పూజ చేయిస్తామనే సాకుతో రూ.2 లక్షలకే 19 లక్షల ఎస్‌యూవీ

By Siva KodatiFirst Published Jun 9, 2019, 11:08 AM IST
Highlights

బెంగళూరులో ఒక వ్యక్తి నిస్సాన్ ఎస్‌యూవీ ‘కిక్’ కారుపై మోజు పెంచుకున్నాడు. డౌన్ పేమెంట్‌గా ఒక షోరూంలో రూ.2 లక్షలు చెల్లించి పూజ చేయిస్తామనే సాకుతో కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిపోయిన వాడి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు.

కళల్లో చోర కళ ఒకటి. నేరగాళ్లు రోజురోజుకు ఆరి తేరి పోతున్నారు. ఒక వ్యక్తి బెంగళూరులోని నిస్సాన్‌  షోరూం మేనేజ్మెంట్‌కు కుచ్చు టోపీ పెట్టి ఖరీదైన కారుతో చల్లగా జారు కున్నాడు. డౌన్‌ పేమెంట్‌ చెల్లించి పూజ చేయిస్తానని చెప్పి మరీ యజమానిని నమ్మించి ఉడాయించాడు. 

సుమారు రూ.19 లక్షల విలువ గల కారును కేవలం రూ. 2 లక్షల రూపాయలకు ఎగరేసుకుపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడటంతో తలపట్టుకోవడం పోలీసుల వంతైంది. 

జోస్ థామస్ అకా జోసెఫ్ అనే వ్యక్తి విలాసవంతమైన ఎస్‌యూవీ నిస్సాన్‌ కిక్స్‌ను కొనుగోలు చేస్తానని షోరూంకి వచ్చాడు. షోరూం మేనేజర్‌ని అడిగి వివరాలు తెలుసుకున్నాడు.

ధర రూ 18.6 లక్షలు అని చెప్పగానే వెంటనే రూ. 2 లక్షలే డౌన్‌ పేమెంట్‌ కట్టి.. పూజ చేయించుకుంటానని చెప్పి బురిడీ కొట్టించి కారును తీసుకెళ్లాడు. అక్కడ నుంచి పత్తా లేకుండా పోయాడు. ఎన్ని ఫోన్లు చేసినా సమాధానం లేదు. 

జోస్ థామస్ అకా జోసెఫ్ ఆఫీసుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. చివరికి పోలీసులను ఆశ్రయించారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఈ ఘటన జరిగి నాలుగు నెలలైంది.  

ఈ ఏడాది జనవరి 23వ తేదీన బెంగళూరులోని దొడ్డనకుంది సూర్య నిస్సాన్‌ షోంరూంలో ఈ ఘటన జరిగింది. దాదాపు నాలుగు నెలల తరువాత అంటే మే 21వ తేదీన షోరూం యజమాని గణేశ్‌ కుమార్‌ శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంగతి బయట పడింది.

ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశారన్నదానిపై స్పందించేందుకు గణేష్ తిరస్కరించారు. గణేశ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని డీసీపీ అబ్దుల్‌ అహద్‌ తెలిపారు. 

నిందితుడు ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌, ఆఫీస్‌ అడ్రస్‌  ఆధారంగా వివరాలను సేకరిస్తున్నామని డీసీపీ అబ్దుల్‌ అహద్‌ తెలిపారు. ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత ఫిర్యాదు చేసినందున కేసు దర్యాప్తునకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

click me!