కరోనా వైరస్ వ్యాధి సోకిన వారికి వైద్యం చేస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పట్ల అమానుషంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని కేంద్రం హెచ్చరించింది.
న్యూఢిల్లీ:కరోనా వైరస్ వ్యాధి సోకిన వారికి వైద్యం చేస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పట్ల అమానుషంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, డీసీపీలకు ప్రత్యేక అధికారాలను కల్పిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్న వారికి వైద్యం చేసిన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని ఇళ్లు ఖాళీ చేయాలని కొన్ని ఇంటి యజమానాలు కోరుతున్నారు. ఇదే విషయమై రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కేంద్ర హోంశాఖ అమిత్ షా కు లేఖ రాసింది.ఈ లేఖపై కేంద్రం సీరియస్ గా స్పందించింది.
డాక్టర్లను ఇళ్లు ఖాళీ చేయాలని కోరడం ద్వారా ఆయా ఇంటి యజమానులు ఘోరమైన తప్పు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. అత్యవసర సేవలు చేస్తున్న డాక్టర్లను ఇబ్బంది పెడితే శిక్షిస్తామని కేంద్రం తేల్చి చెప్పింది.
అంటువ్యాధుల నియంత్రణ చట్టం ప్రకారంగా శిక్షిస్తామని అమిత్ షా ప్రకటించారు. ఇల్లు ఖాళీ చేయాలని వేధిస్తున్నవారిపై కేసులు నమోదు చేయాలని హోం మంత్రి ఆదేశాలు జారీ చేశారు.