ఇక ప్యాసింజర్, కమర్షియల్ వెహికల్స్ కాస్ట్‌లీ: మహీంద్రా

By Siva KodatiFirst Published Mar 29, 2019, 10:30 AM IST
Highlights

జాగ్వార్ లాండ్ రోవర్, టయోటా, టాటా మోటార్స్ సంస్థల బాటలోనే మహీంద్రా అండ్ మహీంద్రా పయనిస్తోంది. ముడి సరుకు ధరలు పెరిగాయని వచ్చే నెల అన్ని రకాల వెహికల్స్ ధరలు పెంచేస్తున్నది. ప్రయాణికుల, వాణిజ్య వాహనాల ధరలు రూ.5000 నుంచి రూ.73 వేల వరకు పెరుగుతాయి. 

టాటా మోటార్స్, జాగ్వార్ లాండ్ రోవర్, టయోటా కిర్లోస్కర్ తదితర ఆటోమొబైల్ సంస్థల బాటలో దేశీయ ఆటోమేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా పయనించనున్నది. ప్రయాణికుల, వాణిజ్య వాహనాల ధరలను వచ్చేనెల ఒకటో తేదీ పెంచనున్నట్లు ప్రకటించింది.

ఇన్ పుట్ వ్యయం పెరగడంతో వాహనాల ధరలను పెంచక తప్పడం లేదని పేర్కొంది. కనీసం రూ.5000 నుంచి రూ.73 వేల వరకు ఆయా కార్లు, వాహనాల ధరలు పెరుగుతాయని మహీంద్రా అండ్ మహీంద్రా ఒక ప్రకటనలో తెలిపింది.

వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 0.5 శాతం నుంచి 2.7 శాతం వరకు ధరలు పెరుగుతాయని మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొన్నది. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ విభాగం అధ్యక్షుడు రాజన్ వధేరా మాట్లాడుతూ ఈ ఏడాది అత్యధికంగా ముడి సరుకు ధరలు పెరిగాయి.

ఈ నేపథ్యంలో కార్లు, వాణిజ్య వాహనాల ధరలను తగ్గించడానికి తాము చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచుతున్నామని చెప్పారు. 

ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన కంపాక్ట్ ఎస్ యూవీ ఎక్స్ యూవీ 300 నుంచి ప్రీమియం ఎస్‌యూవీ ఆల్టారస్ జీ 4 వంటి ప్రయాణ కార్లు.. సుప్రో, జీటో వంటి వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది.

ఇప్పటికే ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ తన క్విడ్ కార్ల ధరలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మూడు శాతం పెంచనున్నట్లు పేర్కొంది. గతవారం టాటా మోటార్స్ ప్రయాణ వాహనాల ధరలు రూ.25 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇంకా జాగ్వార్ లాండ్ రోవర్ సెలెక్టెడ్ వెహికల్స్‌పై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 

click me!