ఎలక్ట్రిక్‌ వెహికల్స్ ప్రమోషన్‌కు రూ.10వేల కోట్లు?

By Siva KodatiFirst Published Feb 28, 2019, 2:39 PM IST
Highlights

ఫేమ్ -2 పథకం కింద విద్యుత్, హైబ్రీడ్ వాహనాల ఉత్పత్తి, కొనుగోళ్లను ప్రోత్సహించడానికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేయడానికి కేంద్రం ఆమోదం తెలుపనున్నది. బస్సుల నుంచి త్రి చక్ర, ద్విచక్ర వాహనాలకూ ఈ ప్రోత్సాహకాలు లభిస్తాయి.
 

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను క్రమంగా తగ్గించి ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సాహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ‘ఫేమ్-2 పథకం కింద రూ.10,000 కోట్లను ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకాన్ని పెంచేందుకు కేటాయించబోతున్నట్లు బుధవారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఎలక్ట్రిక్‌ బస్సులకు సబ్సిడీలు, త్రీ, టూ వీలర్‌ వాహనాల దారులను ఎలక్ట్రిక్‌ వాహనాలను వాడేలా చూడటానికి ఈ నిధులను ఉపయోగించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. ఫేమ్‌-2 పథకంలో దాదాపు ఏడు వేల ఎలక్రిక్‌ బస్సులకు రూ.50 లక్షల వరకు, బస్సు ధరలో 40శాతాన్ని సబ్సిడీ రూపంలో ప్రభుత్వం చెల్లించనున్నది.  

ఈ సబ్సిడీ కేవలం ‘ఆపరేషనల్ ఎక్స్‌పెండిచర్‌’ విధానంలో నడిచే బస్సులకు మాత్రమే వర్తిస్తుంది. ‘కాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌’ విధానంలో నడిచే బస్సులకు వర్తించదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అంతేకాక పది లక్షల ద్విచక్ర వాహనాలకు, 5లక్షల త్రీ వీలర్‌ ఎలక్ట్రిక్ వాహనాలకు, 35,000 హైబ్రిడ్‌, ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ కార్లకు రూ.50,000 వరకు సబ్సిడీ లభించనుంది.  పదిలక్షల ఎలక్ట్రిక్‌ వాహనాలు కూడా ఫేమ్‌-2 ఫథకం కింద సబ్సిడీని పొందనున్నాయని అధికార వర్గాల కథనం.

అయితే ప్రైవేట్‌గా వ్యక్తిగత వినియోగానికి వాడే ఎలక్ట్రిక్‌ కార్లకు మాత్రం ఈ పథకం వర్తించదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం కింద ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు కల్పిస్తున్నట్లు అధికార వర్గాల కథనం.

ఎలక్ట్రిక్‌ వాహనాలకు రోడ్డు టాక్స్‌ మినహాయింపు, రిజిస్ట్రేషన్‌ రుసుము లేకపోవటం, పార్కింగ్ ఛార్జీలను వర్తింపజేయకపోవటం వంటి ప్రోత్సాహకాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

గతేడాది ఆగస్టులోనే వివిధ మంత్రిత్వశాఖల గ్రూపు హైబ్రీడ్, విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఫేమ్ 2 పథకం కింద రూ.5,500 కోట్లు కేటాయించాలని కేంద్రానికి సూచించింది.

ఐదేళ్ల పాటు విద్యుత్, హైబ్రీడ్ వాహనాల కొనుగోలుపై రాయితీలు అందజేసేందుకు వీటిని ఖర్చు చేస్తారు. ప్రస్తుతం ఫేమ్ 1 స్కీమ్ వచ్చేనెలాఖరు వరకు అమలులో ఉంటుంది. 

click me!