భారతమార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. టెస్లా కార్లను భారతదేశానికి తీసుకొచ్చేందుకు కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సమయంలో మస్క్‌తో జరిగిన చర్చల తర్వాత ఈ దిశగా అడుగులు పడుతున్నట్లు వార్తలు వచ్చాయి..
ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్లు త్వరలోనే భారతదేశ రోడ్లపై పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే వేగంగా అడుగులు పడుతున్నాయి. ముంబయి, ఢిల్లీలో మొదట టెస్లా షోరూమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించి టెస్లా ఇండియా ఇప్పటికే ఉద్యోగాల నియామకానికి కూడా శ్రీకారం చుట్టిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో టెస్లా కార్ల ధరలు ఎలా ఉండనున్నాయి.? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఇప్పటికిప్పుడు టెస్లా భారత్‌లో తయారీ యూనిట్‌ను ప్రారంభించే అవకాశం లేదు. ఇప్పటికే చైనాలో తయారీ ప్లాంట్ ఉన్న నేపథ్యంలో టెస్లా భారత్‌లో కార్ల తయారీ చేపడుతుందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం టెస్లా కార్లను దిగుమతి చేయనుంది. దీంతో ఈ కార్లపై దిగుమతి సుంకాలు ఉండనున్నాయి. అయితే మోదీతో జరిగిన చర్చల్లో ఎలాన్ మస్క్ ప్రాథమికంగా ఈ సుంకాల గురించే మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. టెస్లా కార్లపై దిగుమతి సుంకాన్ని 20 శాతం తగ్గించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరి భారత్‌లో టెస్లా కార్ల ధరలు ఎలా ఉండనున్నాయో ఇప్పుడు చూద్దాం. దిగుమతి సుంకాన్ని 20 శాతం తగ్గించినా టెస్లా ప్రారంభ వేరియంట్ కారు కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 35 లక్షలు చెల్లించాల్సిందేనని గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ 'సీఎల్ఎస్ఏ' నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో టెస్లా చౌకైక కారు మోడల్3 ధర సుమారు 35,000 డాలర్లుగా ఉంది. మన కర్సెన్సీలో చెప్పాలంటే సుమారు రూ. 30 లక్షలకు పైమాటే. అయితే దిగుమతి సుంకాలను 15-20 శాతానికి తగ్గించడంతో పాటు, రోడ్ ట్యాక్స్ & ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులతో, ఆన్-రోడ్ ధర 40,000 డాలర్లు లేదా దాదాపు రూ. 35-40 లక్షలుగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే భారత మార్కెట్‌ను అనుగుణంగా టెస్లా ఎంట్రీ లెవల్ కారును రూ. 25 లక్షల ధరలో తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది దేశీయంగా ఉన్న కార్ల కంపెనీలపై కచ్చితంగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నారు. టెస్లా కార్లు రానున్నయన్న వార్త రాగానే మహీంద్రా మహీంద్రా స్టాక్ విలువ 6 శాతం తగ్గడమే దీనికి సాక్ష్యంగా చెబుతున్నారు. అయితే భారత్‌లో ప్రస్తుతం ఉన్న మిడ్ వేరియంట్ కార్లతో పోల్చితే టెస్లా మోడల్ 3 ధర సుమారు 20 నుంచి 50 శాతం ఎక్కువగా ఉండే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో టెస్లా అమ్మకాలు భారత్‌లో ఆశాజనకంగానే ఉంటాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే టెస్లా ఎంట్రీ భారత ఆటోమొబైల్ రంగంలో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు ఉండకపోవచ్చని సీఎల్ఎస్ఏ అభిప్రాయపడుతోంది. దీనికి కారణం చైనా, యూరప్, అమెరికాలతో పోల్చితే భారత్‌లో ప్రస్తుతం ఈవీ మార్కెట్ ఇంకా ఆశించిన స్థాయికి చేరుకోలేదు. ఈ కారణంగా టెస్లా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినా తక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.