విటారా, ఎర్టిగా, ఎస్-క్రాస్‌ల ఉత్పత్తి నిలిపేస్తున్న మారుతి!

By rajashekhar garrepally  |  First Published Apr 17, 2019, 10:27 AM IST

వినియోగదారులు భరించగల ధరల్లో అందుబాటులో ఉండే డీజిల్ కార్ల ఉత్పత్తిని నిలిపివేయబోమని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. అయితే బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా ఆయా కార్ల వ్యయం, ధరలను బట్టి ఎర్టిగా, విట్టారా బ్రెజ్జా, ఎస్ క్రాస్ మోడల్ కార్లు ఉత్పత్తి చేయకపోవచ్చునని భావిస్తున్నారు. 


న్యూఢిల్లీ: వినియోగదారులు భరించగల ధరల్లో అందుబాటులో ఉండే డీజిల్‌ కార్ల ఉత్పత్తిని కొనసాగిస్తామని దేశీయ కార్ల తయారీ మేజర్ మారుతి సుజుకి స్పష్టం చేసింది. కంపెనీ డీజిల్‌ కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తుందన్న ఊహాగానాలకు దీంతో మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తెర దించారు.

ప్రస్తుతం మారుతి డీజిల్ వేరియంట్‌లో ఎస్‌-క్రాస్‌, సియాజ్‌, విటారా బ్రెజ్జా, డిజైర్‌, బాలెనో, స్విఫ్ట్‌ కార్లను ఉత్పత్తి చేస్తున్నది. కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం వచ్చే ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బీఎస్‌ 6 ప్రమాణాలను అమలులోకి తేవడం వల్ల కార్ల తయారీ వ్యయం పెరుగుతుంది. తత్ఫలితంగా అన్ని కార్ల ధరలు పెరిగిపోతాయి. 

Latest Videos

బీఎస్ -6 ప్రమాణాలతో తయారయ్యే కార్ల ధర గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే డీజిల్‌ వేరియెంట్‌లో పెద్ద కార్లను కొనసాగించి చిన్న కార్ల ఉత్పత్తిని మాత్రం నిలిపివేసే అవకాశం ఉందంటుని నిపుణులు పేర్కొంటున్నారు. కస్టమర్లు భరించలేని ధరలు గల డీజిల్‌ కార్ల ఉత్పత్తిని కొనసాగించాలని అనుకోవడంలేదని కంపెనీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ చెప్పారు.

తాము తీసుకునే ఏ నిర్ణయం అయినా కస్టమర్లు ఏవి కొంటారు, ఏవి కొనరనే అంశంపై ఆధారపడి ఉంటుందని, అయితే చిన్న డీజిల్‌ కార్ల ధరలు ఎంట్రీ స్థాయి కస్టమర్లకు భారం అవుతాయని తాము భావిస్తున్నామని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. చిన్న కార్ల ధరలు భారీగా పెరిగిపోయే ఆస్కారం ఉన్నందు వల్ల ఏ కంపెనీ కూడా చిన్న కార్లలో డీజిల్‌ వేరియెంట్లను తయారుచేయడంపై ఆసక్తి చూపకపోవచ్చునని భార్గవ అన్నారు.

చిన్న కార్ల మార్కెట్లో ప్రధానంగా పెట్రోల్‌, సీఎన్‌జీ కార్లే అందుబాటులో ఉండవచ్చునని మారుతి సుజకి చైర్మన్ ఆర్సీ భార్గవ చెప్పారు. బీఎస్‌ 6 టెక్నాలజీలకు అప్‌గ్రేడ్‌ చేయడంపై అయ్యే వ్యయాల భారం గాని, దాని ప్రభావం వల్ల ఏర్పడే ధరల పెరుగుదల గాని ఒక్క మారుతీకే పరిమితం కాదని ఆయన అన్నారు.

చిన్న కార్లలో డీజిల్‌ వేరియెంట్లను రద్దు చేయడం వల్ల మార్కెట్లో తమ వాటాపై ఎటువంటి ప్రభావం ఉండబోదని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ చెప్పారు. ప్రయాణికుల కార్ల విభాగంలో ప్రస్తుతం మారుతి వాటా 51 శాతం ఉంది. వార్షిక అమ్మకాల్లో 30 శాతం వాటా డీజిల్‌ కార్లదే.

ఏటా మారుతి డీజిల్ వినియోగ కార్లు 4.5 లక్షలు విక్రయిస్తోంది. బీఎస్ - 6 ప్రమాణాలు అమలులోకి తేవడంతో ఇన్సెంటివ్ లను పొందేందుకు వీటిలో సగం వరకు పెట్రోల్ లేదా సీఎన్జీ వేరియంట్ కార్ల వినియోగంలోకి మారొచ్చునని భావిస్తున్నారు. డీజిల్‌తో నడిచే ఎర్టిగా, విటారా బ్రెజ్జా, ఎస్ -క్రాస్ వంటి మోడల్ కార్లను మారుతి ఉత్పత్తి చేయకపోవచ్చునని భావిస్తున్నారు. దీనిపై స్పందించేందుకు మారుతి సుజుకి అధికార ప్రతినిధులు ఎవ్వరూ అందుబాటులోకి రాలేదు. 

‘బీఎస్‌-6 సాంకేతికతకు కార్లను మార్చాలంటే.. చిన్న కార్ల తయారీలో ఉన్న ప్రతి కంపెనీపై ఒకే ప్రభావం పడుతుంది. మార్కెట్‌పైనా అది కనిపిస్తుంది. మేం చిన్న కారును విక్రయించలేకపోతే.. ఇతర కంపెనీలు కూడా అమ్మలేవనే అర్థం. అపుడు తయారీదార్లు పెట్రోలు లేదా డీజిల్‌ లేదా మరో ఇంధనాన్ని మారుతారు’అని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ప్రస్తుతం తన సొంత 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో సియాజ్‌ను విక్రయిస్తోంది. మిగతా మోడళ్లయిన విటారా బ్రెజా, స్విఫ్ట్‌, డిజైర్‌, ఎర్టిగాలను ఫియట్‌ అందిస్తున్న 1.3 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌తోనే అమ్ముతోంది. 

click me!