కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి తనవంతు సహకారం అందిస్తోంది టెక్ దిగ్గజం ఆపిల్. అందులో భాగంగా ఫేష్ షీల్డుల తయారీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రెండు కోట్ల మాస్కులను రోగులకు పంపిణి చేసినట్లు సంస్థ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు.
కాలిఫోర్నియా: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తన వంతు సాయం అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ రెండు కోట్ల మాస్కులు అందించామని ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. అలాగే ప్రస్తుత వైద్య అవసరాల నిమిత్తం కస్టమ్ ఫేస్ షీల్డ్స్ తయారీ మీద దృష్టి సారించినట్లు తెలిపారు.
కరోనా వైరస్‌పై పోరాడేందుకు తమ సంస్థ చేపడుతోన్న చర్యలను ట్విటర్ వీడియో ద్వారా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. ఫేస్ షీల్డ్ తయారీ, సరఫరా విషయమై తమ డిజైన్, ఇంజినీరింగ్, ఆపరేషన్స్, ప్యాకేజింగ్ బృందాలు డిస్ట్రిబ్యూటర్లతో పని చేస్తున్నాయని టిమ్‌కుక్ తెలిపారు. ఫేష్ షీల్డులను అమెరికా బయట నుంచి త్వరితగతిన తయారు చేయాలని ఆపిల్ భావిస్తోంది.
అయితే కొవిడ్-19 నివారణ కోసం చైనా బయట ప్రపంచ వ్యాప్తంగా 458 రిటైల్ షాపులను ఆపిల్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఇంజినీర్లు, డిజైనర్లకు మాత్రం ఇంటి నుంచే పని చేయాలని ఆపిల్ యాజమాన్యం కోరింది.
తమ కంపెనీ ఇప్పటికే కొన్ని ఫేష్ షీల్డ్‌లను కాలిఫోర్నియాలోని కైజర్ ఆసుపత్రికి అందించిందని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నారు. వాటి విషయంలో అక్కడి వైద్య బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని వెల్లడించారు.
‘ఆ షీల్డ్‌ను రెండు నిమిషాల్లో అసెంబ్లింగ్ చేసుకోవచ్చు. దాన్ని సర్దుబాటు చేసుకొనే సౌలభ్యం కూడా ఉంది. వాటిని అమెరికా, చైనాలో తయారు చేయనున్నాం’ అని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. ఈ వారం చివరికల్లా 10లక్షల షీల్డ్‌లను పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నామన్నారు.
ఇప్పటికే సీడీసీ భాగస్వామ్యంతో కొవిడ్ -19 స్క్రీనింగ్ యాప్, వెబ్‌సైట్‌ను యాపిల్ అందుబాటులోకి తెచ్చింది. కరోనా వైరస్‌కు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసే విధంగా తన వర్చువల్ అసిస్టెంట్ సిరిని అప్‌డేట్ కూడా చేసింది.
మరోవైపు కొవిడ్-19 నివారణ స్క్రీనింగ్ యాప్, వెబ్‌సైట్ ప్రారంభం వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందా? అన్న అంశంపై టిమ్ కుక్‌ను పలువురు డెమొక్రటిక్ సెనెటర్లు ప్రశ్నించారు. ఆయనను ప్రశ్నించిన సెనెటర్లలో బాబ్ మెనెండెజ్, కమలా హరీస్, కొర్రీ బూకర్, రిచర్డ్ బ్లూమెంథాల్ తదితరులు ఈ మేరకు ఆపిల్ సంస్థకు ఓ లేఖ పంపారు.
కొవిడ్-19 యాప్ వల్ల అమెరికన్ల వ్యక్తిగత ఆరోగ్య భద్రతకు ముప్పు ఉందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. యాప్ డెవలప్మెంట్ సమయంలో అమెరికా, దాని రాష్ట్ర ప్రభుత్వాలతో ఆపిల్ ఒప్పందాలను నిలదీశారు. కొవిడ్-19 యాప్.. హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అక్కౌంటబిలిటీ యాక్ట్ (హెచ్ఐపీఏఏ)కు లోబడి ఉంటుందా? అని సందేహాలు వ్యక్తం చేశారు.
ఈ యాప్ పొందడానికి యూజర్లు ‘సైన్ఇన్’, ఆపిల్ యూజర్ ఐడీతో అనుబంధం కలిగి ఉండాల్సిన అవసరం లేదని, వ్యక్తుల ప్రతిస్పందన ఆపిల్ కు గానీ, ప్రభుత్వ సంస్థల వద్దకు చేరదని సెనెటర్లు గుర్తు చేశారు. ఆపిల్ కూడా సదరు యాప్ ప్రైవసీని వెబ్ సైట్లో వెల్లడించింది. స్క్రీనింగ్ టూల్ నుంచి ఖాతాదారుల సమాధానాలను కోరదన్నారు. ఆపిల్ పౌరుల వ్యక్తిగత సమాచారం సేకరించడం లేదని చెప్పింది.