మార్చి నెలలో కార్లు, మోటారు బైక్‌ల విక్రయాలు ఫర్వాలేదనిపించాయి. మార్చిలో మారుతి సేల్స్ పడిపోయినా గత ఆర్థిక సంవత్సరంలో మొదటి స్థానంలోనే నిలిచింది. మరోవైపు హోండా కార్స్, సుజుకి మోటార్స్ బైక్ విక్రయాలు మెరుగయ్యాయి.
మార్చిలో దేశీయ వాహన విక్రయాలు ఓ మోస్తారుగా నమోదయ్యాయి. గత నెల దేశీయ అమ్మకాల్లో మారుతీ సుజుకి స్వల్ప క్షీణతను నమోదు చేయగా.. హోండా కార్స్ విక్రయాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేయగలిగింది.
మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనం ప్రభావం వాహనాల విక్రయాలపై చూపిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2018తో పోలిస్తే మారుతీ సుజుకీ అమ్మకాలు 1,60,598 నుంచి 1.6 శాతం తగ్గి 1,58,076కు చేరాయి.
గత నెలలో ఆల్టో, వ్యాగన్‌ఆర్‌లతో కూడిన మారుతీ చిన్నకార్ల విభాగం విక్రయాలు ఏకంగా 55.1 శాతం తగ్గి 16,826గా నమోదయ్యాయి. గతేడాది మార్చిలో ఇవి 37,511గా ఉన్నాయి. స్విఫ్ట్, సెలెరియో, బాలెనో, డిజైర్ మోడళ్లతో కూడిన కాంపాక్ట్ విభాగం అమ్మకాలు 19.8 శాతం పెరిగి 82,532కు చేరాయి.
విటారా బ్రెజా, ఎస్- క్రాస్, ఎర్టిగా వంటి యుటిలిటీ వాహన విక్రయాలు 12.3 శాతం పెరిగి 25,563కు చేరాయి. ఇక ద్విచక్రవాహనాల కొస్తే.. సుజుకీ మోటార్ సైకిల్ అమ్మకాలు 28 శాతం పెరిగాయి.
హోండా కార్స్ సేల్స్ 27 శాతం వ్రుద్దిరేటు నమోదు చేసుకున్నది. గతేడాది 13,574 యూనిట్లు మాత్రమే విక్రయించిన హోండా కార్స్ ఈ ఏడాది 17,202 కార్లను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు స్వల్పంగా 1.4 శాతంతో 62,076 నుంచి 62,952 యూనిట్లకు పెరిగాయి.
మరోవైపు టయోటా కిర్లోస్కర్స్ మోటార్స్ విక్రయాలు అతి స్వల్పంగా 0.9 శాతం పెరిగాయి. గతేడాది 13,537 కార్లు విక్రయించిన టయోటా.. ఈ ఏడాది మార్చి 13,662 యూనిట్లు అమ్మగలిగింది. మరోవైపు టాటా మోటార్స్ సేల్స్ ఒక్కశాతం తగ్గుముఖం పట్టాయి.
కమర్షియల్స్ వెహికల్స్ విభాగంలో మహీంద్రా ట్రాక్టర్స్ సేల్స్ అత్యంత దారుణంగా 31 శాతం తగ్గి 28,477 నుంచి 19,688 యూనిట్లకు పడిపోయాయి. వీఈసీవీ మోటార్స్ విక్రయాలు 9,411 నుంచి 8,545కు తగ్గిపోయాయి. అశోక్ లేలాండ్ సేల్స్ కూడా నాలుగు శాతం తగ్గిపోయాయి.
గతేడాది 22,453 వాహనాలు అమ్ముడు పోగా, ఈ ఏడాది 21,535 వాహనాలకు మాత్రమే పరిమితమైంది అశోక్ లేలాండ్. ఒక్క ఎస్కార్ట్స్ మాత్రమే ఒక్క శాతం సేల్స్ పెంచుకోగలిగింది. గతేడాది 11,790 వాహనాలు విక్రయించిన ఎస్కార్ట్స్ సేల్స్ ఈ ఏడాది 11,905 యూనిట్లకు చేరాయి.
ఇక ద్విచక్ర వాహనాల విభాగంలో సుజుకి మోటార్స్ 28 శాతం వ్రుద్ధిరేటు నమోదు చేశాయి. గతేడాది 52,167 బైక్ లు, స్కూటర్లు విక్రయిస్తే, ఈ ఏడాది 67,025 యూనిట్ల వాహనాలను విక్రయించింది. కానీ టీవీఎస్ మోటార్స్ సేల్స్ 0.4 శాతం పడిపోయాయి.
గతేడాది 3,26,667 యూనిట్లు విక్రయించిన టీవీఎస్ మోటార్స్ ఈ ఏడాది 3,25,345 యూనిట్లకే పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు 12 శాతం వృద్ధితో 37.57 లక్షలకు పెరిగాయి.హీరో మోటోకార్ప్ 78,20,745 వాహనాలు విక్రయించింది. 2017–18లో అమ్మకాలు 75,87,130గా నమోదయ్యాయి.
గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో ఆటోమొబైల్ మేజర్లు మారుతీ సుజుకీ, హ్యుండాయ్, మహీంద్రా అమ్మకాల్లో సింగిల్ డిజిట్ గ్రోత్‌తో సరిపెట్టుకున్నాయి. ఏడాదిలో తొమ్మిది నెలల్లో గిరాకీ మందగించడం గమనార్హం.
మారుతీ సుజుకీ 2018-19లో రికార్డు స్థాయిలో 18,62,449 వాహనాలు విక్రయించింది. 2017-18లో విక్రయించిన 17,79,574 వాహనాలతో పోలిస్తే ఈ సారి 4.7 శాతం అధికంగా అమ్మింది.
హ్యుండాయ్ అమ్మకాలు 2.5 శాతం వృద్ధితో 6,90,184 నుంచి 7,07,348కు పెరిగాయి. మహీంద్రా అమ్మకాలు సైతం 5.49 లక్షల నుంచి నుంచి 11 శాతం వృద్ధితో 6.08 లక్షలకు చేరాయి.
టయోటా, హోండా కార్స్ సైతం గత ఆర్థిక సంవత్సర విక్రయాల్లో సింగిల్ డిజిట్ వృద్ధి నమోదు చేశాయి. టయోటా అమ్మకాలు 7 శాతం పెరిగి 1,50,525కు చేరాయి. హోండా కార్స్ అమ్మకాలు 8 శాతం అధికమై 1.83 లక్షలుగా నమోదయ్యాయి.
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీకి మార్చి నెల విక్రయాలు షాకిచ్చాయి. ఈ నెలలో విక్రయాలు 1,58,076కు తగ్గాయి. 2018 మార్చిలో 1,60,598గా నమోదయ్యాయి. వీటిల్లో ఒక్క దేశీయ విక్రయాల్లోనే 0.7శాతం తగ్గుదల నమోదైంది.
ఇక విదేశీ విక్రయాల్లో దాదాపు 13శాతం తగ్గి 10,463 యూనిట్లుగా మారింది. గత ఏడాది మార్చిలో 12,016 యూనిట్లను విక్రయించారు. కానీ 2018-19లో మొత్తంగా మారుతీ సుజుకి విక్రయాలు 4.7 శాతం పెరిగి 18,62,449కు చేరాయి.
మారుతీ విక్రయాల్లో పెరుగుదల కనిపించడం వరుసగా ఇది ఏడోసారి. అంతకు ముందు సంవత్సరం 17,79,574గా నమోదైయ్యాయి. ఇదే సమయంలో దేశీయ విక్రయాలు కూడా పెరిగాయి.
కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్లో మాత్రం మారుతి సుజుకి మంచి వృద్ధి రేటును నమోదు చేసింది. ఈ విభాగంలో డిజైర్, ఇగ్నీస్, స్విఫ్ట్, వేగనార్ వంటి మోడళ్లు ఉన్నాయి. వీటి విక్రయాలు 20శాతం వరకు పెరిగి 82,532 యూనిట్లకు చేరాయి.
యుటిలిటీ వాహనాలు, వ్యాన్ల విభాగంలో కూడా 12.3శాతం, 20.1శాతం పెరుగుదల కనిపించింది. టాటా మోటార్స్ విక్రయాలు గత ఆర్థిక సంవత్సరం 16 శాతం వృద్ధితో 5,86,507 యూనిట్స్ నుంచి 6,78,486కి చేరాయి.
ఇక హోండా కార్స్ ఇండియా అమ్మకాలు 8 శాతం పెరిగి 1,70,026 యూనిట్స్ నుంచి 1,83,787 యూనిట్స్‌కు చేరాయి. మార్కెట్లో కఠిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ ఫలితాలు సాధించడం సానుకూలాంశమని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయల్ చెప్పారు.