యెస్ బ్యాంక్ స్కాం: వేల కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ

Ashok Kumar   | Asianet News
Published : Jul 10, 2020, 11:23 AM ISTUpdated : Jul 10, 2020, 09:41 PM IST
యెస్ బ్యాంక్ స్కాం: వేల కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ

సారాంశం

ప్రైవేట్ బ్యాంక్ ‘యెస్ బ్యాంకు’లో నిధుల దుర్వినియోగం విషయమై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పట్టు బిగిస్తోంది. సంస్థ మాజీ ప్రమోటర్ రాణా కపూర్, వాద్వాన్ కుటుంబాల ఆట కట్టించేందుకు పూనుకుంది. ఈ మేరకు రూ.2,800 కోట్ల ఆస్తుల జప్తు చేసింది. 

న్యూఢిల్లీ: దేశంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో ఒక్కటైన యెస్‌ బ్యాంక్‌ కుంభకోణాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తవ్వి తీస్తోంది. ఇందులోభాగంగా బ్యాంక్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాణా కపూర్‌, ఆయన కుటుంబ సభ్యులు, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు వాద్వాన్‌లకు చెందిన రూ.2,800 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు గురువారం తాత్కాలికంగా జప్తు చేశారు. 

ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో లండన్‌, న్యూయార్క్‌, ఢిల్లీ, ముంబై నగరాల్లోని ఖరీదైన ఇళ్లు, ఫ్లాట్లతోపాటు ఆస్ట్రేలియాలోని కొన్ని భూములు కూడా ఉన్నాయి. నోటీసుల్లో వీటి విలువ రూ.2,203 కోట్లని పేర్కొన్నా, వీటి మార్కెట్‌ విలువ రూ.2,800 కోట్లకుపైనే ఉంటుందని భావిస్తున్నారు. 

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ మేరకు ఓ ప్రకటన చేస్తూ ‘దేశ, విదేశాల్లో వీరికి స్థిర, చరాస్తులు జప్తు చేశాం. వీటి మార్కెట్‌ ధర రూ.2,800 కోట్లపైనే ఉంటుంది. జప్తు చేసిన ఆస్తుల్లో బ్యాంక్‌ ఖాతాలు, పెట్టుబడులు, ఖరీదైన విలాస వాహనాలూ ఉన్నాయి’ అని ఒక ప్రకటనలో తెలిపింది. 

రాణా కపూర్‌, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఢిల్లీ, ముంబైల్లోని ఆస్తుల విలువే రూ.1,200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో ఢిల్లీలోని అమ్రితా షెర్గిల్‌ మార్గ్‌లో ఉన్న బంగళా విలువే రూ.685 కోట్ల వరకు ఉంటుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. 

also read యస్‌ బ్యాంకు కుంభకోణంలో రాణా కపూర్‌కు షాక్‌.. వేల కోట్ల ఆస్తులు జప్తు.. ...

మిగతా రూ.1,600 కోట్ల ఆస్తులు డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లకు చెందిన ఆస్ట్రేలియాలోని భూములని సమాచారం. రాణా కపూర్‌, వాద్వానీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసులు నమోదు చేసింది. 

పీఎంఎల్ఏ చట్టం కిందే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వీరి ఆస్తులను జప్తు చేసింది. తన హయాంలో డీహెచ్‌ఎఫ్ఎల్‌ వంటి కొన్ని కంపెనీలకు నిబంధనలకు వ్యతిరేకంగా భారీగా రుణాలు ఇచ్చింది. తర్వాత అవి మొండి బకాయిలు (ఎన్‌పీఏ)గా మారి యెస్‌ బ్యాంక్‌ను ఆర్థికంగా కుంగదీశాయి. 

ఈ అక్రమాలకు ప్రతిఫలంగా రాణా కపూర్‌ కుటుంబం, రుణాలు తీసుకున్న కంపెనీల నుంచి రూ.5,000 కోట్లకుపైగా ముడుపుల రూపంలో తీసుకుందని అంచనా. ఈ నిధులతో దేశ, విదేశాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భావిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Credit Card: మీకు క్రెడిట్ కార్డు ఉందా.? జ‌న‌వ‌రి నుంచి మార‌నున్న రూల్స్‌, బాదుడే బాదుడు
Gold : బంగారం పై అమెరికా దెబ్బ.. గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా?