ఐపీఎల్ నిర్వహణకు ఫార్ములా చెప్పిన కెవిన్ పీటర్సన్

By Sree s  |  First Published Apr 5, 2020, 7:42 PM IST

కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ... ఐపీఎల్ జరగాలని తాను నిజంగా బలంగా కోరుకుంటున్నానని, క్రికెట్‌ సీజన్‌ ఐపీఎల్‌తోనే ఆరంభం కావాలని ఆశిస్తున్నానని అన్నాడు. 


ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని క్రీడలు ఆగిపోయాయి. క్రికెట్‌ కూడా ఆ దెబ్బకు పూర్తిగా నిలిచిపోయింది. కరోనా దెబ్బకు అతి పెద్ద క్రికెట్‌ లీగ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కూడా వాయిదా పడింది. 

అంతర్జాతీయ మ్యాచులు ఎక్కువగా ఆడలేకపోయిన ఆటగాళ్లు సంపాదించుకోవడం కోసం ఐపీఎల్‌ కావాలని బలంగా కోరుకుంటున్నారు. ఐపీఎల్‌ ఖచ్చితంగా జరుగుతుందని నిజంగా నమ్ముతున్నాను, జరగాలని కోరుకుంటున్నాను అని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఒక స్పోర్ట్స్ చానల్‌ చర్చలో వ్యాఖ్యానించాడు. 

Latest Videos

మార్చి 29న ఆరంభం కావాల్సిన ఐపీఎల్‌2020, ఏప్రిల్‌ 15కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఏప్రిల్‌ 15 తర్వాత సైతం ఐపీఎల్‌ నిర్వహణపై ఖచ్చితమైన సమాచారం చెప్పలేమని ఏకంగా బీసీసీఐ వర్గాలే చెబుతున్నాయి. మొన్న సౌరవ్ గంగూలీ సైతం ఇదే విషయాన్నీ చెప్పాడు. 

జులై-ఆగస్టులో ఐపీఎల్‌ నిర్వహించడం కష్టమైపోతుందని, ఇప్పుడే దానిపై  తీసుకోవడం మరీ తొందరే అవుతుందని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా దేశాలు సరిహద్దులను మ్మోసివేసిన నేపథ్యంలో... ఐపీఎల్‌ విషయమై ఏమి చెప్పలేమని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. 

మరో పక్క నిన్న కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ... ఐపీఎల్ జరగాలని తాను నిజంగా బలంగా కోరుకుంటున్నానని, క్రికెట్‌ సీజన్‌ ఐపీఎల్‌తోనే ఆరంభం కావాలని ఆశిస్తున్నానని అన్నాడు. 

ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఆటగాడు కూడా ఐపీఎల్‌లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, ప్రాంఛైజీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఐపీఎల్ ఆవశ్యకం అని కెవిన్ పీటర్సన్ అన్నాడు. 

కనీసం మూడు వేదికల్లోనైనా అభిమానులు లేకుండా కూడా ఐపీఎల్‌ను నిర్వహించవచ్చని, ఇలా నిర్వహిస్తే... 3-4 వారాల్లో లీగ్‌ను కూడా పూర్తి చేసే అవకాశం ఉందని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. 

ఇలా కేవలం మూడు వేదికల్లోనే నిర్వహణ అన్నివిధాల క్షేమం, సురక్షితం. ఎలాగూ అభిమానులు నేరుగా స్టేడియంలకు రాలేరు కాబట్టి, అన్ని నగరాలకు తిరగాల్సిన అవసరం ఉండదు. 

అప్పుడు ఖర్చుతోపాటుగా సమయం కూడా కలిసి వస్తుందని కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. స్టేడియం కి అభిమానులు రాలేరు కాబట్టి, అభిమానులు నేరుగా మ్యాచ్ చూస్తూ కేకలేయలేకపోయినా... ఇంటిదగ్గర టెలివిజన్‌లో మాత్రం ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సమరానికి ఛీర్స్‌ కొట్టవచ్చని  పీటర్సన్‌ అన్నారు. 

ఈ పరిస్థితుల్లో అన్ని విభాగాల నుంచి అనుమతులు లభించటం కీలకమని, ఐపీఎల్‌ ఖచ్చితంగా జరగాలని, అది ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుందని కేపీ అన్నాడు.

click me!