ఆర్థిక మందగమనానికి తోడు కరోనా మహమ్మారి ప్రభావంతో విలవిల్లాడుతున్న ఆటోమొబైల్ సంస్థలు ఆదాయం పెంచుకునేందుకు వ్యూహం మారుస్తున్నాయి. హ్యుండాయ్, ఎంజీ మోటార్స్, వోక్స్ వ్యాగన్ వంటి సంస్థలు వినియోగదారులకు లీజుకిచ్చే పద్దతిని ప్రారంభించాయి. ఈ కోవలోకి మారుతి సుజుకి కూడా వచ్చి చేరింది.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహన తయారీ సంస్థలు పంథాను మార్చుకుంటున్నాయి. దీంట్లో భాగంగా వాటి వద్ద పేరుకుపోయిన కార్లను లీజుకు ఇవ్వడానికి సైతం సిద్ధమయ్యాయి.
ఇప్పటికే హ్యుండాయ్, ఎంజీ మోటార్, వోక్స్‌వ్యాగన్ సంస్థలు ఇలాంటి సేవలను ఆరంభించాయి.. తాజాగా కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ సైతం ఈ సేవలకు శ్రీకారం చుట్టింది. సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో వ్యక్తిగతంగా లీజుకు తీసుకునే అవకాశం కల్పించింది.
ఇందుకోసం ఓరిక్స్ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్‌తో మారుతి సుజుకి (ఎంఎస్ఐ) ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద గుర్గావ్, బెంగళూరు నగరాల్లో ఈ సేవలను మారుతి సుజుకి ఆరంభించింది.
సబ్ స్క్రిప్షన్ పద్దతిలో కార్లను లీజుకు ఇచ్చే విధానాన్ని భవిష్యత్‌లో ఇతర నగరాలకు విస్తరించే యోచనలో మారుతి సుజుకి ఉన్నట్లు తెలుస్తున్నది. స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజ్జా, ఎర్టిగా మోడళ్లను సుజుకీ అరెనా చానెల్ కింద.. బాలెనో, సియాజ్, ఎక్స్‌ఎల్6లను నెక్సా చానెల్ కింద లీజుకు ఇస్తున్నట్లు మారుతి తెలిపింది.
also read ఓలా యాప్‌లో కొత్త ఫీచర్..డ్రైవర్లకు నచ్చినంత ఇవ్వొచు... ...
రెండేళ్ల నుంచి నాలుగేళ్ల కాలపరిమితితో లభిస్తున్న ఈ కార్లు వ్యక్తిగత, కార్యాలయ అవసరాల నిమిత్తం కార్పొరేట్ సంస్థలు తీసుకునే అవకాశం ఉంటుంది. వాహనాన్ని వాడుకున్నందుకు, నిర్వహణ, బీమా కోసం చెల్లింపులు జరుపాల్సి ఉంటుంది. లీజుకు ఇచ్చే కార్లలో కొత్తవే ఉంటాయని, పాత కార్లను వాడే అవకాశాలు లేవని మారుతి సుజుకి స్పష్టంచేసింది.
గత నెలలో మారుతి సుజుకి విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 54 శాతం తగ్గి 57,428కి చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి కార్ల విక్రయాలు 81 శాతం పడిపోయాయి.
అంటే 2019-20లో 4,02,594 కార్లు మాత్రమే విక్రయించింది మారుతి సుజుకి. రెండు నెలల క్రితం హ్యుండాయ్ దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో ప్రారంభించిన వాహన లీజు సేవలకు అనూహ్య స్పందన రావడంతో మిగతా సంస్థలు కూడా అదేబాట పట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మారుతి సుజుకి తన స్విఫ్ట్, డిజైర్, బాలెనో, బ్రెజ్జా, సియాజ్, ఎక్స్‌ఎల్‌ఆర్, ఎర్టిగా మోడల్ కార్లను లీజుకు ఇవ్వనున్నది. 24, 36, 48 నెలల కాల పరిమితితో మారుతి సుజుకి లీజుకిస్తుంది. ప్రతి నెలా తాము తీసుకున్న కారుకు నిర్దిష్ఠ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులోనే నిర్వహణ, బీమా ప్రీమియం కూడా కలిసి ఉంటాయి.