క్రిప్టో కరెన్సీ నియంత్రించేందుకు ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలు కలిసి పనిచేయాలని ఒక గ్లోబల్ ఫ్రేమ్ వర్క్ ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సూచించారు. నేడు ఆమె ఒక సదస్సులో మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీ నియంత్రణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ దిశగా పలు దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన ఇచ్చారు. ముంబైలో నిర్వహించిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2023 కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా, అన్ని దేశాల ఉమ్మడి సహకారం లేకుండా క్రిప్టోకరెన్సీని నియంత్రించలేమని ఆమె పేర్కొన్నారు.
క్రిప్టోకరెన్సీల చుట్టూ ఒక ఫ్రేమ్‌వర్క్ అవసరమని భారతదేశం, G20 ప్రెసిడెన్సీ సమస్యను అన్ని దేశాల దృష్టికి తీసుకువెళ్లిందని ఆర్థిక మంత్రి సీతారామన్ చెప్పారు. తద్వారా దీనిని నియంత్రించవచ్చని ఆమె పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం గ్లోబల్ ఫ్రేమ్ వర్క్ దిశగా అడుగులు వేయాలని సూచన చేశారు ఇటీవల బి20 సదస్సులో ఆయన క్రిప్టో కరెన్సీ గురించి పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఆర్బిఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ క్రిప్టో కరెన్సీ మీద మొదటి నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ ఆర్థిక విధానాన్ని దెబ్బతీస్తుందని దీనిపై సరైన ప్రేమ్ వర్కు నియంత్రణ వ్యవస్థ అవసరం అని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ దేశ ఆర్థిక వ్యవస్థ పైన భారంగా పరిణమించే అవకాశం ఉందని. సరైన నియంత్రణ వ్యవస్థ లేకపోతే తీవ్రవాదులు అలాగే సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో వెళ్లి దుర్వినియోగానికి గురయ్యే అవకాశం ఉందని పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీపై పలు దేశాలు నియంత్రణ వ్యవస్థ స్థాపించేందుకు కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, యూరప్ ఆర్థిక వ్యవస్థలు నియంత్రించేందుకు గ్లోబల్ ఫ్రేమ్ వర్క్ అవసరాన్ని గుర్తించి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయి. కాగా భారత్ లాంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సైతం ఈ ఫ్రేమ్ వర్క్ లో భాగస్వామ్యం అవడం ద్వారా క్రిప్టో ఆస్తులను నియంత్రించడం మరింత సులువు అవుతుందని నిపుణులు ఆశిస్తున్నారు.
ఇదిలా ఉంటే గడచిన ఏడాదికాలంగా క్రిప్టో కరెన్సీలో అతిపెద్ద భాగస్వామి అయినటువంటి బిట్ కాయిన్ గడచిన సంవత్సర కాలంగా కనిష్ట స్థాయి నుంచి కోలుకుంటోంది. ప్రస్తుతం ఒక బిట్ కాయిన్ విలువ 21,35,972లుగా ఉంది. 2021లో ఈ విలువ 47 లక్షల వరకూ వెళ్లింది. అక్కడి నుంచి 2022 నవంబర్ లో బిట్ కాయిన్ విలువ 13 లక్షలకు పతనం అయ్యింది. గత 6 నెలలుగా బిట్ కాయిన్ విలువ నెమ్మదిగా రికవరీ అవుతుంది. ప్రస్తుతం 20 లక్షలు దాటింది.