భారత్ వృద్ధి రేటు 7.3 శాతమే.. అంతర్జాతీయంగా ఒడిదొడుకులే: ప్రపంచబ్యాంక్

By rajesh yFirst Published Jan 10, 2019, 10:25 AM IST
Highlights

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వ్రుద్ధిరేటు 7.3 శాతానికి పరిమితం అవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయంగా జీడీపీ మూడు శాతం నుంచి 2.9 శాతానికి దిగి వచ్చే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఈ ఏడాదిలో ఆర్థికంగా ఒడిదొడుకులు తప్పకపోవచ్చునని వ్యాఖ్యానించింది. 

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19)లో భారత వృద్ధి రేటు 7.3 శాతానికి చేరుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. వచ్చే రెండేళ్లల్లో దేశీయ వృద్ధి 7.5శాతంగా ఉండొచ్చని పేర్కొంది. పెట్టుబడులు, వినియోగంలో పెరుగుదలే దీనికి కారణమని తెలిపింది. అంతేగాక వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ముందుందని ప్రపంచబ్యాంక్‌ పేర్కొన్నది.

జీఎస్‌టీ, నోట్ల రద్దుతో 2017 భారత ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకులకు గురై వృద్ధిరేటు 6.7శాతానికి పరిమితమైనట్లు ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది. దేశీయ వృద్ధిలో గతేడాది భారత్‌ కంటే చైనా ముందు ఉన్నదన్నారు. అయితే ఈ ఏడాది మాత్రం ఆ దేశ వృద్ధిరేటు మందగిస్తుందని అంచనా వేసింది. 2018లో చైనా వృద్దిరేటు 6.5శాతానికే పరిమితం అవుతుందని, 2021 నాటికి అది 6శాతానికి పడిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంక్‌ తమ అంచనాల్లో పేర్కొంది.

‘వినియోగంలో పెరుగుదల, పెట్టుబడులతో భారత్‌ వేగంగా వృద్ధి చెందుతోంది. 2018-19 ఆర్థిక వ్యవస్థలో ఆ దేశ వృద్ధిరేటు 7.3శాతం అని మేం అంచనా వేస్తున్నాం. ఇక 2019-20, 2020-21ల్లో భారత వృద్దిరేటు 7.5శాతంగా ఉండొచ్చు’ అని ప్రపంచ బ్యాంక్‌ ప్రాస్పెక్ట్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ అయాన్‌ ఖోస్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా వృద్ధిరేటు గతేడాది 3శాతంగా ఉంటే ఈ ఏడాది 2.9శాతానికే పరిమితం అయ్యేలా ఉందని ప్రపంచ బ్యాంక్‌ అభిప్రాయం వ్యక్తం తెలిపింది. ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒడుదొడుకులు తప్పేలా లేవని పేర్కొంది.
 

click me!