సీబీఎస్ఈ 10th ఫలితాలు విడుదల: 91శాతం ఉత్తీర్ణత, యూపీ ‘టాప్’

Published : May 06, 2019, 03:18 PM ISTUpdated : May 06, 2019, 05:06 PM IST
సీబీఎస్ఈ 10th ఫలితాలు విడుదల: 91శాతం ఉత్తీర్ణత, యూపీ ‘టాప్’

సారాంశం

కేంద్రీయ మాధ్యమిక విద్యామండలి(సీబీఎస్ఈ) నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఆదివారమే ఫలితాలు ప్రకటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. సీబీఎస్ఈ అధికారులు దాన్ని తోసిపుచ్చారు. 

న్యూఢిల్లీ: కేంద్రీయ మాధ్యమిక విద్యామండలి(సీబీఎస్ఈ) నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఆదివారమే ఫలితాలు ప్రకటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ.. సీబీఎస్ఈ అధికారులు దాన్ని తోసిపుచ్చారు. 

ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను విడుదల చేశారు. మధ్యాహ్నం 3గంటలకు ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ.. ముందే(2గంటలకు) పలితాలను ప్రకటించడం గమనార్హం.

సీబీఎస్ఈ ఫలితాల్లో 91.1శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. గత సంవత్సరంతో పోలిస్తే 4.40శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. గతేడాది మొత్తం 86.70శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. 

సీబీఎస్ఈ పదో తరగతి పలితాల్లో మొత్తం 13 మంది విద్యార్థులు 500కు గానూ 499 మార్కులు సాధించారు. వీరిలో 8మంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారే ఉండటం విశేషం. ఇక రాజస్థాన్ నుంచి ఇద్దరు, హర్యానా, పంజాబ్, కేరళ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

ఫలితాల్లో టాప్ రెండు ర్యాంకుల్లో నోయిడాకు చెందిన సిద్ధాంత్ పెంగోరియా, దివ్యాన్ష్ వాద్వా నిలిచారు. మొదటి 5 ర్యాంకులను కూడా యూపీ విద్యార్థులే కైవసం చేసుకోవడం గమనార్హం. మొత్తం 25మంది విద్యార్థులు 498 మార్కులు సాధించగా, 59మంది విద్యార్థులు 497 మార్కులు సాధించారు.

57,256మంది విద్యార్థులు 95శాతానికి పైగా మార్కులు సాధించగా, 2,25,143మంది విద్యార్థులు 90-95శాతం మధ్య మార్కులు సాధించారు. ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ అభినందనలు తెలిపారు. 

సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో తన కుమార్తె 82శాతం మార్కులు సాధించడం పట్ల కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆనందం వ్యక్తం చేశారు. సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించినందుకు గర్వంగా ఉందని ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 29 వరకు పదో తరగతి పరీక్షలు, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు 12వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ నిర్వహించింది. 10, 12వ తరగతి పరీక్షలకు మొత్తం 31,14,821మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 12లక్షల మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలకు హాజరు కాగా, 18,27,472మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. హాజరైన వారిలో 16,04,428మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 

ఫలితాలకు సంబంధించిన వివరాల కోసం cbse.nic.in, cbseresults.nic.in సంప్రదించవచ్చు. వీటితోపాటు examresults.in, indiaresults.com, results.gov.inలోనూ తెలుసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

High Demand Jobs : లక్షల ఉద్యోగాలున్నా చేసేవారే లేరు.. జాబ్స్ లిస్ట్ ఇదే, ట్రై చేశారో లైఫ్ సెట్
Money Saving Tips : కేవలం రూ.20 వేల శాలరీతో రూ.2.5 కోట్లు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?