
ఇండియన్ ఫుల్ సర్వీస్ ఎయిర్ లైన్ విస్తారా ఫిబ్రవరి నెలలో చాలా వరకు విమానాలను రద్దు చేసింది, అలాగే కొన్ని విమానాలు రీషెడ్యూల్ చేసింది. ఈ విషయాన్ని విమానయాన పరిశ్రమ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. గత కొన్ని రోజులుగా ప్రయాణికులు ఈ విమానయాన సంస్థపై ఫిర్యాదులు చేశారని తేలింది. అలాగే విమానాలకు సంబంధించిన సమాచారానికి సంబంధించి విస్తారా కస్టమర్ కేర్‌ను కూడా సంప్రదించలేకపోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై విస్తారా ప్రతినిధి ఒక వార్తా సంస్థతో మాట్లాడుతు ప్రస్తుతం విమానయాన సంస్థ తన సామర్థ్యాన్ని డిమాండ్‌తో బ్యాలెన్స్ చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రస్తుత కరోనావైరస్ థర్డ్ వేవ్ భారతదేశ విమానయాన మార్కెట్లో తీవ్రంగా ప్రకంపనలు సృష్టించింది దీంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ఆంక్షల కారణంగా విమానయాన సంస్థ ఇప్పుడు విమానాలను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తోంది.
దేశవ్యాప్తంగా ప్రయాణికుల ఫిర్యాదు
ఈ సమస్యను ఆదివారం ఇస్రో శాస్త్రవేత్త షిబాషిస్ ప్రస్తీ ట్వీట్ చేస్తూ ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 5న తన ఢిల్లీ-భువనేశ్వర్ ఫ్లైట్ రద్దు చేయబడిందని, విస్తారా కస్టమర్ కేర్ గత 48 గంటలుగా బిజీగా ఉందని పోస్ట్ చేశారు. అతనితో పాటు మరో ప్రయాణికుడు అర్పిత్ సింగ్ ఖురానా ఫిబ్రవరి 12న తన ఢిల్లీ-కోల్‌కతా విమానాన్ని విస్తారా రద్దు చేసిందని శనివారం ట్వీట్ చేశాడు. అలాగే కస్టమర్ కేర్‌తో మాట్లాడలేకపోతున్నానని ఫిర్యాదు చేశాడు.
సమస్యల పరిష్కారంపై విస్తారా ప్రతినిధి ఏం చెప్పారు?
విమానాల రద్దు అలాగే సమయపాలనపై విస్తారా ప్రతినిధి స్పందిస్తు "ఇటీవల కరోనా కేసులు అకస్మాత్తుగా పెరగడంతో ప్రజలు విమాన ప్రయాణాన్ని బాగా తగ్గించారు. అంతేకాకుండా చాలా రాష్ట్రాలు కూడా ఆంక్షలు విధించాయి. గత నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో విమాన ప్రయాణం చాలా తక్కువ పెరుగుదలను చూస్తున్నాము. కానీ ఈ పరిణామాల దృష్ట్యా మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము అలాగే డిమాండ్‌కు అనుగుణంగా మా సామర్థ్యాన్ని నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాము." అని అన్నారు.
ప్రయాణీకుల ఇబ్బందులను తగ్గించడానికి విమానయాన సంస్థ ప్రతినిధి నేరుగా బుకింగ్ చేసే వారికి డేట్ ఛేంజ్ చార్జీలను మాఫీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తద్వారా ప్రయాణీకులు తమ విమాన ప్రయాణ తేదీని(రీషెడ్యూల్ ) అదనపు చార్జీలను చెల్లించకుండానే మార్చుకోవచ్చు. ఈ సదుపాయాన్ని ప్రయాణికులకు మార్చి 31 వరకు కల్పిస్తున్నారు. ఈ బుకింగ్ వినియోగదారులకు నేరుగా ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ లేదా కౌంటర్ ద్వారా బుక్ చేసుకునే బుకింగ్‌లు మాత్రమే ఉంటుందని గమనించాలి. అంటే మేక్ మై ట్రిప్, యాత్ర, క్లియర్ ట్రిప్ తదితర ఏజెంట్ వెబ్ సైట్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఈ సౌకర్యం లభించదు.
విస్తారా ప్రకారం, "కస్టమర్ కేర్ బాధిత ప్రయాణీకులందరికీ వారి ప్రయాణ రీషెడ్యూలింగ్, రీఫండ్‌లు మొదలైన వాటిలో సహాయం చేస్తోంది" అని తెలిపింది.