
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై 19 రోజులు గడిచాయి. ఈ యుద్ధం వల్ల రెండు దేశాలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి మరోవైపు ఈ ప్రభావం ప్రపంచంలోని ఇతర దేశాలపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాగా, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా భారతదేశపు అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారతదేశ జిడిపి (GDP) వృద్ధి అంచనాను 7.8 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఎస్‌బీఐ 8 శాతం జీడీపీ వృద్ధిని అంచనా వేసింది.
రూపాయి విలువ 77.5కి దిగజారవచ్చు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భారత్‌కు కూడా ఎన్నో పెద్ద సవాళ్లకు కారణం కావడం గమనార్హం. దేశంలో సోమవారం విడుదలైన ద్రవ్యోల్బణం గణాంకాలను పరిశీలిస్తే, ఫిబ్రవరిలో హోల్ సెల్, రిటైల్ ద్రవ్యోల్బణం రెండూ పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు పెరగడమే దీనికి ప్రధాన కారణం. ముడిచమురు పెరుగుదల కారణంగా భారత కరెన్సీ రూపాయిపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఇరుదేశాల మధ్య యుద్ధం మరింత ముదిరితే డాలర్ తో రూపాయి మారకం విలువ మరింతగా పతనం అవుతుందని ఎస్బీఐ ఆర్థిక నిపుణులు అంటున్నారు. జూన్ 2022 నాటికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 77.5 స్థాయికి పడిపోవచ్చని ఎస్‌బిఐ నివేదికలో అంచనా వేయబడింది.
క్రూడాయిల్ ధరల ప్రభావం
తాజాగా బ్రెంట్ క్రూడ్ ధర పెరగడంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 77 స్థాయికి చేరుకున్నప్పుడు, ముడి చమురు ధరల ప్రభావం రూపాయిపై కూడా కనిపించింది. సోమవారం, గత ట్రేడింగ్ సెషన్‌లో డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ 10 పైసలు క్షీణించి 76.54 వద్ద ముగిసింది. క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 130 డాలర్ల వద్ద కొనసాగితే, దేశ కరెంట్ ఖాతా లోటు జిడిపిలో 3.5 శాతానికి చేరుతుందని ఎస్‌బిఐ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
విదేశీ పెట్టుబడిదారులు డబ్బును ఉపసంహరించుకుంటున్నారు
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ప్రపంచ చమురు సరఫరాలో రష్యా 14 శాతం, న్యాచురల్ గ్యాస్ సరఫరాలో 17 శాతం దోహదం చేస్తుంది. ఈ యుద్ధం కారణంగా, సరఫరా చైన్ పై ప్రతికూల ప్రభావాల భయం తీవ్రమైంది. అటువంటి పరిస్థితిలో స్వల్పకాలంలో రూపాయిపై ఒత్తిడి కనిపిస్తుంది. నివేదిక ప్రకారం, అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఎఫ్‌పిఐలు రూ.2 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని ఉపసంహరించుకున్నాయి. దీని కారణంగా, భారతీయ మార్కెట్లలో FPIల వాటా గత త్రైమాసికంలో 667 బిలియన్ల డాలర్ల నుండి రెండు శాతం తగ్గి 654 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. డబ్బు విత్‌డ్రా చేసే ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది.
ద్రవ్యోల్బణం 5.7% వరకు ఉంటుందని అంచనా
SBI చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్యకాంత్ ఘోష్ మాట్లాడుతూ, ముడి చమురు సగటు ధర 130 డాలర్ల వద్ద ఉంటే, అప్పుడు కరెంట్ ఖాతా లోటు GDPలో 3.5 శాతం వరకు ఉంటుంది. ఈ సందర్భంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సగటు ద్రవ్యోల్బణం 5.7 శాతం వరకు ఉండవచ్చు. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి నెలలో దేశంలో టోకు ద్రవ్యోల్బణం జనవరితో పోలిస్తే 13.11 శాతానికి పెరిగిందని ఇంకా వరుసగా 11వ నెలలో ఇది రెండంకెల స్థాయిలోనే ఉందని తెలిపింది. దీనితో పాటు, భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా జనవరితో పోలిస్తే 6.07 శాతానికి పెరిగింది.