యూట్యూబ్ రేట్లు పెంచేసింది. యాడ్స్ లేకుండా యూట్యూబ్‌లో వీడియోలు చూడాలనుకున్న వారు ఇప్పుడు భారీగా పెరిగిన ధరలు చెల్లించక తప్పదు. ఏకంగా 58 శాతం ధరలు పెంచడంపై యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఏ చిన్న విషయం తెలుసుకోవాలన్నా గూగుల్‌లో ఎలా వెతుకుతామో వెంటనే యూట్యూబ్ తెరిచి ఏదైనా వీడియో ఉందేమో చెక్ చేయడం అందరూ చేసే పనే. ముఖ్యంగా ప్రతి భాషలోనూ యూట్యూబ్ వీడియోలు అందుబాటులో ఉండటంతో చాలా మంది యూట్యూబ్‌నే ఎక్కువగా ఉపయోగిస్తారు. సోషల్ మీడియాలో ముఖ్యభాగమైన యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలను గూగుల్ పెంచింది.
ఇండివిడ్యువల్ ప్లాన్లు మారిపోయాయి..
స్టూడెంట్, ఫ్యామిలీ, ఇండివిడ్యువల్ ఇలా అన్ని విభాగాల్లో సబ్‌స్క్రిప్షన్ రేట్లు పెంచేసింది. యూట్యూబ్ ప్రీమియం నెలవారీ విద్యార్థి ప్లాన్ 12.6 శాతం ధర పెంచారు. దీంతో రూ.79 ఉండే ఈ ప్లాన్ ఇప్పుడు రూ.89 అయ్యింది. వ్యక్తిగత(పర్సనల్) నెలవారీ ప్లాన్ 15 శాతం ధర పెంచారు. రూ.129 ఉండే ఈ ప్లాన్ రూ.149కి పెరిగింది. నెలవారీ ఫ్యామిలీ ప్లాన్ రూ. 189 ఉండగా, పెరిగిన ధరలతో రూ. 299 చెల్లించాల్సి ఉంటుంది. ఇది 58 శాతం పెరగడం గమనార్హం. అయితే ఈ ప్లాన్‌లో ఐదుగురు సభ్యులు వరకు యూట్యూబ్ ప్రీమియంను ఒకే సబ్‌స్క్రిప్షన్‌పై ఉపయోగించవచ్చు.
నెలవారీ సబ్‌స్క్రిప్షన్లు కూడా పెరిగాయి..
మంత్లీ, క్వాటర్లీ, ఇయర్లీ పర్సనల్ ప్రీపెయిడ్‌ల ధరలు కూడా పెరిగాయి. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ. 139 ఉండగా, ఇప్పుడు రూ.159కి పెంచారు. త్రైమాసిక ప్లాన్ రూ.399 ఉండగా రూ. 459 పెరిగింది. సంవత్సర ప్లాన్ రూ.1299 ధరను పెంచి రూ. 1,490 చెల్లించాలని నిబంధనల్లో యూట్యూబ్ పేర్కొంది. ఈ కొత్త ధరలు, కొత్త సబ్‌స్క్రైబర్‌లతో పాటు ఇప్పటికే ఉన్న ప్రీమియం యూజర్‌లకు వర్తిస్తాయని పేర్కొంది.
ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే ఇవీ ఉపయోగాలు..
YouTube ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే యాడ్-ఫ్రీ స్ట్రీమింగ్ అవుతుంది. 1080 pలో అధిక-బిట్‌రేట్ స్ట్రీమింగ్ చేయవచ్చు. ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్, బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్, యూట్యూబ్ మ్యూజిక్‌లో యాడ్-ఫ్రీ స్ట్రీమింగ్ వంటి ప్రయోజనాలు అందుతాయి.
ధరల పెంపుపై యూజర్లకు మెయిల్స్..
ధరల పెంపునకు సంబంధించి YouTube ఇప్పటికే ఉన్న వినియోగదారులకు ఇ-మెయిల్‌లను పంపడం ప్రారంభించింది. చందా కొనసాగించడానికి వినియోగదారుల కొత్త ధరలను తప్పక అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.