ఇండియాపై కన్నేసిన చైనా కంపెనీలు..ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకు భారీ ప్లాన్..

By Sandra Ashok KumarFirst Published Apr 24, 2020, 12:38 PM IST
Highlights

మనదేశంలోకి చైనా పెట్టుబడులను రాకుండా నిలువరించేందుకు ఎఫ్‌డీఐ నిబంధనలను కఠినతరం చేసింది. కానీ చైనా ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు ఆ నిబంధనలనే పట్టించుకోవడం లేదు. ఎలాగైనా భారత ఆటో సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
 

ముంబై: కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌‌డీఐ) నిబంధనలను కఠినతరం చేసినా కూడా చైనా కంపెనీలు ఇండియాపైనే కన్నేశాయి. చైనాలోని అగ్రశ్రేణి ఆటో కంపెనీలన్నీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధమయ్యాయి. 

రెండు లేదా మూడేళ్లలో భారతదేశంలో 500 కోట్ల డాలర్ల(రూ. 38,476 కోట్ల) వరకు పెట్టుబడి పెట్టేందుకు చైనా ఆటోమొబైల్ సంస్థలు చూస్తున్నట్టు తెలిసింది. షాంఘైకి చెందిన ఎంజీ మోటార్, గ్రేట్ వాల్ మోటార్స్ ఇప్పటికే ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ప్రణాళికలను సిద్ధం చేశాయి. 

ఛంఘన్, ఛెర్రీ ఆటో కంపెనీలు ఇండియాలో హల్ చల్ చేసేందుకు అవకాశాల కోసం చూస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ మొత్తం చైనీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. మన స్మార్ట్ ఫోన్ మార్కెట్‌‌లో ఎక్కువ భాగం చైనీస్ కంపెనీలదే. 

ఇండియాలో రూ.5000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎంజీ మోటార్ వచ్చే ఆరు నెలల్లో డీల్ ఖరారు చేసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్రేట్ వాల్ మోటార్స్ కూడా కోట్ల కొద్దీ డాలర్లను భారతదేశంలో కుమ్మరించడానికి ప్లాన్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ఆదేశాలు తమ భవిష్యత్ ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపవని ఎంజీ మోటార్ ఇండియా ఎండీ రాజీవ్ ఛబ అన్నారు.

మహారాష్ట్రలోని ఖాళీగా ఉన్న జనరల్ మోటార్స్‌‌ ప్లాంట్‌‌ను ఈ ఏడాది ద్వితీయార్థంలో గ్రేట్ వాల్ మోటార్స్ కైవసం చేసుకోబోతుంది. 2021లో భారత విపణిలో కార్ల ఆవిష్కరణకు కూడా సిద్ధమైంది.

గ్రేట్ వాల్ మోటార్స్‌కు మద్దతునిచ్చేందుకు వెస్ట్రన్ ఆటోమొటీవ్ బెల్ట్‌‌ లోని చైనీస్ వెండార్ కంపెనీలన్ని ఆ కంపెనీతో కలిసి పనిచేయడం ప్రారంభించాయి. ఇప్పుడు చైనీస్ ఆటోమొబైల్ సంస్థలు పెట్టే పెట్టుబడులు భారత ఆటో మార్కెట్‌కు కాస్త ఊరటనివ్వనుందని తెలుస్తోంది.

ఎంజీ మోటార్ ఇండియా, గ్రేట్ వాల్ మోటార్స్ ల ప్రత్యర్థి ఛంగన్‌‌ ఇప్పటికే గూర్గావ్‌‌లో ఆఫీసు కూడా ప్రారంభించింది. ఇండియా ప్రాజెక్ట్ కోసం చైనాలోని హెడ్ ఆఫీసు నుంచి పనిచేయడం మొదలు పెట్టింది. 

లాక్‌‌డౌన్ అయిపోయాక ఛంగన్ పలు సర్వేలు చేయనుంది. ఇందుకోసం పలు సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతోంది. ఇండియాలో ప్లాంట్‌‌ను ఏర్పాటు చేయడం కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ లను సందర్శించింది.

click me!