ఐపీఎల్ పై మళ్ళీ చిగురించిన ఆశలు: బీసీసీఐ పక్కా ప్లాన్!

By Sree sFirst Published Apr 1, 2020, 6:14 PM IST
Highlights

జులై-ఆగస్టులో జరగాల్సిన ఒలింపిక్స్‌నే వాయిదా వేసిన గడ్డు పరిస్థితుల్లో అక్టోబర్‌లో వరల్డ్‌కప్‌ను నిర్వహించటం అసాధ్యమని చెప్పవచ్చు. దీనినే అదునుగా భావించిన ఐపీఎల్ నిర్వాహకులు తమకేమన్న సందు దొరుకుతుందా అని రంగంలోకి దిగారు. 

కరోనా దెబ్బకు విశ్వక్రీడలతోసహా అన్ని క్రీడా టోర్నీలు వాయిదాపడడమో లేదా రద్దవడమో అవుతున్నాయి. ఐపీఎల్ పై సైతం నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దాదాపుగా ఈ సంవత్సరం ఐపీఎల్ ఉండనట్టే అనేది బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాటలను బట్టి అర్థమవుతున్న విషయం. 

క్రికెట్లో ఐపీఎల్ తరువాత ఇప్పుడీ జాబితాలోకి టీ20 వరల్డ్‌కప్‌ చేరిపోయింది. కరోనా ప్రభావంతో టి20 వరల్డ్‌కప్‌ అర్హత టోర్నీలను వాయిదా వేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. దీంతో అక్టోబర్‌ 2020లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. 

ఈ మహమ్మారి మరింత మారణ హోమం సృష్టించకుండా నివారణ చర్యల్లో భాగంగా ప్రపంచం లాక్‌డౌన్‌లో ఉంది. ఈ పరిస్థితుల్లో నలుగురు వ్యక్తులు ఒక చోటకు చేరటమే నిషేధం, ఆరోగ్యానికి ప్రమాదకరం. అలాంటిది, క్రికెట్‌ మ్యాచ్‌కు వేలాది మంది స్టేడియానికి రావటం ఎంత పెద్ద ప్రమాదమో చెప్పనవసరం లేదు.

Also read: ఈ సంవత్సరం ఐపీఎల్ రద్దు: దాదా మాటల్లోని ఆంతర్యం అదేనా...? 

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ను ఘనంగా నిర్వహించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా.. అక్టోబర్‌లో పురుషుల టీ20 వరల్డ్‌కప్‌ మెగా ఈవెంట్‌కు రంగం సిద్ధం చేసుకుంది. రోజు రోజుకూ ప్రాణాంతకంగా మారుతున్న కరోనా వైరస్‌ ఈ నెలాఖరులో ఆరంభం కావాల్సిన ఐపీఎల్‌నే కాదు అక్టోబర్‌లో మొదలవ్వాల్సిన టీ20 వరల్డ్‌కప్‌పైనా ప్రభావం చూపిస్తోంది. 

తాజాగా కరోనా కేసులు ఎక్కువవుతుండడంతో... ఆస్ట్రేలియా ఆరు నెలల పాటు తన అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసింది. 6 నెలలు అంటే సెప్టెంబర్ వరకు సరిహద్దులు క్లోజ్. కాబట్టి అక్టోబర్ లో జరగాల్సిన ప్రపంచ కప్ కి వేడుకలను సిద్ధం చేయడానికి,  ఇతరాత్రాలకు సమయం సరిపోదు. 

దీనితో ప్రపంచ కప్ క్యాన్సల్ అయ్యే సూచనలే ఎక్కువగా కనబడుతున్నాయి. లేదా వాయిదా పడొచ్చు. అంతే తప్ప ఫార్మాట్ ను కుదించి తక్కువ మ్యాచులు ఆడదానికి కుదరదు. 

జులై-ఆగస్టులో జరగాల్సిన ఒలింపిక్స్‌నే వాయిదా వేసిన గడ్డు పరిస్థితుల్లో అక్టోబర్‌లో వరల్డ్‌కప్‌ను నిర్వహించటం అసాధ్యమని చెప్పవచ్చు. దీనినే అదునుగా భావించిన ఐపీఎల్ నిర్వాహకులు తమకేమన్న సందు దొరుకుతుందా అని రంగంలోకి దిగారు. 

అయినా, దీనిపై ఎటువంటి స్పష్టత లేదు. జరుగుతుంది, జరుగదు అనే అంశాలపై ఎవరికీ నమ్మకం లేదు. 

ఇప్పటికే సరిహద్దులు మూసి వేశారు. ప్రపంచకప్ గనుక వాయిదా పడితే... అక్టోబర్‌-నవంబర్‌ సమయంలో ఐపీఎల్‌ 13ను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలను చేస్తుంది.  

2009 ఐపీఎల్‌ తరహాలో తక్కువ రోజుల్లో లీగ్‌కు పూర్తి చేయటంపై ప్రణాళిక సిద్ధం చేసింది. ఐపీఎల్‌ విషయంలో ఫార్మటు కు సంబంధించి ఎటువంటి నియమాలు లేవు.  దీంతో వరల్డ్‌కప్‌ వాయిదా పడితే ఆ సమయంలోనే ఐపీఎల్‌ నిర్వహణ అనువుగా ఉంటుందని బీసీసీఐ అధికారులు అనుకుంటున్నారు. 

ఇలా గనుక ప్రపంచ కప్ వాయిదా పడితే.... ఐసీసీ క్యాలెండర్‌లో 2022 ఖాళీగా ఉంది. 2021లో టీ20 వరల్డ్‌కప్‌, 2023లో వన్డే వరల్డ్‌కప్‌లకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్‌ ఆతిథ్య హక్కులు నష్టపోకుండా చూడాలని భావిస్తే.. బీసీసీఐని ఐసీసీ ఒప్పించాల్సి ఉంటుంది. 

వరుసగా రెండు సంవత్సరాల్లో రెండు ప్రపంచకప్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకారం తెలిపితే మార్గం సుగమం కానుంది. 2021లో 2020 టీ20 వరల్డ్‌కప్‌, 2022లో 2021 టీ20 వరల్డ్‌కప్‌లను నిర్వహించే వెసులుబాటు ఐసీసీకి ఉంది. 

click me!