విక్రయాలు పెంచుకోవడంతోపాటు మార్కెట్ విస్తరణ కోసం టాటా హారియర్ రకరకాల ప్రణాళికలను రూపొందిస్తున్నది. ఆ క్రమంలో ఈ నెల 23వ తేదీన ప్రారంభం కానున్న క్రికెట్ ‘ఐపీఎల్-’ టోర్నమెంట్‌లో అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తుంది.
బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)తో వరుసగా రెండో ఏడాది టాటా మోటార్స్ తన అనుబంధాన్ని పెనవేసుకున్నది. టాటా మోటార్స్ నూతనంగా మార్కెట్లోకి విడుదల చేసిన హారియర్ మోడల్ కారు, త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అధికారిక భాగస్వామి కానున్నది.
క్రితం సారి సబ్ కంపాక్ట్ ఎస్ యూవీ మోడల్ కారు టాటా నెక్సాన్ మోడల్ కారు ఐపీఎల్ అధికారిక భాగస్వామిగా వ్యవహరించింది. దీనిపై ఐపీఎల్ టోర్నీలో పాల్గొన్న ఎనిమిది టీంల కెప్టెన్లు సంతకాలు చేశారు. అలా సంతకాలు చేసిన కారును వేలం వేశారు.
క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ఈ నిధులను ఖర్చు చేశారు. ఈ నెల 23వ తేదీన ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే అన్ని స్టేడియంల వద్ద టాటా హారియర్ కారును షోకేసులో ప్రదర్శిస్తారు.
ఐపీఎల్ టోర్నీతో అనుబంధంపై టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు మయాంక్ పరీఖ్ స్పందిస్తూ ‘గతేడాది అనుబంధం పెనవేసుకోవడంలో విజయం సాధించింది.
దీంతో ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్‌గా నిలిచే ఐపీఎల్ టోర్నీలో అధికార భాగస్వామిగా ఉండేందుకు టాటా హారియర్ మోడల్ కారు సరైంది. దీనిపై వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది.
స్టేడియాల్లో అందరి ద్రుష్టిని ఆకర్షించేందుకు మేం ప్రణాళికలు రూపొందించాం. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అద్భుతమైన ప్రతిస్పందన లభించింది’ అని తెలిపారు. భారతదేశంలో గత జనవరిలోనే టాటా హారియర్ మోడల్ ఎస్‌యూవీ కారును ఆవిష్కరించింది.
న్యూ ఒమెగా ఆర్క్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన టాటా హరియర్ కారు ఐదు సీట్ల సామర్థ్యంతో రూపొందించారు. దీని ధర రూ.12.69 లక్షల నుంచి రూ.16.25 లక్షల వరకు పలుకుతుంది.
టాటా హారియర్ కారును సమర్థవంతంగా మార్కెట్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా ఈ వ్యూహాన్ని ఖరారు చేయనున్నది. ఐపీఎల్ 2019 టోర్నీ అధికారిక భాగస్వామిగా టాటా హరియర్ పేరుతో సూపర్ స్టైకర్ అవార్డులను ప్రదానం చేస్తారు. బెస్ట్ స్ట్రైకర్ అవార్డు కింద రూ. లక్ష నగదు బహుమతి ఇస్తుంది.
అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ టాటా హారియర్ కారును గెలుచుకునే అవకాశం కూడా ఉన్నది. సింగిల్ హ్యాండ్ తో బంతిని పట్టుకున్న క్రికెటర్ కూ రూ. లక్ష నగదు బహుమతిని టాటా హారియర్ అందజేస్తుంది.