చౌకకు చెల్లు చీటి పడింది. నేటి అర్ధరాత్రి నుంచి మొబైల్ వినియోగ చార్జీలు 50 శాతం వరకు పెరుగనున్నట్లు వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించాయి. ఇక రిలయన్స్ జియో ఆరో తేదీ నుంచి వడ్డింపులు జరుపనున్నది.
న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ.. చౌక ఇంటర్నెట్‌తో ఎంజాయ్ చేసిన మొబైల్ వినియోగదారుల జేబులకు చిల్లులు పడనున్నాయి. మొబైల్ చార్జీలు మోత మోగించనున్నాయి. కస్టమర్లపై భారం వేసేందుకు టెలికం సంస్థలు సిద్ధమైయ్యాయి. అందుకు సోమవారం అర్ధరాత్రిని ముహూర్తంగా నిర్ణయించాయి.
ఈ నెల 3 నుంచి మొబైల్ కాల్, డాటా చార్జీలను పెంచుతున్నట్లు ఆదివారం వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. భారతీ ఎయిర్‌టెల్ సైతం ఇదే తేదీ నుంచి పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. డిసెంబర్ 3 తర్వాత కస్టమర్లు నెలకు కనీసం రూ.49 రీచార్జ్ చేయాల్సి ఉంటుందని వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ ప్రకటించాయి. మరోవైపు రిలయన్స్ జియో కూడా పెంపు బాట పట్టగా, ఈ నెల 6 నుంచి వడ్డింపులు ఉంటాయని పేర్కొన్నది.
కాగా, గత ఐదేళ్లలో మొబైల్ టారీఫ్‌లు పెరుగుతుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) విషయంలో ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. స్పెక్ట్రం వినియోగ చార్జీలు, లైసెన్స్ ఫీజు చెల్లింపుల బకాయిలను జరిమానాలు, వడ్డీలతోసహా చెల్లించాలని తీర్పు నిచ్చింది.
సుప్రీంకోర్టు తీర్పుతో టెలికం పరిశ్రమపై రూ.1.17 లక్షల కోట్ల భారం పడగా, వొడాఫోన్ ఐడియా రూ.44,150 కోట్లను టెలికం శాఖకు చెల్లించాల్సి వస్తున్నది. భారతీ ఎయిర్‌టెల్ రూ.35,586 కోట్లను చెల్లించాల్సి ఉన్నదని ప్రభుత్వ లెక్కల ద్వారా తెలుస్తున్నది. ఈ కారణంగానే ఈ జూలై-సెప్టెంబర్‌లో రూ.50,921 కోట్ల నష్టాలను వొడాఫోన్ ఐడియా ప్రకటించిన విషయం తెలిసిందే.
భారతీయ కార్పొరేట్ చరిత్రలో ఓ సంస్థ కేవలం మూడు నెలల కాలంలో ఈ స్థాయి నష్టాలను వెల్లడించడం ఇదే తొలిసారి. తమ మనుగడకు ధరల పెంపే మార్గమని భావించిన టెలికం సంస్థలు.. వినియోగదారులపై భారం వేస్తున్నాయి.
ప్రీ-పెయిడ్ మొబైల్ వినియోగదారుల చార్జీలు మంగళవారం నుంచి పెరుగుతాయని వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. ఈ పెంపు 50 శాతం వరకు ఉంటుందని స్పష్టం చేసింది. ఆయా ప్లాన్ల ఆధారంగా ఈ పెంపు ఉంటుందని పేర్కొంది. ఏడాదంతా వర్తించే రూ.999 ప్లాన్ ధర దాదాపు 50% పెరుగుతుండగా, ఇకపై ఇది రూ.1,499కి లభించనున్నది. ఈ ప్లాన్ డాటా వినియోగ పరిమితి 12 జీబీ నుంచి 24 జీబీకి పెంచారు.
అలాగే సంవత్సరం పాటు అమల్లో ఉండే రూ.1,699 ప్లాన్ ధరను 41.2 శాతం పెంచుతున్నారు. ఇకపై రూ.2,399కి ఇది అందుబాటులో ఉండనున్నది. రోజువారి డాటా వినియోగ పరిమితి 1.5 జీబీ. మొత్తానికి అపరిమిత విభాగంలో ఉన్న ప్రస్తుత ప్లాన్లన్నీ.. కొత్త ప్లాన్లతో మారిపోనున్నాయని ఓ సంస్థ అధికారి చెప్పారు.
ప్రారంభ ప్లాన్ ధర సుమారు 31 శాతం ఎగబాకి రూ.458 నుంచి రూ.599కి చేరుతున్నది. 84 రోజులపా టు రోజుకు 1.5 జీబీ డాటా వినియోగదారులకు అందుతుంది. రూ. 199 ప్లాన్ ధరనూ రూ.249కి పెంచుతున్నామని వివరించింది. దీంతో 25 శాతం పెరిగినైట్లెంది. ఇందులో రోజుకు 1.5 జీబీ డాటా ఉంటుంది. 2, 28, 84, 365 రోజుల ప్లాన్లను వొడాఫోన్ ఐడియా ప్రస్తుతం మార్కెట్‌లో విక్రయిస్తున్నది.
భారతీ ఎయిర్‌టెల్ తమ ప్రీ-పెయిడ్ కస్టమర్లపై 50 శాతం వరకు చార్జీల పెంపు మోపుతున్నది. డిసెంబర్ 3 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. వొడాఫోన్ ఐడియా చార్జీల పెంపు ప్రకటన విడుదలైన కొద్ది గంటలకే ఎయిర్‌టెల్ కూడా పెంపు నిర్ణయాన్ని వెలువరించింది.
ఏడాది కాల రూ.998 ప్లాన్ ధరను రూ.1,499గా ఎయిర్ టెల్ నిర్ణయించింది. డాటా వినియోగ పరిమితిని 12 జీబీ నుంచి 24 జీబీకి పెంచింది. 365 రోజుల ప్లాన్ ధరను 41.2 శాతం పెంచి రూ.2,398 గా నిర్ణయించింది. ప్రస్తుతం ఇది రూ.1,699 గానే ఉన్నది.
Also Read:ఐటీ ఉద్యోగులకు కొత్త భయాలు...ఇంతకీ ఐటీ రంగంలో ఏం జరుగుతోంది?
రోజుకు డాటా వినియోగ పరిమితి 1.5 జీబీ. 84 రోజులు రోజుకు 1.5 జీబీ డాటాతో ఉన్న ప్లాన్ ధరను రూ.458 నుంచి రూ.598కి పెంచుతున్నట్లు ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో తెలిపింది. రూ.199 ప్లాన్ ధరనూ దాదాపు 25 శాతం పెంచి రూ.248గా చేసింది. సుప్రీం కోర్టు దెబ్బకు ఈ జూలై-సెప్టెంబర్‌లో రూ.23,045 కోట్ల నష్టాన్ని సంస్థ ప్రకటించినది తెలిసిందే.
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన 4జీ టెలికం సంస్థ రిలయన్స్ జియో సైతం ధరల పెంపును ప్రకటించింది. ఈ నెల 6 నుంచి పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో మొబైల్ కాల్స్, డాటా చార్జీలు 40 శాతం వరకు ప్రియం కానున్నాయి. కస్టమర్లకు కొత్త ప్లాన్లలో 300 శాతం వరకు అదనపు లాభాలుంటాయని జియో ఓ ప్రకటనలో తెలిపింది.
రిలయన్స్ జియో ప్లాన్లకు సంబంధించిన ధరల పెంపు వివరాలు త్వరలో రావచ్చని తెలుస్తున్నది. ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పు.. జియోపైనా భారాన్ని మోపగా, అది వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌తో పోల్చితే చాలా స్వల్పంగా ఉన్నది. అయినా టెలికం పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చార్జీలను పెంచక తప్పడం లేదని జియో వివరించింది.
దేశీయ టెలికం రంగంలో ప్రైవేట్ సంస్థలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పెద్దపీట వేస్తున్నదని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వ రంగ సంస్థలపట్ల సవతి తల్లి ప్రేమను చూపుతున్నారని ఆదివారం కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మండిపడ్డారు. ప్రైవేట్ కంపెనీల నుంచి ఎలక్టోరల్ బాండ్ల కోసమే.. ప్రభుత్వ సంస్థల ప్రయోజనాలను కేంద్రం బలి తీసుకుంటున్నదని విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు.
జియో రాకతో తెరపైకి వచ్చిన ఉచిత అపరిమిత కాల్స్.. ఇక కనుమరుగు కాబోతున్నాయి. ఈ నెల 3 నుంచి వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ తమ ప్లాన్ల ధరల్లో తెస్తున్న మార్పులు.. అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్‌కు చెక్ పెడుతున్నాయి. ఇతర నెట్‌వర్క్ యూజర్లకు చేసే ప్రతీ కాల్‌పై నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తామని వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ ప్రకటించాయి.
Also Read: రెవెన్యూ మార్కెట్ వాటాలో జియోదే ఆధిపత్యం
ఇప్పటికే జియో ఐయూసీ చార్జీలను వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా ప్లాన్లలో ఉన్న పరిమిత వ్యవధి టాక్ టైం దాటితే.. ఇతర నెట్‌వర్క్ వినియోగదారులకు ఫోన్ చేయడానికి టాప్‌అప్‌లు వేసుకోవాల్సిందే. అయితే సొంత నెట్‌వర్క్ కస్టమర్ల మధ్య ఉచిత కాలింగ్ వసతిని టెలికం సంస్థలు కొనసాగించనున్నాయి.
28 రోజుల ప్లాన్‌లో ఇతర నెట్‌వర్క్‌లకు వెయ్యి నిమిషాల కాల్స్, 84 రోజుల ప్లాన్‌లో 3 వేల నిమిషాలు, 365 రోజుల ప్లాన్‌లో 12 వేల నిమిషాల కాల్స్ ఉచితమని ఎయిర్‌టెల్ తెలిపింది. ఆ తర్వాత నిమిషానికి 6 పైసలు చార్జీ పడుతుంది.