ఆటోమేటెడ్ ట్రాన్సిమిషన్ టెక్నాలజీ (ఏఎంటీ) కార్లకు ఈ మధ్య కాలంలో గిరాకీ పెరుగుతోంది. వచ్చే అయిదేళ్లలో మొత్తం కార్లలో 40 శాతం వాటా ఎఎంటీ కార్లదేనని అంచనా వేస్తున్నారు. టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారడంతోపాటు ఇంధన సామర్థ్యం కూడా పెరుగుతోంది.
ఈ మధ్యకాలంలో ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ కార్లకు డిమాండ్ పుంజుకుంటోంది. అందుకే కంపెనీలు తాము తెచ్చిన మోడళ్లలో ఏఎంటీ వేరియంట్లను కూడా తెస్తున్నాయి. నగరాల్లోని కార్ల కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది ఏఎంటీ వేరియంట్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
మాన్యువల్, ఆటోమెటిక్ వేరియంట్ల మధ్య ఉండే ధరల వ్యత్యాసం తగ్గిపోతున్న నేపథ్యంలో ఏఎంటీ కారును కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.
తొలిసారి కారును కొనుగోలు చేస్తున్న వారే కాకుండా మహిళలు ఎక్కువగా ఆటోమెటిక్ కార్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. తొలినాళ్లలో ఏఎంటీ వేరియంట్ల ఇంధన వినియోగం ఎక్కువగా ఉండేది.
మాన్యువల్, ఆటోమెటిక్ వేరియంట్ల మధ్య ధరలో తేడా కూడా అధికంగానే ఉండేది. అందుకే కొంత మంది మాత్రమే ఏఎంటీని ఎంచుకునే వారు. కానీ కార్ల కంపెనీలు కస్టమర్ల అభిరుచుల్లో వస్తున్న మార్పులను గ్రహించి అత్యాధునిక టెక్నాలజీపై పెట్టుబడి పెట్టాయి.
ఫలితంగా అధిక పనితీరు, ఇంధన సామర్థ్యం కలిగిన ఏఎంటీ వేరియంట్ల్ కార్లను కార్ల తయారీ కంపెనీలు తేగలుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఉపాధి కోసం వలసలు వస్తుండటంతో నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది.
ఫలితంగా కారును నడిపే వారు తరచూ గేరు మార్చాల్సిన పరిస్థితి. దీనివల్ల కారు నడిపేవారికి ఇబ్బంది ఎక్కువవుతోంది. అంతేకాక పెట్రోల్ లేదా డీజిల్ కాదంటే సీఎన్జీ గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. అందుకే ఏఎంటీ కార్లకు చాలా మంది మొగ్గుచూపుతున్నారు.
ఏఎంటీ వేరియంట్ల ఇంధన సామర్థ్యం పెరిగింది. మాన్యువల్, ఏఎంటీకి మధ్య ధరలోనూ మరీ అంతగా తేడా ఉండటం లేదు. అందుకే అందరూ ఏఎంటీ బాట పడుతున్నారు. ఇంతకు ముందు ఆటోమెటిక్ కార్ల మెయింటెనెన్స్ ఖర్చు అధికంగా ఉంటుందన్న భావన ఉండేది.
కానీ కంపెనీలు తెచ్చిన అత్యాధునిక టెక్నాలజీ ద్వారా నిర్వహణ వ్యయం తగ్గిపోయింది. దీంతో కస్టమర్లు ఏఎంటీ కార్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.
మూడేళ్ల క్రితం ప్యాసెంజర్ వాహనాల్లో ఆటోమెటిక్ వేరియంట్ల వాటా 5 శాతంకన్నా తక్కువగా ఉండేది. అయితే ఇది క్రమంగా పెరగడం మొదలైంది. ఇప్పుడిది 10-12 శాతానికి పెరిగింది. వచ్చే ఐదేళ్లలో (2023-24) ఇది 40 శాతానికి పెరగవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.
ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ కార్ల అమ్మకాల్లో మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ దూసుకుపోతోంది. 2014 నుంచి ఈ కంపెనీ ఐదు లక్షలకు పైగా ఆటోమెటిక్ కార్లను విక్రయించింది. ఐదేళ్లకాలంలో కంపెనీ కార్ల అమ్మకాల్లో సగటు వృద్ధి 58 శాతంగా ఉంది.
2018-19లో దేశీయ మార్కెట్లో 17,29,826 కార్లను మారుతి సుజుకి విక్రయించింది. ఇందులో రెండు లక్షలకు పైగా ఆటోమెటిక్ వేరియంట్లు ఉన్నాయి. కంపెనీ మొత్తం కార్ల అమ్మకాల్లో ఆటోమెటిక్ వేరియంట్ల వాటా 11.56 శాతం అన్న మాట. ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉన్న మోడళ్ల అమ్మకాల్లో వాటా 16 శాతంగా ఉంది.
2016లో ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ సదుపాయం ఉన్న టాటా మోటార్స్‌లో మోడళ్ల అమ్మకాల్లో వాటా 5%గా ఉంది. ఇప్పుడు మాత్రం 25 శాతానికి పెరిగింది. మాన్యువల్ మోడళ్లను లెక్కలోకి తీసుకుంటే కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఆటోమెటిక్ కార్ల వాటా 15% వరకు ఉంది.
ఇక వోక్స్‌వ్యాగన్ దేశీయంగా విక్రయిస్తున్న ప్రతి మూడు కార్లలో ఒకటి డీఎస్జీ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ ఉంటోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కార్ల విక్రయాల్లో ఆటోమెటిక్ కార్ల వాటా దాదాపు 32 శాతంగా ఉంది.
డాట్సన్ రెడీ గో మోడల్ అమ్మకాల్లో రెడీ గో 1లీటర్ ఏఎంటీ వాటా 25 శాతంగా ఉంది.రూ.12 లక్షలకన్నా తక్కువ ధర కలిగిన ప్యాసెంజర్ కార్ల విభాగంలో ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ వాటా 12-14 శాతం ఉండగా.. రూ.12 లక్షలు దాటిన కార్ల విభాగంలో వాటా 50 శాతానికన్నా ఎక్కువగా ఉండటం విశేషం.
మొత్తం ప్యాసెంజర్ కార్లలో చిన్న కార్ల విభాగం వాటాయే 60 శాతం వరకు ఉంటుంది. ఎంట్రీ లెవల్ కార్లలోనూ ఏఎంటీ వసతిని తేవడం వల్ల ఎక్కువ మంది ఈ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా వీటి వాటా పెరుగుతోంది. అందుకే ఇటీవల మరో బుల్లి కారును ఎంట్రీ లెవెల్ లో మార్కెట్ లోకి తేవాలని మార్కెట్ లీడర్ మారుతి సుజుకి నిర్ణయించింది.