ముంబై: ఆన్‌లైన్ కొనుగోళ్లు అంటే కుర్రాళ్లకు యమ క్రేజీ. కాలు బయట పెట్టకుండానే కావాల్సినవన్నీ కొనేసుకోవచ్చు. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మరిని ఎదుర్కొనేందుకు కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రజలు కాలుబయట పెట్టలేని పరిస్థితి నెలకొంది.
దాంతో పలు కంపెనీలు ప్రత్యేకించి ఆటోమొబైల్ దిగ్గజాలు నేరుగా ప్రజల వద్దకు వస్తున్నాయి. దానిలో భాగంగా క్లిక్ టు డ్రైవ్ పేరుతో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ ఆన్‌లైన్‌లో కార్లను కొనుగోలు చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
వైరస్ విజృంభణతో నెల రోజులుగా చాలా కంపెనీల కార్యకలాపాలు నిలిచిపోయాయి. సౌకర్యవంతమైన, సురక్షితమైన పద్ధతులతో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు చాలా కంపెనీలు ఆన్‌లైన్ బాట పడుతున్నాయి.
ఈ క్లిక్ టు డ్రైవ్ ప్రొగ్రామ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 750 అవుట్‌లెట్లను టాటా కంపెనీ ఒకే గూటికి తెచ్చింది. కారు కొనుగోలు చేయాలనుకొనే వారు క్లిక్ టు డ్రైవ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. ప్యాసింజర్ వెహికిల్స్ పోర్ట్‌ఫోలియా ద్వారా నచ్చిన కారును ఎంచుకోవాలి. దానిలో వీడియో బ్రోచర్ అందుబాటులో ఉంటుంది.
also read
కరోనా ఎఫెక్ట్: అమ్మకాలు లేక మారుతి కార్ల ఉత్పత్తి తగ్గింపు...కొత్తగా‘ఆన్‌లైన్’బుకింగ్ అమలు
కారు హోం డెలివరీ కావాలా, డీలర్ వద్ద నుంచి తెచ్చుకోవాలని అనుకుంటున్నామా అనే ఆప్షన్‌ను క్లిక్ చేసుకోవాలి. మోడల్‌ను బట్టి కార్ల ధరల వివరాలు కూడా అందులో కనిపిస్తాయి.
మొత్తం కారు కొనుగోలు వ్యవహారమంతా ఈ మెయిల్స్, వాట్సాప్, వీడియో కాల్ ద్వారా పూర్తి చేసుకోవచ్చని టాటా మోటార్స్ తెలిపింది. కంపెనీ లేటెస్ట్ కారు ఆల్ట్రోజ్‌ను వర్చువల్ షోరూమ్ ద్వారా సొంతం చేసుకోవచ్చని తెలిపింది.
ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ వల్ల కొత్త మోడల్స్‌ను పరిచయం చేసే ఇంటర్నేషనల్ ఆటో షోలు దాదాపు నిలిచిపోయాయి. దాంతో తమ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడానికి కంపెనీలు డిజిటల్ వేదికలపైనే ఆధారపడుతున్నాయి. దేశవ్యాప్తంగా తన కంపెనీకి చెందిన 500 మంది డీలర్లను డిజిటల్ ప్లాట్‌ఫాం కిందికి తీసుకువస్తున్నట్లు గత వారం హ్యుండాయ్ ప్రకటించింది.