Nykaas Falguni Nayar: ప్ర‌పంచ మ‌హిళా కుబేరుల్లో ఫాల్గుణి నాయర్.. ర్యాంక్ ఎంతంటే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 30, 2022, 09:41 AM IST
Nykaas Falguni Nayar: ప్ర‌పంచ మ‌హిళా కుబేరుల్లో ఫాల్గుణి నాయర్.. ర్యాంక్ ఎంతంటే..?

సారాంశం

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో చోటు సాధించారు నైకా (Nykaa) వ్యవస్థాపకురాలు ఫాల్గుణి నాయర్. ఫాల్గుణి నాయర్ ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరిగా నిలిచారు. నైకాసంస్థ బ్యూటీ, పర్సనల్ కేర్ (BPC) ఉత్పత్తులను ఆన్‌లైన్ విక్రయిస్తోంది.  

నైకా ఉత్పత్తులు గురించి ఆడవారికి వేరే చెప్పనక్కర్లేదు. తమ అందాన్ని మరింత పెంచే నైకా ఉత్పత్తులంటే మహిళలకు ఎంతో ఇష్టం. అయితే ఈరోజు మనం ఆ నైకా సంస్థ వ్యవస్థాపకురాలైన ఫాల్గుణి నాయర్ గురించి తెలుసుకుందాం..ఈరోజే ఎందుకంటే..ఇండియాలోనే 10వ‌ మహిళా బిలియనీర్ గా స్థానం సంపాదించారు. సౌందర్య, సంరక్షణ ఉత్పత్తుల ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ ‘నైకా’ను నాయ‌ర్‌ నిర్వహిస్తున్నారు. నైకా భారతదేశపు మొట్టమొదటి యునికార్న్ స్టార్టప్. ఒక మహిళ నేతృత్వంలో 2012లో ఫాల్గుణి నాయర్‌చే స్థాపించబడిన ఈ సంస్థ మొబైల్, వెబ్ సైట్ ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. 58 ఏళ్ల నాయర్ ఇప్పుడు ఆమె అత్యంత సంపన్న స్వీయ నిర్మిత బిలియనీర్‌గా స్థానం పొందారు. 

ప్రపంచంలోనే స్వయంకృషితో ఎదిగిన అగ్రగామి 10 మంది మహిళా బిలియనీర్లలో నైకా వ్యవస్థాపకురాలు ఫాల్గుణి నాయర్ చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో తొలిసారి అడుగు పెడుతూనే 7.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.57,000 కోట్ల) సంపదతో ఫాల్గుణి ఈ ఘనత సాధించినట్లు హురున్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. ప్రపంచ అగ్రగామి 10 మంది మహిళా కుబేరుల్లో మనదేశం నుంచి ఉన్న ఏకైక మ‌హిళా ఫాల్గుణి (58) కావడం విశేషం. ఇప్పటిదాకా 10వ ర్యాంకులో ఉన్న బయోకాన్ చైర్ ప‌ర్సన్ కిరణ్ మజుందార్ షా స్థానాన్ని నాయర్ ఆక్రమించారు. సౌందర్య, ఫ్యాషన్ బ్రాండ్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న నైకాను యూనికార్న్ (రూ.7500 కోట్లు అంతకంటే ఎక్కువ విలువ గల కంపెనీ)గా మార్చిన ఘనత ఈమె సొంతం. 

నైకా అంటే సంస్కృతంలో నటి అని అర్థం. భారతీయ యువకులలో ప్రధానంగా మహిళలు వారి స్థానిక దుకాణాలలో ఆఫర్‌తో పోలిస్తే ఎక్కువ ప్రొడెక్ట్స్ ఉండే బ్రాండ్‌లను విక్రయించడానికే ఇష్టపడతారు. నైకా ప్రజాదరణ పెరిగేకొద్దీ, కత్రినా కైఫ్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులు, ఇతర సోషల్ మీడియా ప్రభావశీలులు, కొందరు ప్రముఖులు నైకా ఉత్పత్తుల గురించి పబ్లిసిటీ ఇవ్వటంతో దాని బ్రాండ్ ఆకర్షణ మరింత పెరిగింది. 2015 నుండి నైకా సొంతంగా తయారుచేసిన వస్త్రాలు, గృహోపకరణాలను కూడా అమ్మటం మొదలుపెట్టింది. అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఈ బ్రాండ్ కు ఇండియాలోనే 84 స్టోర్లును స్థాపించటం విశేషం.

ప్రస్తుతం ప్రపంచంలో స్వయం కృషితో ఎదిగిన మహిళా బిలియనీర్లు 124 మంది ఉన్నారు. వీరంతా 16 దేశాలకు చెందిన వారే. జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, దక్షిణకొరియాల నుంచి ఒక్కరూ కూడా ఈ జాబితాలో లేరు. జాబితాలో మూడింట ఒక వంతు మంది చైనా నుంచే ఉన్నారు. అగ్రగామి 10 మందిలో ఏడుగురు కూడా చైనా వారే కావ‌డం విశేషం. అయిదేళ్ల కిందటితో పోలిస్తే మహిళా బిలియనీర్ల సంఖ్య రెట్టింపు అయ్యింది. పదేళ్లతో పోలిస్తే 100 మంది అదనంగా చేరారు. బీజింగ్ కు చెందిన స్థిరాస్తి డెవలపర్ పు యాజున్ (58) 17 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే స్వయం కృషితో ఎదిగిన అగ్రగామి మహిళా బిలియనీర్‌గా మారారు. 

ఫాల్గుణి నాయర్, మజుందార్ షా కాకుండా.. భారత్‌లో మరో మహిళా బిలియనీర్ రాధా వెంబు (3.9 బిలియ‌న్ డాలర్లు) ఉన్నారు. ఆమె సోదరుడితో కలిసి 'జోహో'ను ఏర్పాటు చేశారు. అత్యధిక సంపదను పెంచుకున్నవారిలో వెంబు రెండో స్థానంలో నిలిచింది. సాఫ్ట్ వేర్‌ కంపెనీ కాన్‌ప్లూయెంట్ వ్యవస్థాపకురాలు నేహా నర్ఖేడే కూడా భారత సంతతికి చెందిన వారే కానీ..అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 1.6 బిలియన్ డాలర్లతో కొత్త మహిళా బిలియనీర్లలో అగ్రగామి-10లో ఆమె ఉన్నారు. ప్రపంచంలో మొత్తం 556 మంది మహిళా బిలియనీర్లు ఉండగా.. అందులో సొంతంగా ఎదిగిన వారు 124 మంది అని హురున్ తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

Toll Plaza: ఎలాంటి పాస్‌లు లేకున్నా స‌రే.. మీరు టోల్ చార్జీలు క‌ట్టాల్సిన ప‌నిలేదు, ఎలాగంటే..
OYO: క‌పుల్స్‌కి పండ‌గ‌లాంటి వార్త‌.. ఇక‌పై ఓయో రూమ్‌లో ఆధార్ కార్డ్ ఇవ్వాల్సిన ప‌నిలేదు