Asia Cup 2023 Final: సిరాజ్ సెన్సేషన్, ఆఖర్లో పాండ్యా పవర్.. 50 పరుగులకే శ్రీలంక ఆలౌట్..

By Chinthakindhi Ramu  |  First Published Sep 17, 2023, 5:13 PM IST

Asia Cup 2023 Final: 50 పరుగులకే ఆలౌట్ అయిన శ్రీలంక... 6 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యాకి 3 వికెట్లు.. 


ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయాడు. బుమ్రా మొదలెడితే, మహ్మద్ సిరాజ్ సెన్సేషనల్ స్పెల్‌తో లంక బ్యాటర్లను వణికించాడు. ఆఖర్లో హార్ధిక్ పాండ్యా కూడా చేతులు కలపడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 పరుగులకి ఆలౌట్ అయ్యింది..

జస్ప్రిత్ బుమ్రా మొదటి ఓవర్ మూడో బంతికే వికెట్ తీయగా మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది శ్రీలంక..

Latest Videos

undefined

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు శుభారంభం దక్కలేదు. 2 బంతులు ఆడిన కుసాల్ పెరేరా, బుమ్రా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు.. 4 బంతుల్లో 2 పరుగులు చేసిన పథుమ్ నిశ్శంక, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా పట్టిన స్టన్నింగ్ క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రెండో బంతికే సధీర సమరవిక్రమ కూడా డకౌట్ అయ్యాడు..

2 బంతులు ఆడిన సధీర సమరవిక్రమను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు మహ్మద్ సిరాజ్. సమరవిక్రమ డీఆర్‌ఎస్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. సమరవిక్రమ అవుటైన తర్వాతి బంతికే చరిత్ అసలంక కూడా ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  వస్తూనే బౌండరీ బాదిన ధనంజయ డి సిల్వ, మహ్మద్ సిరాజ్‌కి హ్యాట్రిక్ దక్కకుండా అడ్డుకోగలిగాడు. అయితే ఆ తర్వాతి బంతికి అతను కూడా అవుట్ అయ్యాడు..

2 బంతుల్లో ఓ ఫోర్ బాదిన ధనంజయ డి సిల్వ, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సమయానికి 12 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది శ్రీలంక..  

ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన మొట్టమొదటి భారత బౌలర్‌గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు మహ్మద్ సిరాజ్. తన తర్వాతి ఓవర్‌లో శ్రీలంక కెప్టెన్ దసున్ శనకని పెవిలియన్ చేర్చాడు మహ్మద్ సిరాజ్. శనక నాలుగు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. సిరాజ్ వేసిన బంతిని అంచనా వేయడంతో పూర్తిగా విఫలమైన శనక, క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. 

కేవలం 16 బంతుల్లో 5 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, అత్యంత వేగంగా వన్డేల్లో 5 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు చమిందావాస్, బంగ్లాదేశ్‌పై 16 బంతుల్లో 5 వికెట్లు తీశాడు. సిరాజ్ ఆ రికార్డును సమం చేశాడు. 


5.4 ఓవర్లలోనే 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. ఈ దశలో కుసాల్ మెండిస్, దునిత్ వెల్లలాగే కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. 34 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన కుసాల్ మెండిస్‌ని మహ్మద్ సిరాజ్ బౌల్డ్ చేయడంతో 21 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.

21 బంతుల్లో 8 పరుగులు చేసిన దునిత్ వెల్లలాగేని హార్ధిక్ పాండ్యా అవుట్ చేశాడు. 1 పరుగు చేసిన ప్రమోద్ మదుషాన్, పథిరాణాలను వెంటవెంటనే అవుట్ చేసిన హార్ధిక్ పాండ్యా, లంక ఇన్నింగ్స్‌ని ముగించేశాడు. 

click me!