ప్రతి నిత్యం సరికొత్త ఫీచర్లతో విపణిలోకి నూతన మోడల్ కార్లను ఆవిష్కరిస్తున్న మారుతి సుజుకి తాజాగా ‘ఇగ్నిస్-2019’ కారును ఆవిష్కరించింది. నాలుగు వేరియంట్లలో లభించనున్న ఈ కారులో అదనపు భద్రతా ఫీచర్లు చేర్చింది. దీని ధర రూ.4.79-రూ.7.14లక్షలుగా ఉందని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: అనునిత్యం విపణిలోకి కొత్త కార్లను పరిచయం చేస్తూ, సరొకొత్త ఫీచర్లను జత చేస్తున్న దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘మారుతి సుజుకి’ తాజాగా మెరుగైన భద్రతా ప్రమాణాలతో కూడిన ‘ఇగ్నిస్’కారును వినియోగదారుల ముంగిట్లోకి తెచ్చింది. ఇప్పటివరకు మార్కెట్‌లో ఉన్న మారుతి సుజుకీ హచ్‌బాక్ ‘ఇగ్నిస్’ మోడల్ కారుకు భద్రతా ఫీచర్లను అప్‌డేట్ చేసి 2019 ఎడిషన్ ‘ఇగ్నిస్‘ కార్లను బుధవారం మారుతి సుజుకీ ఇండియా ప్రారంభించింది.
హై స్పీడ్ అలర్ట్ సిస్టం, కో-డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్ సిస్టం వంటి ఫీచర్లు ఈ మోడల్‌లోని అన్ని వేరియంట్ కార్లలో ఉంటాయని మారుతి సుజుకీ ఇండియా తెలిపింది. ‘ప్రయాణికుల భద్రతను మరింత పెంచటానికి ‘ఇగ్నిస్’ మోడల్ కార్లకు ఎక్కువ సేఫ్టీ ఫీచర్లను జత చేశాం. ఈ సేఫ్టీ ఫీచర్లు ఇగ్నిస్ మోడల్‌లోని అన్ని వేరియంట్ కార్లలోను ఉంటాయి’ అని మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ ఎస్ కల్సి అన్నారు.
కొత్త ఇగ్నిస్ కారులో రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, కో-డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ వంటివి స్టాండర్డ్ ఫీచర్లతోపాటు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్, 5 స్పీడ్ గేర్ బాక్స్ వంటి భద్రతా ఫీచర్లను అమర్చింది. ప్రీమియం అర్బన్ కార్ యూజర్లకు 2019 ఇగ్నిస్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారిందని మారుతి సుజుకి ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ ఎస్ కల్సి పేర్కొన్నారు.
కొత్త భద్రతా ప్రమాణాల ప్రకారం ఈ సంవత్సరం జూలై 1నుంచి తయారయ్యే వాహనాలకు ఈ ఫీచర్లు తప్పనిసరి. ఇప్పటికే అంతకు ముందు కంపెనీ విడుదల చేసిన ఈ మోడల్ వర్షన్ కార్లలో ముందు క్యాబిన్‌లో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, ఈబీడీ(ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి ఫీచర్లతో కార్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వివిధ వేరియంట్‌లలో లభించే ‘ఇగ్నిస్’ కార్ల ధర దిల్లే ఎక్స్ షోరూమ్‌లలో రూ.4.79-రూ.7.14లక్షలుగా ఉందని తెలుస్తోంది. ఇది సిగ్మా, డెల్టా, జీటా, అల్ఫా అనే నాలుగు వేరియంట్ల రూపంలో అందుబాటులో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది.