దేశంలో విస్తరిస్తున్న మహమ్మారి: 4 వేలు దాటిన కరోనా కేసులు, మృతుల సంఖ్య 114

By telugu team  |  First Published Apr 7, 2020, 9:26 AM IST

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తోంది. మంగళవారం ఉదయం లెక్కల ప్రకారం దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 4 వేలు దాటింది. కరోనా వైరస్ మరణాలు 114కు చేరుకుంది. 


న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తోంది. ఈ రోజు మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. మొత్తం 4,421 కేసులు నమోదయ్యాయి. వీటిలో 3,981 యాక్టివ్ కేసులు కాగా, 325 మంది కోలుకున్నారు. కరోనా వల్ల ఇప్పటి వరకు దేశంలో 114 మంది మరణించారు. గత 12 గంటల్లో కొత్తగా 140 కేసులు నమోదైనట్లు మంగళవారం ఉదయం ఆరోగ్య శాఖ తెలిపింది.

కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం.... మహరాష్ట్రలో కరోనా వైరస్ జడలు విప్పుతోంది. మహరాష్ట్రలో కోవిడ్ -19 వల్ల ఎక్కువ మంది మరణించారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 45 మంది మరణించారు. గుజరాత్ 12 మంది చనిపోయారు. మధ్యప్రదేశ్ లో 9 మంది మరణించారు. 

Latest Videos

ఢిల్లీలో ఏడుగురు, పంజాబ్ లో ఆరుగురు, తమిళనాడులో ఐదుగురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో ఏడుగురు మరణించినట్లు చెప్పింది. అయితే, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు లెక్కల ప్రకారం తెలంగాణలో 11 మంది మరణించారు. 

దేశంలో విధించిన లాక్ డౌన్ ను ఏప్రిల్ 14వ తేదీ తర్వాత దశలవారీగా ఎత్తేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ సూచనప్రాయంగా చెప్పారు. కొన్ని ఆంక్షలను తొలగిస్తామని ఆయన చెప్పారు. మహమ్మారిని ఎదుర్కోవడానికి సమరం సాగించాలని ఆయన దేశప్రజలకు సూచించారు. 

ఇదిలావుంటే, దేశంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ మీద ఎయిమ్స్ సంచలన ప్రకటన చేసింది. కరోనా వైరస్ మీద ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా సోమవారం కీలకమైన విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా వైరస్ మూడో దశకు చేరుకుందని, అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మూడో దశకు చేరుకుందని, అది కూడా మూడో దశ ప్రారంభ దశలోనే ఉందని ఆయన చెప్పారు. 

దేశంలో కరోనా వైరస్ రోజురోజుకూ పెరగుతుండడం ఆందోళనకరంగా ఉందని ఆయన చెప్పారు. పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ద్వారా కరోనా వైరస్ సోకడాన్ని గుర్తించినట్లు ఆయన తెలిపారు దాన్ని వైరస్ మూడో దశగా చెప్పుకోవచ్చునని అన్నారు. అయితే, ఈ దశ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉందని ఆయన చెప్పారు. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో రెండో దశలోనే ఉండడం ఊరట కలిగించే విషయమని అన్నారు. 

దాన్ని అదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దాన్ని ఎంత త్వరగా అరికడితే అంత మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. లేకపోతే మూడో దశ ఉధృతమైతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 

ఢిల్లీలోని మర్కజ్ ఘటన తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిందని ఆనయ చెప్పారు. ప్రార్థనల్లో పాల్గొన్నవారిని గుర్తించడం కష్టమే అయినప్పటికీ ప్రభుత్వ చర్యలు సఫలమవుతున్నాయని అన్నారు. వైరస్ కట్టడికి ప్రజలు వైద్యులకు సహకరించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితిలో లాక్ డౌన్ ఎత్తేయడం గురించి ఏమీ చెప్పలేమని, ఏప్రిల్ 10వ తేదీన పరిస్థితులను బట్టి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. 

click me!