ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’ వచ్చే ఏడాది భారత్ మార్కెట్లోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సదరు సంస్థ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఈ విషయం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఆటోమొబైల్ రంగ సంచలనం టెస్లా ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది ఖచ్చితంగా భారత్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఈ విషయం టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ బయటపెట్టారు. భారత్ మార్కెట్‌లో అడుగుపెట్టనివ్వకుండా నిబంధనల చట్రం అడ్డంకిగా ఉందంటూ విమర్శించిన పదినెలల తర్వాత మస్క్ ఈ సంగతి చెప్పారు.
టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ను ఉద్దేశించి‘ప్రొడక్టివ్ సిటిజన్’ అనే సంస్థ కజకిస్థాన్‌లో సూపర్ ఛార్జర్లను ఏర్పాటు చేస్తున్నామని ట్వీట్ చేసింది. దీనిపై ఎలన్ మస్క్ స్పందిస్తూ.. లండన్ నుంచి బీజింగ్‌కు సూపర్ ఛార్జర్ మార్గం అని క్యాప్షన్ ఇస్తూ దానిని రీ ట్వీట్ చేశారు.
కజకిస్థాన్ సంస్థ ట్వీట్‌కు స్పందిస్తూ టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ చేసిన రీ ట్వీట్‌పై శుభం రాఠీ అనే ఇండియన్ స్పందిస్తూ‘మరి భారత్ సంగతేంటి?’అని ప్రశ్నించారు. శుభం ట్వీట్‌కు ఎలన్ మస్క్ స్పందించారు. ‘ఈ ఏడాది రావాడానికి ఇష్టపడతాను. సాధ్యం కాని పక్షంలో వచ్చే ఏడాదికల్లా అక్కడుంటాం’ అని ట్వీట్ చేశారు.
భారత్‌లో టెస్లా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ ప్రతిపాదన కొంత ముందుకు వెళ్లినా.. గత మేలో మాత్రం కొంత వివాదాస్పదమైంది. ప్లాంట్ ఏర్పాటు చేసేవరకూ దిగుమతి రుసుములు, ఇతర నిబంధనలు సడలించాలని మస్క్ కోరారు.
అక్కడే కాసింత బ్రేకులు పడినట్లు కనిపిస్తున్నది. ఆ సమయంలో ఎలన్‌మస్క్ ట్వీట్ చేస్తూ ‘ప్రభుత్వ నిబంధనల విషయంలో కొంత సవాళ్లను ఎదుర్కొంటున్నాం’ అని పేర్కొన్నారు.
ఇటీవల జనవరిలో టెస్లా చైనాలో ఐదు బిలియన్ డాలర్ల వ్యయంతో ఫ్యాక్టరీ పెడుతున్నట్లు తెలిపింది. అమెరికా వెలుపల టెస్లా ఏర్పాటు చేస్తున్న మొదటి ఫ్యాక్టరీ ఇదే. విదేశీమార్కెట్లను చేరుకోవడానికి వీలుగా దీనిని నిర్మిస్తున్నారు.
భారత్‌లో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. 2017నాటికి 425 ఛార్జింగ్ స్టేషన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటి సంఖ్యను 2022 నాటికి 2,800కు చేర్చాల్సిన అవసరం ఉంది.