మారుతి సుజుకి తన ఎస్‌యూవీ మోడల్ విటారా బ్రెజా టెక్నాలజీని టయోటా కిర్లోస్కర్ సంస్థకు సరఫరా చేసేందుకు అంగీకరించింది. 2017లో రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు విటారా బ్రెజా టెక్నాలజీని సరఫరా చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఇంతకుముందు సరఫరా చేసిన బాలెనో మోడల్‌ను టయోటా గ్లాంజా పేరిట మార్కెట్లో విక్రయిస్తోంది.
న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్స్ సంస్థకు తమ కంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ)ను సరఫరా చేసేందుకు తమ బోర్డు ఆమోదం తెలిపిందని మారుతు సుజుకి తెలిపింది. దీంతో టయోటా బ్రాండ్ మీద మారుతి ఎస్‌యూవీలను విక్రయించడానికి అనుమతి లభించినట్లయింది.
దీంతో తమ విక్రయాలు పుంజుకుంటాయని స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో మారుతి సుజుకి బుధవారం తెలిపింది. పర్యావరణ భద్రత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ, ఉత్పత్తులు, విడి భాగాల సరఫరాపై టయోటా, మారుతి సుజుకి సంస్థల మధ్య 2017 ఫిబ్రవరి ఆరో తేదీన అవగాహనా ఒప్పందం కుదిరింది.
undefined
ఇందులో భాగంగానే ఇప్పుడు టయోటాకు విటారా బ్రెజా మోడల్ టెక్నాలజీ సరఫరాకు మారుతి పచ్చజెండా ఊపింది. గతేడాది మార్చిలో మారుతి తన బ్రాండ్ బాలెనో మోడల్ కారు టెక్నాలజీ సరఫరాకు మారుతి సుజుకి ఆమోదం తెలుపడంతో టయోటా గ్లాంజా బ్రాండ్ పేరిట కార్లను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
also read మారుతి కార్ల ఉత్పత్తి ప్రారంభం.. షేర్లు 5% అప్
ఇందులో భాగంగా మారుతి సుజుకి తన బాలెనో, విటారా బ్రెజా మోడల్ బ్రాండ్లను టయోటాకు సరఫరా చేస్తున్నది. దీనికి ప్రతిగా టయోటా తన కొరిల్లా సెడాన్ మోడల్ టెక్నాలజీని మారుతి సుజుకికి సరఫరా చేస్తున్నది.
ఇదిలా ఉంటే జపాన్ సుమిటిమో కార్పొరేషన్‌లో 39.13 శాతం, సుమిటోమో కార్పొరేషన్ ఇండియాలో 10 శాతం వాటా కొనుగోలుకు కూడా మారుతి సుజుకి బోర్డు ఆమోదం తెలిపిందని ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది.
27 శాతం క్షీణించిన మారుతి సుజుకి నికర లాభం
దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం (2019-20) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి) లో రూ.1,322.3 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చితో పోల్చితే 27.77 శాతం క్షీణించింది.
నిరుడు రూ.1,830.8 కోట్ల లాభాలను అందుకున్నట్లు బుధవారం మారుతి సుజుకి తెలియజేసింది. అమ్మకాలు పడిపోవడం, ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగిపోవడం, మార్చిలో కరోనా ప్రభావం సంస్థ లాభాలకు గండి కొట్టాయి. నికర అమ్మకాలు 15.2 శాతం దిగజారి రూ.18,207.7 కోట్లకు పరిమితమయ్యాయి.