బ్రెగ్జిట్ ఎఫెక్ట్: కార్ల తయారీ కంపెనీలు విలవిల

By Siva Kodati  |  First Published May 12, 2019, 10:57 AM IST

యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయం ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యేకించి కార్ల తయారీ సంస్థలకు శరఘాతంగా పరిణమించింది. 


యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలుగాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయం ఆ దేశంలోని ఆ మాటకొస్తే ఐరోపా దేశాల్లోని ఆటోమొబైల్ పరిశ్రమనే కుదేలు చేస్తోంది. బ్రిటన్ కోరి తెచ్చుకున్న ‘బ్రెగ్జిట్’ పాలసీకి పార్లమెంట్‌లో ఇప్పటికీ ఆమోదముద్ర పడలేదు.

కానీ బ్రెగ్జిట్ చాయలు కార్ల తయారీ సంస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 1980 నాటి ‘చీకటి రోజుల’ పరిస్థితులను గుర్తుకు తెస్తున్నదని ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాడీ అంచనా వేస్తున్నది. 

Latest Videos

‘బ్రెగ్జిట్’ నేపథ్యంలో టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) తన నూతన మోడల్ ‘డిఫెండర్’ కారును స్లోవేకియాలో అసెంబ్లింగ్ చేస్తామని ప్రకటించింది. కానీ ఈయూ నుంచి వైదొలుగాలన్న బ్రిటన్ నిర్ణయాన్ని మాత్రం జేఎల్ఆర్ తప్పుబట్టడం లేదు.  

బ్రస్సెల్స్‌తో ఎటువంటి ఒప్పందం లేకుండా ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగితే మాత్రం దారుణమైన పరిస్థితులు ఉంటాయని సొసైటీ ఆఫ్ మోటార్ మాన్యుఫాక్చరర్స్ అండ్ ట్రేడర్స్ (ఎస్ఎంఎంటీ) పేర్కొంది.

షరతుల్లేకుండా వైదొలిగితే ఈయూ సభ్య దేశాలన్నింటా వరల్డ్ ట్రేడ్ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) నిబంధనల మేరకు టారిఫ్‌లు అమలులోకి వస్తాయని ఎస్ఎంఎంటీ తెలిపింది. 

కొన్ని రంగాలపై కస్టమ్స్ డ్యూటీ 1.5 శాతం సగటున పెరిగితే.. కొన్ని రంగాల్లో ప్రత్యేకించి ఆటోమోటివ్ రంగంపై 10 శాతం సుంకాలు విధించే అవకాశం ఉంటుందని ఎస్ఎంఎంటీ ఆందోళన వ్యక్తం చేసింది.

ఫలితంగా యునైటెడ్ కింగ్ డంలో 2021 నాటికి 10.7 లక్షల యూనిట్ల కార్ల ఉత్పత్తి పడిపోతుందని ఇది.. 1980వ దశకం మధ్య పరిస్థితులను గుర్తుకు తెస్తుందని ఎస్ఎంఎంటీ ఆందోళన వ్యక్తం చేసింది. 

వరుసగా రెండుసార్లు బ్రిటన్ ఎంపీలు బ్రెగ్జిట్ ప్లాన్‌ను తిరస్కరించారు. మరోవైపు బ్రెగ్జిట్ ఆందోళనల మధ్య 2018లో కార్ల ఉత్పత్తి 15.2 లక్షలు తగ్గిపోయింది. 2019లో 13.6 లక్షల యూనిట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నది ఎస్ఎంఎంటీ. ఈ పరిస్థితి 2021 నాటికి 14.2 లక్షల యూనిట్లకు తగ్గుతుందని అంచనా. 

ఎటువంటి డీల్ కుదరకుంటే టారిఫ్ లు ప్లస్ వ్యయం పెరిగిపోతుంది. సరఫరా చైన్ దెబ్బ తింటుందని ఎస్ఎంఎంటి ఆందోళన వ్యక్తం చేసింది. పోటీ తత్వం వల్ల టారిఫ్ లను కార్ల తయారీ సంస్థలు లెక్క చేయని పరిస్థితి నెలకొంటుంది. బ్రెగ్జిట్ గడువు పెరిగినా.. డీల్ లేకుంటే ముప్పు పొంచి ఉన్నట్లేనని ఎస్ఎంఎంటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైక్ హవెస్ తెలిపారు. 

ప్రస్తుత పరిస్థితి వినాశకరంగా ఉంటుదని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. వ్యయ భరితమైన ఫ్యాక్టరీలను మూసివేయడంతోపాటు పెట్టుబడులను నిలిపివేస్తున్నారు. జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ కూడా  ఈశాన్య ఇంగ్లండ్ సుందర్ లాండ్‌లోని తన ఇనిఫినిటి కార్ల తయారీని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.

హోండా కార్స్ సైతం ఎక్స్ ట్రయల్ ఎస్ యూవీ కార్ల తయారీ ప్రణాళికలను రద్దు చేసుకున్నది. నైరుతి ఇంగ్లండ్‌లోని యూనిట్ ను హోండా కార్స్ మూసివేయనున్నది. ఫలితంగా 3,500 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు.  

click me!