ఆఖరి ఓవర్ దాకా పోరాడినా దక్కని విజయం.. టీ20 సిరీస్‌ని కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా...

By Chinthakindhi RamuFirst Published Dec 18, 2022, 10:39 AM IST
Highlights

నాలుగో టీ20లో 189 పరుగుల లక్ష్యఛేదనలో 7 పరుగుల తేడాతో ఓడిన భారత మహిళా జట్టు... 19 బంతుల్లో 40 పరుగులు చేసి అదరగొట్టిన రిచా ఘోష్.. 

టీమిండియా పర్యటనలో టీ20 సిరీస్‌ని కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా. రెండో టీ20లో సూపర్ ఓవర్‌లో గెలిచి ఆస్ట్రేలియా వరుస విజయాల జైత్రయాత్రకు బ్రేక్ వేసిన భారత మహిళా జట్టు... నాలుగో టీ20లో ఆఖరి ఓవర్ దాకా పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది.. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌ని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా.

189 పరుగుల లక్ష్యఛేదనలో 181 పరుగులు చేసిన టీమిండియా.. ఉత్కంఠభరిత పోరులో 7 పరుగుల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. కెప్టెన్ హీలి 30 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్‌గా పెవిలయన్ చేరాగా మూనీని 2 పరుగులకే పెవిలియన్ చేర్చింది దీప్తి శర్మ.

తహిళా మెక్‌గ్రాత్ 9 పరుగులు చేసి రాధా యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా గార్నర్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసి దీప్తి శర్మ బౌలింగ్‌లో అవుటైంది. ఎలీసా పెర్రీ 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేయగా గ్రేస్ హారీస్ 12 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసింది..

189 పరుగుల భారీ లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభం దక్కలేదు. 10 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసిన స్మృతి మంధాన, గార్నర్ బౌలింగ్‌లోఅ వుటైంది. 16 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసిన షెఫాలీ వర్మను డేసీ బ్రౌన్ అవుట్ చేయగా జెమీమా రోడ్రిగ్స్ 11 బంతుల్లో 8 పరుగులు చేసి నిరాశపరిచింది...

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 30 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసి పోరాడగా 26 బంతుల్లో 3 ఫోర్లతో 32 పరుగులు చేసి దేవికా వైద్య కీలక సమయంలో స్టంపౌట్ అయ్యింది. దేవికా వైద్య అవుట్ అయ్యే సమయానికి టీమిండియా విజయానికి 16 బంతుల్లో 40 పరుగులు కావాలి...

హేతర్ గ్రాహమ్ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా 6, 6, 4 బాది 18 పరుగులు రాబట్టిన రిచా ఘోష్... మ్యాచ్‌ని ఇంట్రెస్టింగ్‌గా మార్చేసింది. అయితే ఆఖరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 20 పరుగులు కావాల్సి వచ్చాయి. మొదటి బంతికి ఫోర్ బాదిన దీప్తి, రెండో బంతికి సింగిల్ తీయగా రిచా ఘోష్ మూడో బంతికి సింగిల్ మాత్రమే రాబట్టగలిగింది...

నాలుగో బంతికి ఫోర్ బాదింది దీప్తి శర్మ. దీంతో ఆఖరి 2 బంతుల్లో భారత జట్టు విజయానికి 10 పరుగులు కావాల్సి వచ్చాయి. ఆఖరి రెండు బంతుల్లో రెండు సింగిల్స్ మాత్రమే రావడంతో ఆస్ట్రేలియా 7 పరుగుల తేడాతో విజయం అందుకుంది.. రిచా ఘోష్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. 

click me!