సేల్స్ మామూలుగా ఉన్నా.. ముంచెత్తనున్న కొత్తకార్లు

By Siva KodatiFirst Published Mar 31, 2019, 11:59 AM IST
Highlights

సేల్స్ నిరాశా జనకంగా ఉన్నా.. కార్ల తయారీ సంస్థలు నూతన మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సంసిద్ధమవుతున్నాయి. ఎంజీ మోటార్స్, జీప్, హ్యుండాయ్ కార్లు నూతన మోడల్ కార్లను సంసిద్ధం చేస్తున్నాయి. 

కార్ల అమ్మకాలు దేశీయ మార్కెట్‌లో నిరాశాజనకంగా సాగుతున్నాయి. ఆఫర్లు, డిస్కౌంట్లు ఇచ్చినా పుంజుకోవడం లేదు. మరోవైపు కార్ల ధరలను పెంచుతున్నట్టు కంపెనీలు ప్రకటిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల తరుణంలో మార్కెట్‌లో పరిస్థితులు హెచ్చు తగ్గులకు గురి కావచ్చునని అంటున్నారు. 

ఈ పరిస్థితులను కొత్త కార్లతో ఎదుర్కోవడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి. చైనా ఆటోమొబైల్ మేజర్ ఎంజీ మోటార్స్ ఈ ఏడాది మధ్యకాలంలో హెక్టార్‌ ఎస్‌యూవీ మోడల్ కారును భారత మార్కెట్లోకి తేవాలనుకుంటోంది.

పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఎంజీ మోటార్స్ హెక్టార్
ఎంటీ మోటార్స్ ‘హెక్టార్’ కారు డీజిల్‌, పెట్రోల్‌ ఇంజన్లతో అందుబాటులోకి రానున్నది. బౌజన్‌ 530 పేరుతో విక్రయిస్తున్న ఎస్‌యూవీలో భారత డ్రైవింగ్‌ కండీషన్లకు అనుగుణంగా కంపెనీ మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం. దీని ధర రూ.15 లక్షలు ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు.

 

జీప్‌ కంపాస్ అప్‌గ్రేడ్ వర్షన్ కారు ట్రయల్‌హాక్‌
ఇప్పటికే విపణిలో మంచి ఆదరణ పొందుతున్న జీప్‌ కంపాస్‌ అప్‌గ్రేడ్‌ చేస్తూ జీప్‌ కంపాస్‌ ట్రయల్‌ హాక్‌ను కంపెనీ తీసుకువస్తోంది. ఇందులో యాక్టివ్‌ డ్రైవ్‌‌లో రేంజ్‌ 4డబ్ల్యూడీ సిస్టమ్‌తోపాటు సరికొత్త రాక్‌ మోడ్‌ను కంపెనీ అందుబాటులోకి తెస్తోంది. 2.0 లీటర్ల డీజిల్ వేరయంట్ మోడల్ కారు ధర రూ. 25-30 లక్షలు ఉంటుందని చెబుతున్నారు.

 

17న భారత విపణిలోకి హ్యుండయ్‌ వెన్యూ 
వచ్చేనెల 17వ తేదీన దక్షిణ కొరియా మేజర్ హ్యుండాయ్ మోటార్స్ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్‌ (ఎస్‌యూవీ) ‘వెన్యూ’ మోడల్ కారును మార్కెట్లోకి ఆవిష్కరించనున్నది. ఇది మారుతీ సుజుకీ విటా బ్రెజ్జా, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, ఫోర్డ్‌ ఏకోస్పోర్ట్‌, టాటా నెక్సాన్‌ వంటి వాటికి పోటీనిస్తుందని చెబుతున్నారు. దీని ధర రూ.12-15 లక్షలు ఉంటుందని అంచనా. 

9.3 సెకన్లలోనే 100 కి.మీ వేగం హ్యుండయ్‌ కోనా సొంతం
దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ తన ఎలక్ర్టిక్‌ ఎస్‌యూవీ మోడల్ కారును త్వరలో మార్కెట్లోకి తేనున్నది. ఇదే దేశంలో అడుగు పెట్టనున్న తొలి ఎలక్ర్టిక్‌ ఎస్‌యూవీ కాబోతోంది.

ఎక్కువ దూరం కూడా దీని ద్వారా ప్రయాణించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు 9.3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. 

జూన్ నాటికి మార్కెట్లోకి హ్యుండాయ్ కోనా
భారత మార్కెట్లో ఉన్న పరిస్థితులకనుగుణంగా రూపొందించిన ఈ కారు జూన్‌నాటికి మార్కెట్లోకి రావొచ్చని భావిస్తున్నారు. గరిష్ఠంగా గంటకు 167 కిలో మీటర్లు ప్రయాణించనుంది.

కారులోని లిథియం ఆయాన్‌ బ్యాటరీ పూర్తిగా చార్జ్‌ కావడానికి ఆరు గంటల సమయం పట్టనుంది. ఫాస్ట్‌ చార్జర్‌తో గంటలోనే 80 శాతం చార్జ్‌ కానుంది. దీని ధర రూ.25 లక్షలు ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు.
 

click me!