కరోనాకు మెడిసిన్ దొరికేసింది..లాంచ్ చేయడమే తరువాయి.. కానీ..!

By Sandra Ashok Kumar  |  First Published Apr 24, 2020, 11:09 AM IST

దేశీయ ఫార్మా దిగ్గజం గ్లెన్‌మార్క్ ఓ అడుగు ముందుకు వేసింది. ప్రాణాంతక కరోనా వైరస్ నియంత్రణకు ఔషధాన్ని కనుగొన్నట్లు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. క్లినికల్ ట్రయిల్స్ విజయవంతంగా పూర్తయితే,  సదరు ఔషధం లాంచ్ చేయడమే తరువాయి. ట్రయల్స్‌తోపాటు మార్కెటింగ్ చేసుకునేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి గ్లెన్‌మార్క్ వర్గాలు దరఖాస్తు చేసుకున్నాయి.  
 


ముంబై: భారతీయ ఫార్మాస్యూటికల్ దిగ్గజం గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ కరోనా వైరస్ నివారణ ఔషధాల తయారీలో కీలక అభివృద్ధిని సాధించినట్టు తెలుస్తోంది. దీంతో కరోనా వైరస్ చికిత్స కోసం వినియోగించే యాంటీ - రెట్రోవైరల్ (ఏఆర్వీ)ని  అభివృద్ధి చేసిన తొలి భారతీయ కంపెనీగా కంపెనీ అవతరించనుంది.

ఈ యాంటీ వైరల్ డ్రగ్‌కు సంబంధించిన ఫావిపిరవిర్ కోసం యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలను (ఎపిఐ) కంపెనీ అభివృద్ధి చేసిందని గ్లెన్‌మార్క్ వర్గాలు తెలిపాయి. భారతదేశంలో ట్రయల్స్ నిమిత్తం రెగ్యులేటరీ సంస్థ ఆమోదం కోసం దరఖాస్తు చేసింది.

Latest Videos

అంతేకాదు ఈ మందు మార్కెటింగ్ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నట్టు కూడా గ్లెన్‌మార్క్ వర్గాలు వెల్లడించాయి. మార్కెటింగ్ ఆమోదం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)ని ఆశ్రయించినట్టు  సంస్థ ధృవీకరించింది. ఇది వాస్తవ రూపం దాలిస్తే భారతీయ ఔషధ కంపెనీల చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది అని నిపుణులు భావిస్తున్నారు.  

ఏఆర్వీ ఔషధం కరోనా  వైరస్ చికిత్సలో సానుకూల ఫలితాలను చూపిందని అంచనాలు వెలువడ్డాయి. ఈ ఔషధానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ 14 రోజుల నుంచి  నెల వరకు ఉంటాయని తెలిపింది. ఈ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే భారతీయ మార్కెట్లోకి గ్లెన్‌మార్క్ ఈ ఔషధాన్ని ఆవిష్కరించనున్నదంటూ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల టీవీ చానెల్ నివేదించింది. 

ఈ ఔషధం భారతదేశం కోసం మాత్రమే అభివృద్ధి చేయబడుతోందని విదేశీ మార్కెట్లకు కాదని గ్లెన్‌మార్క్ స్పష్టం చేసింది. అయితే, ఫవిపిరవీర్ కు  పేటెంట్ లేనందున ఇతర కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశించవచ్చని కూడా ఆ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఫుజిఫిలిం సంస్థ ఫావిపిరవిర్ మందును తయారు చేస్తోంది.  చైనా, జపాన్‌లలో కోవిడ్‌-19  రోగులకు చికిత్స చేయడానికి  కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. ఫుజిఫిలిం అమెరికాలో ఫావిపిరవిర్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ వార్తలతో గతరెండు సెషన్లుగా భారీగా లాభపడిన గ్లెన్‌మార్క్‌ ఫార్మా షేర్లు గురువారం 10 శాతం ఎగిశాయి. 

click me!