కరోనాతో గత నెలలో అమ్మకాలు జరుగక విలవిలలాడిన ఆటోమోబైల్ సంస్థలు తమ కస్టమర్లకు తాయిలాలతో ఎర చూపుతున్నాయి. 100% ఆన్‌రోడ్ ఫైనాన్సింగ్, ఇన్‌స్టాల్‌మెంట్ హాలిడేలు ప్రకటించాయి.
న్యూఢిల్లీ: కరోనా కాటు ప్లస్ బీఎస్-6 ప్రమాణాల సమస్యతో గత రెండు నెలలుగా సరైన వాహన అమ్మకాల్లేక డీలాపడిన ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు వివిధ రకాల తాయిలాలతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. తద్వారా వాహన ప్రేమికులను మళ్లీ తమ షోరూములకు రప్పించాలని యోచిస్తున్నాయి. 100 శాతం ఆన్‌రోడ్ ఫైనాన్సింగ్, ఇన్‌స్టాల్‌మెంట్ హాలిడేలు, వాహన రుణచెల్లింపు హామీ పథకాల్లాంటి ఆఫర్లతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తున్నాయి.
లాక్‌డౌన్ నేపథ్యంలో ఉద్యోగాలు, వేతన కోతలతో సతమతమవుతూ ఖరీదైన కొనుగొళ్లకు దూరంగా ఉంటున్న ప్రజలకు వాహనాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. లాక్‌డౌన్ నిబంధనలను ప్రభుత్వం కొంతమేరకు సడలించడంతో దేశంలోని వివిధ ప్రాంతాల ఆటోమొబైల్ డీలర్లు ఈ వారంలో తమ షోరూములను మళ్లీ తెరిచేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం తమ వద్ద మిగిలిపోయిన దాదాపు మూడు లక్షల ప్యాసింజర్ వాహనాలను త్వరగా విక్రయించడంపై వీరు తొలుత దృష్టిసారించే అవకాశమున్నదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
undefined
దేశీయ మార్కెట్లో దాదాపు సగం వాటాతో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా కొనసాగుతున్న మారుతీ సుజుకీ తమ వాహన కొనుగోలుదారులకు సులభ నిబంధనలతో రుణాలు ఇప్పించేందుకు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నది.
ప్రస్తుతం ప్రజలు తమ ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ప్రజా రవాణా నుంచి వ్యక్తిగత రవాణా (పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్) వైపు మళ్లాలని భావిస్తున్నారని, అయితే వారి ఆదాయం తగ్గడంతో వాహన ఈఎంఐ భారం తక్కువగా ఉండాలని కోరుకొంటున్నారని మారుతీ సుజుకీ మార్కెటింగ్, సేల్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు.
దీన్ని దృష్టిలో ఉంచుకొని వాహన రుణాల కాలపరిమితిని పెంచడంతోపాటు వడ్డీరేట్లు, డౌన్‌పేమెంట్లు తక్కువగా ఉండేలా చూడాలని బ్యాంకులతో చర్చిస్తున్నట్టు ఆయన చెప్పారు.
మారుతి సుజుకి మాదిరిగానే హ్యుండాయ్ మోటార్స్ ఇండియా కూడా శ్రీరాం జనరల్ ఇన్సూరెన్స్ సాయంతో హ్యుండాయ్ ఈఎంఐ అస్యూరెన్స్ స్కీమ్ ప్రారంభించింది. కస్టమర్ ఉద్యోగం కోల్పోతే శ్రీరాం జనరల్ ఇన్సూరెన్స్ మూడు వాయిదాల వరకు చెల్లిస్తుంది. ఈ నెలలో కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.
also read ఆటోమొబైల్స్ కార్యకలాపాలు పున:ప్రారంభం...త్వరలో ఉత్పత్తి..
ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. దీని పరిధి నుంచి హ్యుండాయ్ బెస్ట్ మోడల్ కార్లు క్రెటా, టస్కన్, కోనా ఈవీ, ఎలంత్రా మినహాయించారు.
టాటా మోటార్స్ మరో అడుగు ముందుకేసి అన్ని మోడల్ కార్లు, ఎస్‌యూవీలపై ఇదే తరహాలో ఇన్సెంటివ్‌లు ప్రకటించింది. వందశాతం ఆన్ రోడ్ ఫండింగ్ అందుబాటులోకి తెచ్చింది. ఎనిమిదేళ్ల వరకు ఈఎంఐ స్కీములు తీసుకొచ్చింది.
టాటా మోటార్స్ కస్టమిసబుల్ ఈఎంఐ పేమెంట్ విధానాన్ని అందుబాటులో ఉంచింది. వైద్య నిపుణులు, హెల్త్ కేర్ నిఫుణులు, పోలీసులతోపాటు కరోనాపై పోరు చేస్తున్న యోధులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.
టాయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం), స్కోడా ఆటో ఇండియా కూడా జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ తెచ్చింది. కారు కొనుగోలు చేసే వారికి సంస్థే నేరుగా ఫైనాన్స్ చేస్తుంది. టయోటా తన కస్టమర్ల క్రెడిట్ స్కోర్ ప్రకారం ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తుంది.
అదనంగా స్కోడా ఆటో ఇండియా నాలుగు నుంచి ఆరు నెలల వరకు ఈఎంఐ హాలీడే ప్రకటించింది. అంటే కారు కొనుగోలు చేసిన నాలుగు నెలల నుంచి ఆరు నెలల తర్వాత ఈఎంఐ చెల్లింపులు మొదలవుతాయి.
హోండా కార్స్ వంటి సంస్థలు ఎంపిక చేసిన మోడల్ కార్లపై రూ. లక్ష వరకు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనసులు, వారంటీల పొడిగింపు తదితర పథకాలు అందుబాటులో ఉన్నాయి.
హోండా కార్స్ కాంటాక్ట్ లెస్ డోర్ స్టెప్ డెలివరీ బిజినెస్ మోడల్ అంటే వినియోగదారుల ఇంటి ముంగిటే కారును అందజేయనున్నది. ఫ్రీ సర్వీసులు, సుదీర్ఘ కాలం వారంటీ తదితర ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సోమవారం నుంచి 15-20% వాతం షోరూములు, ఆటోమొబైల్ వర్క్ షాపులు తెరుచుకున్నాయి.