ఫోర్డ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)ను ఫ్రాన్స్‌కు చెందిన పీఎస్ఏ సంస్థకు విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తలను టాటా మోటార్స్ తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ: ఫోర్డ్ కంపెనీ నుంచి 2008లో కొనుగోలు చేసిన ప్రీమియం లగ్జరీ కార్ల తయారీ కంపెనీ జాగ్వార్ లాండ్ రోవర్‌కు చెందిన బ్రిటిష్ విభాగాన్ని టాటా మోటార్స్ విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నదన్న వార్తలను కంపెనీ ఖండించింది. జేఎల్‌ఆర్‌ను ఫ్రెంచి ఆటోమోటివ్ కంపెనీ పీఎస్ఏ గ్రూప్‌నకు విక్రయించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందంటూ కొన్ని వార్తలు వెలువడ్డాయి.
‘బ్రెగ్జిట్’ నేపథ్యంలో ఈయూ మార్కెట్లో ప్రతికూలతలు
ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ ఈ వివరణ ఇచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది.
బ్రెగ్జిట్ నేపథ్యంలో యూరోపియన్ మార్కెట్‌లో జాగ్వార్ లాండ్ రోవర్ తీవ్ర ప్రతికూలత పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీంతో అంతర్జాతీయంగా తమ కార్మికశక్తిని 4,500 వరకు తగ్గించనున్నట్టు టాటా మోటార్స్ గత జనవరిలో ప్రకటించింది. తద్వారా రూ.1,820 కోట్ల మేరకు పొదుపు చర్యలు పాటించనున్నది.
మీడియాలో వచ్చిన వార్తలపై స్పందనకు టాటా మోటార్స్ ‘నో రియాక్షన్’
జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్)ను విక్రయించనున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై తాము స్పందించబోమని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి తెలిపారు. ఇవన్నీ వట్టి వదంతులేనన్నారు.
కాగా, వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి జేఎల్ఆర్ విక్రయం ద్వారా రూ.22,750 కోట్ల పెట్టుబడులు సమకూర్చుకోవాలని టాటా మోటార్స్ భావిస్తున్నట్లు ఆ మీడియా కథనాలు పేర్కొన్నాయి.