లాక్‌ డౌన్ పొడిగింపుపై ఆనంద్ మహీంద్రా వార్నింగ్

By Sandra Ashok Kumar  |  First Published May 26, 2020, 1:04 PM IST

మరికొంత కాలం లాక్ డౌన్ పొడిగించడం వల్ల ఆర్థిక వినాశనంతోపాటు వైద్య సంక్షోభం కూడా తలెత్తుతుందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా హెచ్చరించారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏదీ కూడా సర్కార్ ముందు లేదని కూడా అంగీకరించారు.


న్యూఢిల్లీ: కరోనా విశ్వమారిని కట్టడి చేయడానికి లాక్‌డౌన్‌ను పొడిగిస్తే కేవలం ఆర్థిక వినాశనంతోనే ఆగదని, మరో వైద్య సంక్షోభం కూడా సంభవిస్తుందని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా హెచ్చరించారు. ఇప్పటికే దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించిందని గుర్తు చేశారు. 

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వానికి అంత సులభం కాదని అంగీకరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విధాన నిర్ణేతలకు ప్రత్యామ్నాయ అవకాశాలు తక్కువే ఉన్నాయని పేర్కొన్నారు.

Latest Videos

కరోనాకు ముందే బీఎస్-6 నిబంధనల అమలు అంశం ముందుకు రావడం, ఆర్థిక మందగమనం వల్ల ఆటోమొబైల్ రంగం బాగా దెబ్బ తిన్నది. కరోనా విశ్వమారి సమస్య ముందుకు రావడంతో ఆటోమొబైల్ రంగం మరింత కుంగి పోయింది. గతంలో ఎప్పుడూ ఎదుర్కోని ఆర్థిక సవాల్‌కు గురవుతున్నది. 

లాక్‌డౌన్‌ పొడిగింపుతో ప్రయోజనమేమీ ఉండదని ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. ‘ఇంతకుముందు నేను ట్వీట్‌ చేసినట్లు లాక్‌డౌన్‌ పొడిగింపులు కేవలం ఆర్థికపరమైన నష్టాలకే పరిమితం కావు. మరో వైద్య సంక్షోభాన్నీ సృష్టిస్తాయి’ అని ఆనంద్‌ మహీంద్రా సోమవారం ట్వీట్‌ చేశారు. 

ఈ సందర్భంగా ‘లాక్‌డౌన్లతో ప్రమాదకర మానసిక ప్రభావాలు - కరోనాయేతర ప్రజలపట్ల దారుణ నిర్లక్ష్యం’ అనే అంశాన్ని ప్రస్తావించారు. అలాగే ‘రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇక ఆస్పత్రులను, అందులోని పడకలను పెంచడంపై దృష్టి పెట్టాలి. ఆక్సిజన్‌ సదుపాయాలనూ పెద్ద ఎత్తున సమకూర్చుకోవాలి’ అన్నారు.

also read  

పరిమిత వనరుల్లో దవాఖానల్లో పడకల పెంపు విషయంలోనూ భారత సైన్యానికి మంచి అనుభవం ఉన్నదని ఆనంద్ మహీంద్రా సూచించారు. 49 రోజుల లాక్ డౌన్ సరిపోతుందని ఇంతకుముందు ఆనంద్ మహీంద్రా అభిప్రాయ పడ్డారు. మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 

దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఆనంద్ మహీంద్రా స్పందిస్తూనే ఉన్నారు. అత్యంత చౌక ధరకు వెంటిలేటర్లను తయారు చేసేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సిద్ధ పడింది. మరోవైపు కరోనా రోగులకు చికిత్సనందించేందుకు వైద్య సిబ్బందికి అవసరమైన ఫేస్ షీల్డ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. 

వివిధ సందర్భాల్లో ఆనంద్ మహీంద్రా కరోనా బాధితులకు తన వంతుగా సాయం చేస్తున్నారు కూడా. తన వేతనం మొత్తం విరాళంగా ప్రకటించారు ఆనంద్ మహీంద్రా. తెలంగాణలో కరోనా బాధితుల కోసం 75 వేల ఏరోసోల్ బాక్సులు, 15 వేల మాస్కులను అందజేసింది. తమ రిసార్టులను కరోనా రోగుల చికిత్సకు ఉపయోగించుకోవచ్చునని కూడా ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. 

click me!