కొత్త కారొద్దు.. సెకండ్ హ్యాండ్ ముద్దు.. మనోళ్ల మనోగతం ఇదే

By Arun Kumar P  |  First Published May 18, 2019, 12:04 PM IST

దేశీయంగా కొత్త కార్ల కంటే సెకండ్ హ్యాండ్ కార్లకే ఎక్కువ డిమాండ్ ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో నూతన కార్లు 36 లక్షలు అమ్ముడు పోతే సెకండ్ హ్యాండ్ కార్ల సేల్స్ 40 లక్షలుగా నమోదు కావడమే దీనికి నిదర్శనం.


న్యూఢిల్లీ: దేశీయంగా సెకండ్‌ హ్యాండ్‌ కార్ల అమ్మకాలు జోరుగా పెరుగుతున్నాయి. కొత్త కార్లకన్నా ఈ కార్ల అమ్మకాలే అధికంగా జరుగుతున్నాయి. వ్యవస్థీకృత, అసంఘటిత రంగంలో కార్ల అమ్మకందారుల సంఖ్య పెరుగుతుండటం ఈ మార్కెట్‌ వృద్ధికి దోహదపడుతోంది. 

మార్కెట్‌ అవకాశాలు అధికంగా ఉన్నందున దేశ, విదేశీ కార్ల కంపెనీలు కొత్త కార్లకు తోడు సెకండ్‌ హ్యాండ్‌ కార్ల విక్రయ వ్యాపారాలను ప్రారంభిస్తున్నాయి. మొదటిసారిగా కారు కొనుగోలు చేయాలనుకునే వారిలో చాలా మంది కొత్త కారుకన్నా సెకండ్‌ హ్యాండ్‌ కారుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 

Latest Videos

ఈ నేపథ్యంలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో సెకండ్‌ హ్యాండ్‌ కార్ల అమ్మకాలు 40 లక్షలు దాటాయి. ఇదే సంవత్సరంలో కొత్త కార్ల అమ్మకాలు 36 లక్షలుగా ఉన్నాయని మహీంద్రాఫస్ట్‌ చాయిస్‌ వీల్స్‌ తన తాజా అధ్యయన నివేదికలో పేర్కొంది. 

2021- 2022 ఆర్థిక సంవత్సరం నాటికి సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్‌ 67-72 లక్షల యూనిట్లకు చేరవచ్చని తెలిపింది. ఇంతకుముందు అసంఘటిత రంగ డీలర్ల ద్వారా సెకండ్‌ హ్యాండ్‌ కార్ల అమ్మకాలు ఎక్కువగా జరిగేవి. 

ఇప్పుడు వ్యవస్థీకృత, సెమీ వ్యవస్థీకృత డీలర్ల సంఖ్య పెరుగుతోంది. కొత్త కార్ల మార్కెట్‌తో పోల్చితే ప్రస్తుతం సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్‌ 1.25 రెట్లు అధికంగా ఉంది. 2022నాటికి ఇది 1.8 రెట్లకు చేరే అవకాశం ఉంది. 

2019 ఆర్థిక సంవత్సరంలో సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్‌ 12 శాతం వృద్ధి చెందితే కొత్త కార్ల మార్కెట్‌ కేవలం 3.5 శాతానికి పరిమితమైంది.
వ్యవస్థీకృత రంగంలోని డీలర్లు సగటున నెలకు 19 కార్లను విక్రయిస్తుంటే.. సెమీ ఆర్గనైజ్డ్‌ డీలర్లు 10, అసంఘటిత డీలర్లు 4 కార్లను విక్రయిస్తున్నారు.

2018-19లో నూతన కార్ల విక్రయాలు 2.7 శాతం పెరిగాయి. ఇది నాలుగేళ్లలోనే కనిష్టంగా రికార్డైంది. ఏప్రిల్ నెలలో ఏడున్నరేళ్ల కనిష్ట స్థాయికి కార్ల విక్రయాలు 17.07 శాతానికి పడిపోయాయి. 

ప్రతి నలుగురిలో ఒకరు కొత్త కారు కొంటే.. మిగతా ముగ్గురు పాత కార్లతో త్రుప్తి పడుతున్నారు. దశాబ్ద కాలం క్రితం కొత్త కారు కొన్న యజమాని దాన్ని తన చేతిలో 10 ఏళ్ల వరకు ఉంచుకునేవారు. ఇప్పుడు మూడు నుంచి ఐదేళ్లలోపు మార్చేస్తున్నారు. 

సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు దారుల్లో 45 శాతం మంది నాలుగైదేళ్లు వాడిన కార్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 46 శాతం మంది ఆరు నుంచి ఎనిమిదేళ్ల పాటు వినియోగించిన కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మూడేళ్ల క్రితం వరకు చాలా మంది కొత్త కార్లు కొనుగోలు చేయాలని చూసేవారు అప్ గ్రేడెడ్ న్యూ కార్లవైపు చూస్తున్నారు. 

2019లో రూ.5 లక్షలకే పాత కార్ల విక్రయానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే సెకండ్ హ్యాండ్ కార్ల సేల్స్ పూర్తిగా అసంఘటిత రంగంలో సాగుతున్నాయి. 18 శాతం సేల్స్ మాత్రమే సంఘటిత చానెళ్ల ద్వారా సాగుతోంది. రెండేళ్ల క్రితం ఇది కేవలం 15 శాతం మాత్రమే. 

click me!