నిర్మలా సీతారామన్ ప్రకటన: కేంద్ర ప్రభుత్వ కరోనా ఆర్థిక ప్యాకేజీ ఇదీ...

By narsimha lodeFirst Published Mar 26, 2020, 1:46 PM IST
Highlights

కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోతున్న పేద ప్రజలకు కేంద్రం ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. రూ.1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ఇస్తున్నట్టుగా కేంద్రం స్పష్టం చేసింది

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోతున్న పేద ప్రజలకు కేంద్రం ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది.వలస కార్మికులు, పేదల కోసం రూ.1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ఇస్తున్నట్టుగా కేంద్రం స్పష్టం చేసింది. వలస కార్మికులు, పేదలు ఆకలి చావులకు గురి కాకుండా అన్ని చర్యలు తీసుకొంటున్నామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

also read:డిల్లీలో డాక్టర్ కుటుంబానికి కరోనా పాజిటివ్ లక్షణాలు

గురువారం నాడు మధ్యాహ్నం కేంద్ర ఆర్ధిక శాక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆకలి చావులు లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందని ఆమె చెప్పారు. 

కరోనా వైరస్ నివారించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్న వారికి కేంద్రం ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టుగా ప్రకటించింది. ప్రభుత్వ శానిటేషన్ వర్కర్లు, ఆశా వర్కర్లకు, డాక్టర్లకు, పారా మెడికల్ సిబ్బందితో పాటు ఇతరులకు రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దేశంలో సుమారు 20 లక్షల మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 

వచ్చే మూడు మాసాల పాటు పేదలకు బియ్యం లేదా, గోధుమలను ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల చొప్పున ఉచితంగా అందించనున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద వీటిని అందిస్తామని కేంద్రం ప్రకటించింది. దేశంలోని 80 కోట్ల మందికి లబ్ది జరిగే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు.

ఇక రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు రూ. 2 వేలను జమ చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. దీని ద్వారా దేశంలోని 8.69 కోట్ల రైతులకు లబ్ది జరగనుందన్నారు మంత్రి.

వలస కార్మికులు, పేదలకు నగదు బదిలీతో పాటు ఆహార పదార్థాలను అందించనున్నట్టుగా ఆమె తెలిపారు. సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు వచ్చే మూడు మాసాలకు రెండు విడతలుగా వెయ్యి రూపాయాలను అందిస్తామని కేంద్రం ప్రకటించింది. దేశంలోని మూడు కోట్ల మందికి ఈ సహాయం అందిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

జన్‌ధన్ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న 20 కోట్ల మహిళల ఖాతాల్లో వచ్చే మూడు మాసాల పాటు ప్రతి నెల రూ.500 చొప్పున నగదును ఇస్తామని కేంద్ర మంత్రి చెప్పారు.

దేశంలోని బీపీఎల్ కుటుంబాలకు వచ్చే మూడు మాసాల పాటు మూడు ఎల్ పీ జీ గ్యాస్ సిలిండర్లను ఉచితంగా సరఫరా చేస్తామని కేంద్రం ప్రకటించింది.

స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రెట్టింపు రుణాలను అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశంలోని 7 కోట్ల మందికి ప్రయోజనం కలగనుందని కేంద్రం తెలిపింది.

దేశంలోని 3.5 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకు ప్రయోజనం కల్గించేందుకు వీలుగా రూ. 31 వేల కోట్ల నిధిని ఉపయోగించుకోవాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. 

click me!