నీరవ్‌ మోదీని ఏ జైల్లో పెడతారు?: చెప్పాలని భారత్‌ను కోరిన బ్రిటన్

By rajesh yFirst Published May 31, 2019, 11:50 AM IST
Highlights

లెటర్ ఆఫ్ ఇండెంట్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని నిండా ముంచి రూ.13,500 కోట్లు దోచేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ. ఇటీవల లండన్ నగరంలో ఆశ్రయం పొందిన నీరవ్ మోదీని.. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అప్పగింతపై లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో విచారణ జరుగుతుంది. నీరవ్ మోదీని అప్పగిస్తే ఏ జైలులో పెడతారు? కల్పించే వసతులేమిటి? రెండు వారాల్లో చెప్పాలని భారత్‌ను లండన న్యాయస్థానం ఆదేశించింది. 

లండన్‌: ‘లెటర్ ఆఫ్ ఇండెంట్’ పేరిట పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్బీ)ని రూ.13,500 కోట్లకు నిట్టనిలువునా ముంచిన ఆర్థిక నేరస్తుడు నీరవ్‌ మోదీకి లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు న్యాయస్థానం జూన్‌ 27వ తేదీ రిమాండ్‌ పొడిగించింది. సదరు నీరవ్ మోదీని అప్పగిస్తే ఏ జైలులో పెడతారో రెండు వారాల్లో చెప్పాలని భారత్‌ను ఆదేశించింది.  పీఎన్బీని పూర్తిగా మోసగించిన నీరవ్‌ మోదీ లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే.

లండన్‌లో ఆశ్రయం పొందుతున్న ఆయన్ను కొన్ని నెలల క్రితం భారత ప్రభుత్వ అభ్యర్ధన మేరకు యూకే ప్రభుత్వం అరెస్ట్‌ చేసిన సంగతి విదితమే. అంతేకాక నీరవ్ మోదీని విచారణ నిమిత్తం అప్పగించాలని భారత్‌ కోరింది.

కాగా విచారణలో భాగంగా గురువారం నాడు వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు చీఫ్‌ మెజిస్ట్రేట్‌ ఎమ్మా ఆర్బునోట్‌ ముందు నీరవ్‌ మోదీ హాజరయ్యారు. కేసు విచారణ సందర్భంగా ఆయన రిమాండ్‌ను జూన్‌ 27వ తేదీ వరకు పొడిగించింది.
 
నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగిస్తే ఏ జైలులో ఉంచుతారో తెలుపడంతోపాటు ఆయనకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో 14 రోజుల్లోగా వెల్లడించాలని భారత అధికార వర్గాలు తెలియజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి రిమాండ్‌ విచారణను వచ్చే నెల 27న వీడియోలింక్‌ ద్వారా చేపట్టనున్నట్లు మెజిస్ట్రేట్‌ తెలిపారు. 

ఒకవేళ గత ఏడాది డిసెంబర్‌లో కింగ్‌ఫిషర్‌ మాజీ అధినేత విజయ్‌ మాల్యాను ఆర్ధర్‌ జైలులోనే ఉంచుతామని ప్రకటించినట్లు నీరవ్‌ మోదీని కూడా అదే జైలులో ఉంచితే తమకు ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని మెజిస్ట్రేట్‌ తెలిపారు. కాగా మోదీ తరపు న్యాయవాది క్లేర్‌ మాంట్‌గోమరీ కూడా మాల్యాను ఉంచిన జైలులోనే నీరవ్‌ను ఉంచితే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని తెలిపారు.

click me!