తమిళనాడులో తొలి కరోనా మరణం నమోదైంది. 54 ఏళ్ల వ్యక్తి కరోనాకు చికిత్స పొందుతూ రాజాజీ ఆస్పత్రిలో మరణించాడు. దీంతో భారతదేశంలో కరోనా బారిన పడి మరణించినవారి సంఖ్య 11కు చేరుకుంది.
న్యూఢిల్లీ: భారతదేశంలో మరో కరోనా మరణం నమోదైంది. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 11కు చేరుకుంది. తమిళనాడులో 54 వ్యక్తి కరోనా సోకి మరణించాడు. తమిళనాడులో తొలి కరోనా మరణం రికార్డయిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి. విజయభాస్కర్ చెప్పారు.
డయాబెటిస్ నియంత్రణలోకి రాకుండా అతను చాలా కాలంగా బాధపడుతున్నట్లు మంత్రి తెలిపారు. అతన్ని కాపాడడానికి అన్ని విధాలుగా ప్రయత్నించామని, కానీ ఫలితం దక్కలేదని ఆయన అన్నారు. రాజాజీ ఆస్పత్రిలోని ఎండీయులో చికిత్స పొందుతూ అతను మరణించాడు. తమిళనాడులో మంగళవారంనాడు 18 కరోనా కేసులు నమోదైంది. మంగళవారం ఒక్కరోజే ఆరు కేసులు నమోదయ్యాయి.
మంగళవారంనాడు మహారాష్ట్ర రాజధాని ముంబైలో 65 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. సోమవారంనాడు ముంబైలోని కస్బూర్బా ఆస్పత్రిలో చేరిన అతను మంగళవారం మృత్యువాత పడ్డాడు. ఆస్పత్రిలో చేరిన కొద్ది గంటలకే అతను తుదిశ్వాస విడిచాడు.
మృతుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మార్చి 15వ తేదీన అహ్మదాబాద్ వచ్చాడు. అక్కడి నుంచి 20వ తేదీన ముంబై చేరుకున్నాడు. దగ్గు, జ్వరం రావడంతో సోమవారం ఆస్పత్రిలో చేరాడు.
మహారాష్ట్ర ముగ్గురు, కర్ణాటకలో ఒకరు, బీహార్ లో ఒకరు, పంజాబ్ లో ఒకరు, పశ్చిమ బెంగాల్ లో ఒకరు, హిమాచల్ ప్రదేశ్ లో ఒకరు, గుజరాత్ లో ఒకరు, ఢిల్లీలో ఒకరు కరోనా వైరస్ బారిన పడి మరణించారు.