అనూహ్యం: మారుతీ సుజుకి ‘బాలెనో’ ధర భారీగా పెంపు

By rajashekhar garrepally  |  First Published Apr 26, 2019, 9:56 AM IST

మారుతి సుజుకి తన వాహన శ్రేణిలో బాలెనో మోడల్ కారు ధర భారీగా పెంచేసింది. కానీ అందుకు కారణాలను చెప్పలేదు. అయితే గతేడాదితో పోలిస్తే మారుతి నికర లాభాలు తగ్గుముఖం పట్టాయి.



న్యూఢిల్లీ: దేశీయ ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్‌ఐ) గురువారం తన వాహన శ్రేణిలో బాలెనో ధరను కాస్త భారీగానే పెంచింది. డీజిల్‌, ఆర్‌ఎస్‌ పెట్రోల్‌ వేరియంట్ల ధరలు రూ.15వేల వరకూ పెరిగాయి. పెరిగిన ధర తక్షణం అమల్లోకి వస్తుందని మారుతీ స్పష్టం చేసింది. 

బాలెనో ఆర్ఎస్ వేరియంట్ ధర రూ.8.88 లక్షలు
మారుతీ సుజుకీ బాలెనో ఆర్‌ఎస్‌ వేరియంట్‌ ఒక లీటర్‌ బూస్టర్‌ జెట్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తుండగా, దీని ధర రూ.8.88లక్షలకు చేరింది. గతంలో ఇది 8.76లక్షలు లభించేది. ఇక బాలెనో డీజిల్‌ ధర ప్రస్తుతం 6.73లక్షల నుంచి 8.73లక్షలకు చేరింది.

Latest Videos

ధర పెంపుపై నోరు మెదపని మారుతి సుజుకి
గతంలో బాలెనో డీజిల్ వేరియంట్ కారు ధర రూ.6.61లక్షల నుంచి రూ.8.60లక్షలుగా ఉండేది. అకస్మాత్తుగా ధరలను ఎందుకు పెంచాల్సి వచ్చిందో మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించలేదు. 

గతవారమే బీఎస్ -6 ప్రమాణాలతో బాలెనో
గత వారం మారుతీ బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన బాలెనోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది 1.2పెట్రోల్‌ ఇంజిన్‌తో రానుండగా, దీని ధర రూ.5.58లక్షల నుంచి 8.9లక్షల మధ్య ఉంది.

తగ్గిన మారుతీ ఇండియా నికర లాభాలు
మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్‌ఐ) 2018-19 ఆర్థిక సంవత్సరం మార్చి నెలతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో నికర లాభాలు 4.6 శాతం మేర తగ్గి రూ. 1,795.6 కోట్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2017-18) ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ. 1,882.1 కోట్లుగా ఉంది. 2018-19 నాలుగో త్రైమాసికంలో నికర అమ్మకాలు మాత్రం గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగి రూ. 20,737.5 కోట్లుగా నమోదైనట్లు ఎంఎస్‌ఐ ప్రకటించింది. 

చివరి త్రైమాసికంలో తగ్గిన కార్ల సేల్స్
ఇదే త్రైమాసికంలో కార్ల అమ్మకాలు కూడా కొంతమేరకు తగ్గి 4,58,479 యూనిట్లను విక్రయించామని సంస్థ పేర్కొంది. అదే సమయంలో నికర అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 6.3 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 83,026.5 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం(2018-19)లో 4.7 శాతం వృద్ధి నమోదు చేసి 18,62,449 యూనిట్లను విక్రయించారు. 

లాభాలు తగ్గినా షేర్ కు రూ.80 డివిడెండ్
 1,08,749 యూనిట్లను ఎగుమతి చేసినట్లు మారుతి సుజుకి సంస్థ ప్రకటించింది. మరోవైపు నికర లాభాలు తగ్గినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరానికిగాను మారుతీ సుజుకీ ఇండియా ఒక్కో షేర్‌కు రూ. 80 చొప్పున డివిడెండ్‌ ప్రకటించడం గమనార్హం.
 

click me!