ఆడి ఇండియా ఈ ఏడాది చివరికల్లా భారత విపణిలోకి ప్రవేశపెట్టనున్న లగ్జరీ విద్యుత్ కారు ‘ఈ-ట్రాన్’ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 400 కి.మీ. ప్రయాణం చేయొచ్చు. ఫాస్ట్ చార్జింగ్ 40 నిమిషాల్లో పూర్తవుతుంది.
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ‘ఆడీ ఇండియా’ తొలి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును శనివారం భారత్ మార్కెట్ వర్గాలకు పరిచయం చేసింది. మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్న ఈ కారును వచ్చే నెల 12న అధికారికంగా ఆవిష్కరించనున్నారు. అంతకంటే ముందే కారు ప్రివ్యూ నిర్వహించింది ఆడీ. ‘ఇ-ట్రాన్’ పేరుతో ఈ కారును మార్కెట్లోకి తీసుకురానున్నారు.
పరిమాణం పరంగా ఈ-ట్రాన్ కారు ఆడి క్యూ5, క్యూ7కు మధ్యస్థంగా ఉండనుంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి 125కిలో వాట్లు, మరొకటి 140 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది.
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్లు ప్రయాణించేలా ఈ కారును రూపొందించారు. సాధారణ ఛార్జింగ్ పాయింట్‌లో దాదాపు 8 గంటల పాటు ఛార్జ్ చేయాలి. అదే ఫాస్ట్ ఛార్జర్ అయితే కేవలం 40 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుందని కంపెనీ తెలిపింది.
ఈ ఏడాది చివర్లో దీన్ని భారత మార్కెట్లోకి తేనున్నారు. అయితే దీని ధర కూడా దాదాపు రూ. 1.5కోట్ల పైనే ఉంటుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ధర ఎక్కువైనా ఇ-ట్రాన్‌తో మెర్సిడెస్, బీఎండబ్ల్యూ లాంటి కంపెనీలకు ఆడీ పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సందర్భంగా ఆడీ ఇండియా అధిపతి రాహిత్ అన్సారీ మాట్లాడుతూ ఏటా 200కి పైగా ‘ఈ-ట్రాన్’ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే ఆడి ఈ ట్రాన్ యూరప్ మోడల్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది.
వింగ్ మిర్రర్స్ స్థానే కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. మరో గమ్మత్తైన విషయమేమిటంటే ఎటువంటి సుంకాలు లేకుండా ‘ఆడి ఈ-ట్రాన్’ కారు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. సుమారు 2500 ప్యాసింజర్ వెహికల్స్ అలా అనుమతినిస్తున్నారని తెలుస్తోంది. అంతే కాదండోయ్.. జర్మనీలో కార్లలో అమర్చిన కెమెరాలను కూడా ప్రభుత్వ వర్గాలు ఆమోదిస్తారని సమాచారం.