మరింత ప్రియం కానున్న నిస్సాన్ కార్లు... నూతన ఆర్థిక సంవత్సరంలో

By Arun Kumar P  |  First Published Mar 31, 2019, 12:17 PM IST

మిగతా కార్ల తయారీ సంస్థల బాటలోనే నిస్సాన్, ఇసుజు పయనిస్తున్నాయి. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సెలెక్టెడ్ మోడల్ కార్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. 


న్యూఢిల్లీ: ఏప్రిల్‌ 1 నుంచి డాట్సన్‌ గో, గో+ కార్ల ధరలను 4 శాతం వరకు పెంచుతున్నట్లు వాహన తయారీదారు నిస్సాన్‌ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు పలు ప్రతికూల పరిణామాల నేపథ్యంలో డాట్సన్‌ కార్ల ధరలను పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేస్తున్నట్లు నిస్సాన్‌ మోటార్‌ ఇండియా సేల్స్‌ అండ్‌ కమర్షియల్ డైరెక్టర్‌ హర్దీప్‌ సింగ్‌ బ్రార్‌ తెలిపారు.
 
అదే బాటలో ఇసుజు మోటార్స్ కూడా 
వచ్చే నెల నుంచి వాహన ధరలను పెంచుతున్నట్లు ఇసుజు మోటార్స్‌ ఇండియా కూడా ప్రకటించింది. డీ-మ్యాక్స్‌ రెగ్యులర్‌ క్యాబ్‌, ఎస్‌-క్యాబ్‌ రేట్లను 2 శాతం వరకు పెంచింది. ప్రస్తుతం డీ-మ్యాక్స్‌ రెగ్యులర్‌ క్యాబ్‌ ధర రూ.7.4 లక్షలు, ఎస్‌-క్యాబ్‌ రేటు రూ.8.88 లక్షలుగా ఉంది. ఇప్పటికే రెనాల్ట్ క్విడ్, టాటా మోటార్స్, జాగ్వార్ లాండ్ రోవర్, టయోటా, మారుతి సుజుకి తదితర కార్ల తయారీ సంస్థలు కూడా ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

థర్డ్ పార్టీ వెహికల్ ఇన్సూరెన్స్ యధాతథం
వాహనదారులకు భారీ ఊరట లభించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బైకులు, కార్లు, వాణిజ్య వాహనాలపై విధించే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం చార్జీలను యథాతథంగా ఉంచుతూ బీమా నియంత్రణ మండలి (ఐఆర్‌డీఏఐ) నిర్ణయించింది. గత పదేళ్లుగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులను 10 శాతం నుంచి 40 శాతం వరకు పెంచుతూ వచ్చిన నియంత్రణ మండలి.. గతేడాది మాత్రం 10-20 శాతం వరకు తగ్గించి అందరిని విస్మయానికి గురి చేసింది. వచ్చే ఏడాదికి మాత్రం చార్జీల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

Latest Videos

వ్యక్తిగత ప్రమాదం జరిగినా, యాజమాన్యానికి నష్టం వాటిల్లినా థర్డ్ పార్టీ బీమా కీలకం
వ్యక్తిగతంగా ప్రమాదం జరిగినప్పుడు, యాజమాన్యానికి నష్టం వాటిళ్లినప్పుడు ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కీలకం కానున్నది. ఈ ఏడాది కూడా 20-30 శాతం వరకు పెంచవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేసినా ఐఆర్‌డీఏఐ మాత్రం యథాతథానికి మొగ్గుచూపింది. ఎస్‌యూవీ వాహనాలపై థర్డ్ పార్టీ బీమా ప్రీమియం  రూ.7, 890గా నిర్ణయించింది ఐఆర్‌డీఏఐ. 

మోపెడ్లు, స్కూటర్లపై ఇలా.. ఎస్‌యూవీ బైక్‌లు, కార్లపై తడిసి మోపెడు
మోపెడ్స్, చిన్న స్థాయి కెపాసిటీ కలిగిన స్కూటర్లు, ద్విచక్ర వాహనాలపై రూ.427 థర్డ్ పార్టీ ప్రీమియం వసూలు చేస్తుండగా..75-150 సీసీ సామర్థ్యం కలిగిన స్కూటర్లు, మోటార్‌బైకులపై రూ.720, విలాసవంతమైన బైకులపై రూ.985 వసూలు చేస్తున్నారు. 1,000-1,500 సీసీ సామర్థ్యం కలిగిన చిన్న కార్లపై రూ.1,850, 1,500 సీసీ ఎక్కువ ఉండే ఎస్‌యూవీలపై రూ.2,863 నుంచి రూ.7,890 వరకు విధిస్తున్నది ఆటో రిక్షాలపై రూ.2,595, ఈ-రిక్షాలపై రూ.1,685, చిన్న కమర్షియల్ వాహనాలపై రూ.5,437, ఎంట్రీ లెవల్ సెడాన్స్‌లపై రూ.7,147 విధిస్తున్నది.
 

click me!