారత జట్టు, వరల్డ్ కప్ గెలవాలంటే ప్రెషర్‌ని గెలవాలి! యువరాజ్ సింగ్ ట్వీట్... స్వదేశంలో ఆడుతున్నాం, ఇక మనకి తిరుగులేదంటూ వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా వన్ ఆఫ్ ది ఫెవరెట్. రోహిత్ శర్మ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత ద్వైపాక్షిక సిరీసుల్లో కూడా తేలిపోతున్న టీమిండియా, ప్రస్తుతం ఆసియా కప్ 2023 టోర్నీలో ఆడుతోంది. పాక్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ అయినా, మిడిల్ ఆర్డర్‌లో పాండ్యా, ఇషాన్ కిషన్ రాణించి టీమిండియాకి మంచి స్కోరు అందించారు.
అయితే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే పాకిస్తాన్ ఇన్నింగ్స్ తెరపడింది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ దక్కింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగులకు చాప చుట్టేసిన నేపాల్ జట్టు, టీమిండియాతో మ్యాచ్‌లో 48 ఓవర్లు బ్యాటింగ్ చేసి 230 పరుగులు చేసింది..
పాక్ బౌలర్ల కంటే భారత బౌలర్లు రెట్టింపు పరుగులు సమర్పించారు. దాదాపు ఆఖరి ఓవర్ వరకూ నేపాల్ ఇన్నింగ్స్ సాగింది. వర్షం కారణంగా డీఎల్‌ఎస్ విధానంలో 10 వికెట్ల తేడాతో గెలిచి సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించింది టీమిండియా.
ఇప్పుడే కాదు, గత రెండేళ్లుగా టీమిండియా ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అందుకే వరల్డ్ కప్ గెలిచేందుకు కావాల్సిన స్కిల్స్, టీమిండియాలో కనిపించడం లేదని చెబుతూ వచ్చాడు యువరాజ్ సింగ్.
వరల్డ్ కప్ గెలిచేందుకు కావాల్సిన పటిష్టమైన మిడిల్ ఆర్డర్ లేదని, ఆల్‌రౌండర్లు సరిగా లేరని, ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ కూడా వీక్‌గా ఉందని చెబుతూ వచ్చాడు యువరాజ్ సింగ్. అయితే ఇప్పుడు ‘థమ్సప్’ యాడ్ కోసం ఇదే రకంగా ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు యువీ.
‘మనందరం 2011కి, ఐసీసీ వరల్డ్ కప్ 2023 టోర్నీలో రిపీట్ చేయాలని కోరుకుంటున్నాం. కానీ 2011లో టీమిండియా ప్రెషర్‌లో అద్భుతంగా మెరిసింది. 2023లో భారత జట్టు, అలాగే ప్రెషర్‌లో రాణించాల్సి ఉంటుంది. దీన్ని మార్చేందుకు మన దగ్గర కావాల్సినంత సమయం ఉందా? ఆ ప్రెషర్‌ని ‘గేమ్ ఛేంజర్’ గా వాడుకోగలమా?’ అంటూ ట్వీట్ చేశాడు యువరాజ్ సింగ్. ఈ ట్వీట్‌కి ‘ఇండియా గెలవగలదా?’ (Will India Win?) అనే హ్యాష్ ట్యాగ్‌ని వాడాడు యువీ..
దీనికి వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ‘యువీ భాయ్, అసలు ప్రెషర్ గురించే చర్చ అయితే ఈసారి మనం ప్రెషర్ తీసుకోం, ఛాంపియన్స్‌లా ప్రెషర్ పెడతాం. గత 12 ఏళ్లలో హోస్ట్ టీమ్‌యే వరల్డ్ కప్ గెలుస్తూ వచ్చింది..
“ ayi baat pressure ki, toh iss bar hum pressure lenge nahi, denge! Like champions!
Peechle 12 saal mein, host team world cup jeeti hain!
2011 – We won at Home
2015 – Australia won in Australia
2019 – England won in England
2023 – Hum Toofan Machayenge!
… https://t.co/Dx0VVoTfTd
2011లో మనం స్వదేశంలో వరల్డ్ కప్ గెలిచాం. 2015లో ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ గెలిచింది. 2019లో ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలిచింది. 2023లో మనం తుఫాన్ సృష్టిద్దాం..’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. ఈ ఇద్దరూ ‘థమ్సప్’ యాడ్ కోసం చేసిన ట్వీట్లే ఇవి. అయితే అభిమానుల్లో ఉత్సాహం నింపడంలో, క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో ఈ యాడ్ క్యాంపెయిన్ బాగానే వర్కవుట్ అయ్యింది..